ప్రముఖ గాయకుడు, కవి, కళాకారుడు నిస్సార్ ఆకస్మికంగా మరణించారు. ఆయన సాహిత్య, కళా ప్రదర్శన కృషిని ప్రస్తావిస్తూ సంగిశెట్టి శ్రీనివాస్ నివాళి వ్యాసం రాశాడు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమారంభంలో వామపక్ష ఉద్యమాల్లో ఉండి అస్తిత్వవాదాలతో మమేకమయిన వాళ్ళు చాలా తక్కువ. అట్లాంటి తక్కువ మందిలో ముందు వరుసలో ఉండే విద్యుద్గళం నిస్సార్. అవును విద్యుద్గళమే! ఆ కంఠంలో ఒకరకమైన షాకింగ్ ఫోర్స్ ఉండేది. హై వోల్టేజి ఉండేది. దోపిడీ, దుర్మార్గాలపై పిడుగులు కురిపించేది. సిపిఐ రాజకీయాలతో ఉండి కూడా తెలంగాణ, ముస్లిం అస్తిత్వ ఉద్యమాలతో మమేకమయిన కవి, పాటగాడు, గాయకుడు, కథకుడు మొహ్మద్ నిస్సార్. ఎందుకంటే మొదట్లో సిపిఐ తెలంగాణ ఉద్యమానికి మద్ధతియ్యలేదు. అయినప్పటికీ నిస్సార్ తెలంగాణ రాష్ట్రం కోసం గళం విప్పిండు. డప్పుకొట్టిండు. కేవలం రాయడమే కాదు. దాన్ని కైగట్టి పాడెటోడు. గొంతులోని ఒకరకమైన కంచు ధ్వని అందరినీ కట్టిపడేసేది. సాదా సీదాగా జబ్బకు సంచేసుకొని మీటింగులకొచ్చేది. అన్నా! నీ పాట అనంగనే గొంతందుకునేది.. అట్లాంటి ఉద్యమ గొంతుక ఇయ్యాళ శాశ్వతంగా మూగపోయింది. కోవిడ్ కాలంలో కనీసం కడసారి సూపుకు కూడా నోసుకోలేక ఈ నాలుగు దు:ఖపు వాక్యాలు మీతో పంచుకుంటున్న.
పొట్టకూటి కోసం క్లీనర్‌గా, ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేసిన నిస్సార్ తర్వాతి కాలంలో ఆర్టీసీలో కండక్టర్‌గా ఉద్యోగంలో చేరిండు. ఓపెన్ యూనివర్సిటీలో పట్టా అందుకున్నడు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఉద్యమాలతో మమేకమయిండు. ఆర్టీసీలోని కమ్యూనిస్టు అనుబంధ సంఘాల్లో పనిచేస్తూనే ప్రజా నాట్యమండలి కార్యదర్శిగా పనిచేసిండు. కార్యదర్శిగా ఉంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించిండు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఉద్యమానికి ప్రాణ వాయువుగా ఉండిన ఎన్నో పాటలను అల్లిండు. ఒక్క తెలంగాణ ఉద్యమమే గాకుండా ముస్లిం అస్తిత్వ వాద ఉద్యమాలతో కూడా మమేకమయిండు. ఎన్నో ఉత్తేజకరమైన పాటలు రాసిండు. అందులో
‘‘ముసల్మానులం మేము ఈ దేశ మూ వాసుల
హిందుస్థానీయులం మేము అంత
జాంబవంతుని వారసులం’’ అంటూ మూలనివాసీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిండు. అట్లాగే
‘‘సాయబో సాయబు నిన్నంటరు నవాబు
నీ జిందగి ఎంత గరీబుదో నవాబు
దునియా మీది దు:ఖమంత దువాజేస్తే పోతదంటు’’ రాసిండు.
‘‘ఏ ఐసా క్యోం భాయియో ముసల్మాన్ సాథియో
చేతి పనులు చేసి చేసి చేతులే పనిముట్లు అయ్యే
అర్కతెంత ఉన్నా గాని బతుకులింత బర్కతు లేదు’’ అని చేతి వృత్తులు చేసుకుంటున్న ముస్లిము జీవితాల్లోని వెతలను తన పాటల ద్వారా కైగట్టిండు.
‘‘ముస్లీంలం ముస్లీంలం
పల్లెటూర్ల ఉండేటి ముస్లీలంము
ముస్లీములము మేము ముస్లీంలము
పల్లె నేలతల్లి మట్టి బిడ్డలము
అరబ్బీ ఉర్దు రానోల్లము
తెలుగు భాషలోనె చదువుకున్నోల్లము’’ అంటూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలల్లో నివసిస్తున్న ముస్లిం జీవితాలను పక్కా తెలంగాణ భాషలో చిత్రించిండు.
