రేడియమ్ కవిత : ఈటె

By SumaBala Bukka  |  First Published Oct 28, 2022, 11:52 AM IST

ఓటు హక్కు ఉన్నా ఈటె విసరడం తెలియదు అంటూ హైదరాబాద్ పాతనగరం నుండి రేడియమ్ రాసిన కవిత  " ఈటె " ఇక్కడ చదవండి : 


యుద్ధాల్లో మునిగి
పతనమైనదొకటి
యుద్ధాల్లో గెలిచి
నష్టపోయినదొకటి
ఆనాటి కట్టడాలు
బీటలు పోయిన కోటలు
నేడు దర్శనీయ స్థలాలు...
నూతన విజ్ఞాన దారులు
మారిన ఆలోచన సరళి
ప్రజాస్వామ్యంతో మారిన మానవాళి
ఆర్థిక పునాదులే
ప్రభుత్వాలకు బలం
పునాదులే పేక ముక్కలైతే
పేదరికంలో దేశాలు...
అనాలోచిత
ఉచితాల ఉరితాళ్లు
ప్రభుత్వాల ఆర్థిక పతనాలు
గెలుపు కొరకు 
ఎన్నికల ప్రణాళికలు
అమలు అమావాస్య చంద్రుడు...
ప్రజాప్రయోజనాలకు తిలోదకాలు
స్వలాభాలకు వెన్నెల దారులు
ఆస్తుల రక్షణకు కుర్చీ
రాజకీయం నేడు వ్యాపారం
ప్రజలు చూడ బానిసలు
రాచగబ్బిలాల పురాతన సంకేతాలు
రాతి గోడల్లో మొలచిన మఱ్ఱి వెర్రి
మెదళ్లో కుట్రల ముళ్ల దారులు...
ఓటు హక్కు ఉన్నా
ఈటె విసరడం తెలియదు
తెలిసిన నాడు
ఓడలు బండ్లు

click me!