చివరి పంక్తులు అంటే పతాక సన్నివేశమే అంటూ నిజామాబాద్ నుండి కందాళై రాఘవాచార్య రాసిన కవిత చివరి పంక్తులు !? ఇక్కడ చదవండి :
ఇదేమి ? మొదలే చివరి పంక్తుల మాటలా !
ఏదో మూటంతా ఇప్పుడే విప్పి చూపినట్లు
నోట్లోని చివరి పంక్తులు ఎప్పుడూ
మేలు మేలుగా విలువైనవే ---
రికార్డు చేసుకునేంత !
అంతిమ సమయంలో నత్తినత్తిగా
మాట్లాడినా చెవి యొగ్గి ఆశగా
వినాల్సిందే -‐-
తాత నిధి రహస్యం చెప్పవచ్చు
మీ తరతరాలు కుబేరులు కావచ్చు
చివరి మాటలు ఓర్పుగా వినాలి
అన్యమనస్కం ఎందుకు ???
ఉపాధ్యాయుడు పాఠం చివరగా
ఇంటి పని చెపుతాడు
వినకుంటే తెల్లవారి అరచేతుల
గోరింటాకు పండినట్లే
నూరు మార్కులు ఎలా వస్తాయి
విక్రమార్కుడవు ఎలా అవుతావు
కవితా పఠనంలో చివరి పంక్తులు అద్భుతంగా ముగుస్తాయి
జీవిత రహస్యం బట్టబయలు చేసినట్లు --
వినకపోతే కవి హృదయం ఎలా తెలుస్తుంది
కావ్యాల్లో అందుకే ఫలశృతులు
చివరి పంక్తులు అంటే
పతాక సన్నివేశమే ---
మొదటి సంగతి అంతా
చివర్లోనే--
చితికాడనే మనిషి కీర్తి అపకీర్తి
డప్పు చాటి చెపుతారు
చివరి పంక్తులే బతుకున
చివరకు మిగిలి పోతాయి !!