శ్రీరామ్ ఆర్య రాసిన " ఆర్యా శతకం " పైన వేదార్థం మధుసూదన శర్మ చేసిన సమీక్ష ఇక్కడ చదవండి.
తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు విశిష్ట స్థానం ఉంది. కాలం మారుతున్నట్లుగానే,తెలుగు సాహిత్యములో కూడా ఎన్నో నూతన ప్రక్రియలు వికసిస్తూనే ఉన్నాయి. కానీ వీటన్నింటిలో శతక ప్రక్రియ మాత్రం అజరామరంగా, నిత్య నూతనంగా వర్ధిల్లుతూనే ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం.
ఛందస్సు రీత్యా పద్యాలలో అనేక రకాలు ఉన్నా, కంద పద్యం రాసిన వారినే కవిగా కీర్తిస్తున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ ఆర్య కూడా కంద పద్యాలు రచించిన శతకం ఆర్యా శతకం. నాగర్ కర్నూల్ జిల్లా, నంది వడ్డెమాన్ గ్రామానికి చెందిన ఆవుల చెన్నమ్మ, సత్యన్న గార్ల సుపుత్రుడు శ్రీరామ్ ఆర్య వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యం మరియు చారిత్రక అంశాలపై మక్కువ పెంచుకొని తెలుగు సాహితీ రంగంలో ప్రముఖంగా రాణిస్తున్నారు.
శ్రీరామ్ ఆర్య జన్మస్థలమైన నంది వడ్డేమాన్ గ్రామం పూర్వం వర్థమానపురంగా పిలువబడింది. ఈ గ్రామం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాహిత్యపరంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ గ్రామంలోని శ్రీ జ్యేష్టా దేవి సమేత పార్థ సప్త శనీశ్వర స్వామి క్షేత్రాన్ని, క్షేత్ర మహత్యం, శనిదేవుని మహిమలు, వివిధ గ్రహాల ప్రభావాలను తెలుపుతూ గతంలో వీరు ఒక ఉద్గ్రంధాన్ని వెలువరించారు. ఇందులో ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు కావలసిన విలువైన సమాచారము ఉన్నది.
అలాగే వీరి స్వగ్రామం నందివడ్డేమాన్ గ్రామము చారిత్రక నేపథ్యం, ప్రముఖ అవధాన జంట కవులైన శేషాద్రి రమణ కవులు రచించిన "వసుంధర" అనే నవలను వీరు పునర్ముద్రణ గావించారు. వీటన్నింటినీ పరిశీలిస్తే శ్రీరామ్ ఆర్యకు చారిత్రక, ఆధ్యాత్మిక అంశాల పట్ల ఎంతటి ఆసక్తి, అవగాహన, పట్టు ఉందో మనకు ఇట్లే అవగతం అవుతుంది.
ఇలా కాకతీయులకు పశ్చిమాంధ్ర రాజధానిగా వర్ధిల్లిన వర్ధమాన పుర రాజ్యం అంటే ప్రస్తుత నందివడ్డెమాన్ గ్రామంలోని చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలను గతంలో వీరు వచన రూపంలో రాసారు. ప్రస్తుతం ఈ ఆర్యా శతకంలో పద్యరూపంలో రచించారు. ఈ అంశాలతో పాటు ఇందులో దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, గురుభక్తి మొదలైన వాటిని తో పాటు, వివిధ సమకాలీన సామాజిక అంశాలకు సంబంధించిన వాటిని కూడా ఇందులో ప్రస్తావించారు.
శతక సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీకారంతో మొదలైన వీరి ఈ శతక రచన తల్లిదండ్రులు, గురువులు, ఇష్టదేవతల స్తుతితో పరుగులు తీసింది.
"రమ్మని పిలిచియు నాచే
కమ్మని ఆర్యా శతకము గావించితిని నా
నెమ్మనమున నిల్చి శివా!
సమ్మోదము గూర్చినావు జయమగు నార్యా!"
"నమ్మి అమరగిరి శివుడిని
కమ్మని ఆర్యా శతకము కందముగూర్చి
రమ్మని పిలిచి వీణను అమ్మ కొరకు శిరము వంచి అనువుగ ఆర్యా!"
