కోడం కుమార్ ‘‘ పూల పరిమళం ’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రొఫెసర్ బన్న ఐలయ్య

By Siva Kodati  |  First Published Apr 21, 2022, 8:51 PM IST

కోడం కుమారస్వామి రచించిన 'పూలపరిమళం’ కవిత్వం గ్రంథాన్ని ప్రొఫెసర్ బన్న ఐలయ్య ఆవిష్కరించారు. కుమారస్వామి కవిత్వం మీద శ్రీశ్రీ, అలిశెట్టి ప్రభాకర్, వేమన, అంబేద్కర్, మార్క్స్ సాహిత్య సిద్ధాంతాల ప్రభావం ఉందని ఐలయ్య అన్నారు. 


పుస్తకం: పూల పరిమళం 
రచయిత : కోడం కుమారస్వామి
సమీక్ష : శివరాత్రి సుధాకర్

 

Latest Videos

అధ్యాపకుడిగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తూనే సాహిత్య సృజన చేస్తున్న కవి కోడం కుమారస్వామి అని ... అతని కవిత్వంలో సామాజిక బాధ్యత, నిబద్ధత కలిగి ఉన్నాయని కేయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ, పీజీ కాలేజీ ప్రధానాచార్యులు ప్రొఫెసర్ బన్న ఐలయ్య అన్నారు. బుధవారం సాయంత్రం వరంగల్ లోని ఎల్.బి. విద్యా కళాశాల సెమినార్ హాల్‌లో వరంగల్ రచయితల సంఘం కన్వీనర్ నల్లెల్ల రాజయ్య అధ్యక్షతన కోడం కుమారస్వామి రచించిన 'పూలపరిమళం’ కవిత్వం గ్రంథాన్ని ప్రొఫెసర్ బన్న ఐలయ్య ముఖ్యఅతిధిగా పాల్గొని ఆవిష్కరించారు. ఇరవై ఏళ్లుగా తాను రాస్తున్న కవిత్వాన్ని ప్రజల ముందుకు తేవడం అభినందనీయమన్నారు. సామాజిక చింతనలో భాగంగానే రచయితలు సాహిత్య సృజన చేస్తారని ఐలయ్య చెప్పారు. అట్టడుగు వర్గాల వైపు నిలబడి చేసిన రచనలను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని పేర్కొన్నారు.

కుమారస్వామి కవిత్వం మీద శ్రీశ్రీ, అలిశెట్టి ప్రభాకర్, వేమన, అంబేద్కర్, మార్క్స్ సాహిత్య సిద్ధాంతాల ప్రభావం ఉందన్నారు. తన జీవిత కాలంలో జరిగిన పోరాటాల సారాన్ని సైతం కవితలుగా సృజన చేశారని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కవులకు ప్రజాపోరాటాలే ముడిసరకును ఇస్తాయన్నారు. ఆధునిక కవిత్వం నిర్వచించడం సాధ్యం కాదని, దానిని నిర్వహించడమే కవుల కర్తవ్యమని బోధించారు. వచన కవిత్వం సామాన్యుల వెతలను, కథలను ప్రాతిపదికగా తీసుకొని రాసిన అక్షరాల్లో జీవం, జీవితం వుంటుందని ప్రశంసించారు. ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా పాఠకులు ఆధునిక జీవితం పట్ల స్పృహను కలిగి వుండాలని కోరారు. సామాజిక స్పృహలేని జీవులకు సాహిత్య సృజనను అవగాహన చేసుకోవడం క్లిష్టతరంగా కనిపిస్తుందన్నారు. 

కవి, విమర్శకులు శివరాత్రి సుధాకర్ 'పూల పరిమళం' కవిత్వాన్ని సమీక్ష చేస్తూ కోడం కుమార్ కవిత్వం ద్వారా ఈనేల మీద జరుగుతున్న పోరాటాలను అక్షరీకరించారని అన్నారు. సామాజిక, రాజకీయ దృక్పథంతో రాసిన సాహిత్యం చరిత్రలో తప్పకుండా నిలబడుతుందని కొనియాడారు. ప్రజాపక్షం వహించని అక్షరాలు ఎప్పటికైనా మట్టిలో కొట్టుకొని అడుగంటి పోతాయని చెప్పారు. అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్ అధ్యక్షుడు ఎన్. బ్రహ్మచారి మాట్లాడుతూ లెక్చరర్ గా పనిచేస్తూనే సాహిత్య రాజకీయాలలో కోడం కుమారస్వామి కీలక పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగులో మరుగున్న పడిపోతున్న పదబంధాలను తన కవిత్వంలో నిక్షిప్తం చేయడం ఆయన కవిత్వంలోని ప్రత్యేకతగా అభివర్ణించారు. 

డి.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కవిగాయకులు తంగెళ్ల సుదర్శనం మాట్లాడుతూ ముంచుకొస్తున్న సామ్రాజ్యవాద పాలకుల కుట్రలను రచనల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎల్.బి. విద్యా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపకులు కేవలం బోధనకే పరిమితం కాకుండా రచనల్లో ముందుండటం హర్షణీయమన్నారు. ఛాత్రోపాధ్యాయుల్లో భాషా, సంస్కృతుల పట్ల అవగాహన కల్పిస్తేనే ప్రగతిశీలమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కవి, రచయిత కోడం కుమారస్వామి, కె.శారద, సీనియర్ కవి శాఖమూరి రవి, శివపురం రాధ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ పరిచయ సభలో జంగ వీరయ్య, తాటి పాముల రమేశ్ ,కాలేజీ అధ్యాపకులు ,అరవై మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు .

click me!