చైనా దాడిలో గాల్వన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో మరణించిన భారత అమర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ కొలిపాక శ్రీనివాస్ కవిత రాశారు. ఆ కవితను మీ కోసం అందిస్తున్నాం.
ఆకాశమంతా ధైర్యాన్ని
కూడగట్టుకుని
భూదేవంతా సహనాన్ని
తోడుంచుకుని
కోట్లాది భారతప్రజల
ఆశయాలను మోసుకెళ్తూ
చీకటిని నీడలా వెంటపెట్టుకొని
వెలుగు సూర్యుడిని తట్టుకుంటూ
అహర్నిశలు సరిహద్దుల కంచె చుట్టూ కళ్లార్పని వీక్షణతో
కాపలా కాస్తున్న సైనికుల
గుండెల తెగువ అమోఘం.
షడ్రుతువులు ఒక్కటై
నిలిచిన వీరత్వముతో
ఎదురెల్లే సైనికా ధీరుడివి
యావత్ భారతజాతి ఎదలో
ధన్యుడవై వెలుగొందిన జ్యోతివి
భారతావని గగనతలంలో
చిరంజీవుడవై వెలిగే 'ధృవతార'
సైనికుడవు నువ్వు 'బాబు'.
ఆసేతు హిమాచలమంతా
మీకై కన్నీళ్లను వదులుతుంది
నింగిలో ఉన్న చుక్కలన్నీ
తలలువంచి మౌనంగా
శాంతి నివాళులు అర్పిస్తున్నవి
ప్రకృతిలో చెట్లన్నీ చేతులెత్తి
జోహార్లతో నివాళులిస్తున్నవి
పూసే ప్రతిపూవు రాలుతూ
జవాన్లకు అంతిమయాత్రలో
కన్నీటి వీడ్కోలు పలుకుతున్నవి
ప్రజావాహిని మీకై అశ్రునయనాలతో
చేతులెత్తి జోహార్లతో సెల్యూట్ చేస్తూ
ఘన నివాళులు అర్పిస్తుంది
భారత జాతీయ జెండా రెపరెపలతో
జవాన్ల ఔన్నత్యాన్ని గర్వంగా చాటుతోంది.