అని పైన తెలిపిన పద్యముల ద్వారా వీరు కొల్లాపూర్ పట్టణానికి సమీపంలో ఉన్న అమరగిరిలోని శ్రీ అమరేశ్వర స్వామి సన్నిధిలో మండలం రోజులు దీక్ష వహించి, అక్కడే బస చేసి, శివారాధన చేయగా వీరికి శివానుగ్రహం, శ్రీ సరస్వతీ మాత కటాక్షం సిద్ధించి, ఈ ఆర్యా శతకం రూపొందించడం అనేది గొప్ప ఆధ్యాత్మిక, దైవ లీలగా భావించవచ్చు.
తన స్వగ్రామంలోని చారిత్రక అంశాలను
"ఊరి చరిత్రను మొదలిడి....."
"రుద్రమ సేనాపతియై....."
మొదలైన పద్యాలలో ప్రస్తావించారు. ఇందు కొరకు
"పురమున పుట్టిన పుట్టుక
పురమునకే ఇచ్చి నేను పొందితి సౌఖ్యమ్ము
పురమును మా పుట్టినిల్లని
పురమును బూజించిన పుణ్యంబార్యా"
అని తనకే కాదు ప్రతి ఒక్కరికి జన్మ భూమిపై భక్తి, ప్రేమ ఉండాలని, ఆ రుణాన్ని తప్పక తీర్చుకోవాలని ఈ పద్యంలో సందేశాత్మకంగా సెలవిచ్చారు శ్రీరామ్ ఆర్యా గారు.
తెలుగులో తొలి రామాయణం గా ప్రసిద్ధికెక్కిన రంగనాథ రామాయణాన్ని రచించిన గోనబుద్ధారెడ్డిని కూడా "తెలుగు జనులు మురియగ నీ......" అని స్మరించుకోవడం తెలుగు కవులు అందరికీ ఆదర్శనీయం.
"దేశము దేవుడని కొలిచి......"
"గడప గడప తిరిగి తిరిగి......"
"సరిహద్దులలో నిలిచి యు....."
"పిల్లలు తెల్లని మల్లెలు....." మొదలైన పద్యాలలో వీరికి గల దేశభక్తి ప్రస్ఫుటం అవుతుంది.
అలాగే -
"చెప్పిన నీతిని చేదుగ....."
"వద్దని ఒకనాడు పలికి......"
"మార్పే అంతము ఆదిన్......"
మొదలైన పద్యాలలో నైతిక విలువలను పెంపొందించే అనేక అంశాలను వివరించారు.
"బంగారం కొరకు గుడులను....."
"పుట్టిన సచ్చిన దావతు....."
"గుడి భూముల కోనేరుల....."
"పట్టిన వదలదు వ్యసనము....."
"మట్టి శరీరము మీదను......"
"అతివల సొగసును కనుగొను....."
మున్నగు పద్యాలలో నేడు సమాజంలో కనిపిస్తున్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు చూపెట్టి, చక్కని వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించి నిరసించాడు. సమాజాన్ని సంస్కరించుటకు నడుం బిగించిన సామాజిక బాధ్యతగల కవి శ్రీరాం ఆర్య.
ఈ విధంగా వీరు సరళ సుందరమైన పదాలతో, వివిధ సామాజికాంశాల ప్రస్తావనతో పాటు, తన జన్మ భూమికి సంబంధించిన చారిత్రక, ఆధ్యాత్మిక అంశాల సమాహారంగా రూపొందించిన ఈ ఆర్యా శతకం ప్రతి పాఠకుడు చదవ దగినది. నీతి, భక్తి శతకాలు అధికంగా వస్తున్న నేటి కాలంలో ఇలాంటి చారిత్రక అంశాలతో కూడిన శతకాల వల్ల భవిష్యత్తు తరాల వారికి చారిత్రక వారసత్వాన్ని అందించడానికి వీలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇందుకు కృషి చేసిన శ్రీరామ్ ఆర్య గారు అభినందనీయులు.
ప్రతులకు సంప్రదించండి:
ఆవుల చెన్నమ్మ పుత్ర శ్రీరామ్ ఆర్య
ఇం.నెం.3-131, నందివడ్డేమాన్ గ్రామం,
బిజినేపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా,
పిన్ కోడ్ 509 215 , చరవాణి 9014447979.