ఇరుగు పొరుగు: సచిన్ కేత్కర్ రెండు లైబ్రరీ కవితలు

By telugu team  |  First Published May 25, 2021, 3:26 PM IST

ఇరుగు పొరుగు శీర్షిక కింద వారాల ఆనంద్ గుజరాతీ కవి సచిన్ కేత్కర్ రాసిన రెండు లైబ్రరీ కవితలను అందించారు. వాటిని ఇక్కడ చదవండి.


అదృష్ట వశాత్తూ 
గ్రంధాలయంలోకి ప్రవేశించే ముందు 
బూట్లు విప్పాల్సిన పని లేదు 
నుదుటి పై తిలకం 
దిద్దాల్సిన పనీ  లేదు 
పూజ చేయాల్సిన అవసరమూ లేదు 
చివరకు నీకు నువ్వే శిథిలమయిపోయిన 
భావనతో కూడా 
గ్రంధాలయంలోకి వెళ్ళొచ్చు 

అదృష్టవశాత్తూ 
నువ్వు పర్వతాలు ఎక్కాల్సిన పనిలేదు 
ప్రజల్ని సంతోష పెట్టాల్సిన పనీ లేదు 
పూల గుత్తి చేతిలో పట్టుకుని 
సన్మానించడానికి నిలబడాల్సిన అవసరం లేదు 

Latest Videos

లోనికి ప్రవేశించే ముందు 
గొడుగును ద్వారం దగ్గరే వదిలేసినట్టు 
అన్ని కోరికల్నీ వదిలి వేయవచ్చు 
గడియారం లోని ముళ్ళు లానో 
పేజీలో పంక్తి లానో కూర్చోవచ్చు 
అసలు ఉనికి లోనే 
లేకుండా పోవచ్చు.

          గుజరాతీ మూలం: అజయ్ సర్వయా 
          ఇంగ్లీష్: సచిన్ కేత్కర్ 
          అనుసృజన: వారాల ఆనంద్ 
===================== 

నీ ఏకాంతం 

నువ్వు లైబ్రరీలో వున్నప్పుడు 
నీకు ఆకలిగా వుంటే 
నీకోసం ఎవరూ తయారు చేయరు 

నువ్విక్కడ యుగాలుగా కూర్చుని వున్నా 
నేన్నేవరూ అంతగా గమనించరు 

నీ ఆరోగ్య చరిత్ర,  నీ చిరునామా 
నీ విజిటింగ్ కార్డు,  లేదా నీ అలవాట్లూ 
ఇవన్నీ ఇక్కడ అర్థం లేనివి 

నువ్విక్కడ తుమ్మినా దగ్గినా 
ఎవరూ పట్టించుకోరు 

లైబ్రరీ లో నీ పాక నుంచే వెళ్ళే వాళ్లకు కూడా 
నీ ఉనికి ఇక్కడ అర్థం లేనిది 

పేజీలలోని పదాలు 
ప్రజల భావాల్ని ప్రభావితం చేస్తాయి 
పాఠకుల ప్రవర్తనలని కాదు 

నీ కులాన్నీ, మతాన్నీ 
గుర్తింపునీ, గొప్పదనాన్నీ 
లైబ్రరీ పట్టించుకోదు 

నువ్వెవరో నీకు నువ్వే 
చెప్పుకోవాలనుకున్నా 
లైబ్రరీ పట్టించుకోదు 

లైబ్రరీ కేవలం 
నీ ఏకాంతాన్నీ  మాత్రమే 
ఆమోదిస్తుంది హర్షిస్తుంది.

          గుజరాతీ మూలం: అజయ్ సర్వయా 
          ఇంగ్లీష్: సచిన్ కేత్కర్ 
          అనుసృజన: వారాల ఆనంద్

click me!