ఎన్నో సార్లు ఉద్యమ సమయంలో అన్నా తెలంగాణను వ్యతిరేకించే కమ్యూనిస్టులతో మనకు దోస్తానీ ఏందే నువు బయటికి రా.. అంటే.. లేదన్నా వాళ్లు కూడా మారుతున్నరు. వాళ్ళని మార్శెటోడు ఆడొకడు మనోడు ఉండాలె.. ఆ పని నేను జేత్తున్న అనుకోరాదు.. అనెటోడు. అట్లాగే రజాకార్ల సందర్భంలో ముస్లింల జీవితాలను గురించి ఎన్నో ముచ్చటు చెప్పెటోడు. అట్లాంటి ముచ్చట్ల నుంచే తెలంగాణ నియ్యత్, మిగతా కులాలతో కలిసి మెలిసి, అక్కా, బావా అని పిలుచుకునే వరుసలు రికార్డు చేస్తూ ‘ముల్కి’ అనే కథ రాసిండు. కథలు తక్కువే రాసిన తెలంగాణ జీవితాలను రికార్డు చేసిండు.
తెలుగు ప్రజల జీవితాలను పాటల్లో రికార్డు చేసిండు. గద్దర్‌పై దాడి జరిగినప్పుడు స్పందించి పాట రాసిండు. చంద్రబాబుని నిలదీసిండు. అదీ ఆర్టీసీ ఉద్యోగిగా ఉంటూనే! వృత్తులు చేసుకునే వారి జీవితాలను, పెరుగుతున్న స్కూు లుఫీజు, ధరల పెరుగుదల, రైతులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లు, కార్మికులపై పాటల్లిండు.
అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంతో మమేకమయిండు. ఎన్నో అద్భుతమైన పాటలు రాసిండు. ‘దగాపడ్డ తెలంగాణ దండు కదిలిందిరో’, ‘ఇత్తర ఇయ్యరా ఇప్పుడన్న తెలంగాణ’, ‘ఇంత జరుగుతున్న ఇంక ఆపుడేందిరి ఓ నాన్చుడేందిరో’, ‘రండిరో తెలంగాణ’, ‘తెలంగాణ తెలంగాణ బతుకుదెరువై తెర్లయిపోయిన బందీఖాన’, ‘కొత్తిమిర కళ్యమాకు కారం ఎచ్చాలు మనయి... బియ్యం చింతపండు, పప్పు గిప్పు మనయే, అంతా మనయేసి వంట జేసినంక వాడు ఆంధ్రా భోజనమంటూ బోర్డు పెట్టుడేందిరా...’’ అంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విస్తృతి చేసిండు. ఈయన రాసిన ‘పండు వెన్నెల్లలో పాట చాలా పాపులర్. అందులో నుంచి రెండు చరణాలు.
‘‘నన్నారె- నన్నారె- నన్నారె- నన్నారె
నన్నారె నన్నారె నారె
నారె నన్న నార- నారె నన్నారె నాన నారే...!
పండు వెన్నెల్లలోన - వెన్నే న్నెల్లలోన
పాడేటి పాటలేమాయె?
మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయె..?
బాల నాగమ్మ భక్త శిరియాల హరిశ్చంద్ర
అల్లిరాణి ఆటలేమాయె?
మన పల్లెటూరి లాడె బాగోతాల జోరేది?
స్టేజి కరెంటు మైకు ఏదీ లేకున్నగాని
తెల్లార్లు ఆడిపాడేది
మన పల్లె గుండెలోన మోగేటి కంచుగొంతులేవి?
భీముండర వొరె ద్వారకా!
భీముండరిపుజర కారుండ
కౌరవ నామంబు గలనే శూరుండరా- చల్
చిందేస్తూ చిత్రంగి వూరంత తిరిగేటి
చిందోల్ల వేషాలేవి?
మన పల్లెల్లో ముద్దుబిడ్డు పిట్ట దొరలు ఎటుపోయిరి?
ఇట్లా తెలంగాణ జానపదుల జీవితాలను, గ్రామీణ జీవన సౌందర్యాన్ని తన పాటల్లో చిత్రికగట్టిండు.
ఇప్పటి భువనగిరి యాద్రాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో మహ్మద్ అబ్బాస్, హలీమా దంపతులకు డిసెంబర్ 16, 1962లో జన్మించిన మొహ్మద్ నిస్సార్‌లోని ప్రతిభను మొదట గుర్తించి ప్రోత్సహించింది సుద్దాల అశోక్ తేజ. ఆ తర్వాతి కాలంలో గద్దర్ స్ఫూర్తితో కళను, గళాన్ని సామాజిక చైతన్యానికి వినియోగించిండు.
నిస్సార్ లేని లోటు ఆయన భార్య, ఇద్దరు కొడుకుల బిడ్డకే గాదు మాలాంటి చాలా మంది దోస్తుకు కూడా పూడ్చలేనిది. నిస్సార్ లేడు... కానీ ఆయన పాట ద్వారా ఏసిన తొవ్వ ఉన్నది. ఆ బాట నడువడమే నిస్సార్‌కు నిజమైన నివాళి.
- సంగిశెట్టి శ్రీనివాస్