కన్నీళ్ళ మీద కప్పిన దుప్పటే నవ్వంటే! అంటూ మహబూబాబాద్ నుండి రహీమొద్దీన్ రాసిన కవిత ' చిరునవ్వు దుప్పటి! ' ఇక్కడ చదవండి :
అబద్ధాలు చాపకింద నీరులా
పరుచుకున్న నేల మీద
నిజంలా నిలబడ్డ కాళ్లకు కష్టంగానే ఉన్నది
నిత్యం వేడెక్కి చల్లారే
మోసపూరిత ఉద్వేగాల మధ్య
హృదయం సప్పబడ్డ నాలుకలా మారిపోతున్నది
ఒక్కొక్క భ్రమను
ఒలుచుకుంటూ పోతుంటే
గుప్పెడు ఆనందం ఉల్లిపాయలా విడిపోతున్నది
పుట్టక ముందే
ఓటమి కాటేసిన బ్రతుకులో
గెలుపు
విరామం లేని యుద్ధమయిపోయింది
నొప్పి తెలియకుండా
మనల్ని మనం మోసగించుకునే
మత్తు మందు లాంటిది చిరునవ్వు
నిజానికి
కన్నీళ్ళ మీద కప్పిన దుప్పటే నవ్వంటే!