కవి, నాటక రచయిత. రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యం మంత్రశాస్త్రంలో ప్రవీణులు ఉమాపతి బాలాంజనేయ శర్మ ఆదివారం కన్నుమూశారు
కవి, నాటక రచయిత. రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యం మంత్రశాస్త్రంలో ప్రవీణులు ఉమాపతి బాలాంజనేయ శర్మ ఆదివారం కన్నుమూశారు. 13 సంవత్సరాల పిన్న వయసులోనే ఆదిశంకరాచార్యులు రచించిన దేవీ మానస పూజను ఆయన తెలుగులోకి అనువాదం చేశారు.
ఉమాపతి.. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కవితలు రచించారు. సిద్దిపేటకు చెందిన ఉమాపతి శర్మ ప్రారంభంలొ కొంతకాలం సెక్రటేరియట్ ఉద్యోగిగా పనిచేసారు. ఆ తర్వాత అల్ ఇండియా రేడియో వివిధ భారతి విభాగంలో వ్యాఖ్యాతగా సుదీర్ఘకాలం సేవలందించారు.
వివిధభారతి శ్రోతలకు ఉమాపతి సుపరిచితం. ఆయన రాసిన భువనవిజయం పద్యనాటకం జాతీయ స్థాయిలో దూరదర్శన్ ద్వారా ప్రసారమై ప్రశంసలు పొందింది. హంపీ సుందరి అనే పద్య నాటకంతో ఇతర పద్యకృతులు రచించారు.
ఉమాపతి blues and blossoms అనే ఆంగ్ల కవితా సంకలనం వెలువరించారు. రచనలతో పాటు జ్యోతిష్యంలో ఎంతో పరిశోధన చేసిన ఉమాపతి శర్మ ఎంతో మంది ప్రముఖుల విశ్వాసాన్ని చూరగొన్నారు.
నిరాడంబరుడు కావడం వల్ల ఎక్కువగా సాహిత్య లోకంతో సంబంధాలు పెట్టుకోలేదు. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలోనే మునిగి తేలారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని బాలాంజనేయ శర్మ ఎంతగానో కోరుకున్నారు.
జాతీయ అంతర్జాతీయ రాజకీయాలను సునిశితంగా పరిశీలించడమే కాకుండా సాధికారికంగా విశ్లేషించే ప్రతిభ ఆయన సొంతం. గత కొంతకాలంగా ఉమాపతి శర్మ మధుమేహం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు.
ఆయన మరణంపై తెలంగాణ సాహిత్య లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలకు బాలాంజనేయ శర్మ మృతి పూడ్చలేని లోటని పలువురు సంతాపం ప్రకటించారు.