మన చరిత్రమే మనమే రాసుకునేలా... తెలంగాణలో చారిత్రాత్మక సందర్బం: ఎమ్మెల్సీ కవిత

By Arun Kumar P  |  First Published Apr 21, 2022, 12:07 PM IST

హైదరాబాద్ లోని కోఠి మహిళా కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎం, దేవేంద్ర రచించిన "తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ" పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటి ప్రభలతో వెలుగొందుతోంది అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిన్న(బుధవారం) తన కార్యాలయంలో కోఠి మహిళా కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన "తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ" గ్రంథాన్ని కవిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ప్రస్తుతం తెలంగాణలో ఆవిష్కృతమైందని అన్నారు. తరతరాల మన మూల సంస్కృతి, సమాజ పరిణామక్రమం, చరిత్ర, సాహిత్యం పైన ఇంకా విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. 

Latest Videos

undefined

తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ఆటుపోట్లను తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు తమ తమ కథల్లో, పాటల్లో, కవితల్లో, నవలల్లో నిక్షిప్తం చేశారని...  అందువల్లనే  తెలంగాణ సాహిత్యం వాస్తవిక జీవితానికి దగ్గరగా ఉంటుందని కొనియాడారు. మన తరతరాల సామాజిక చరిత్రకు సజీవ ప్రతీకగా తెలంగాణ సాహిత్యం నిరంతరం జీవనదిలా ప్రవహిస్తుందని.. అంతరించిపోతున్న తెలంగాణ కళలను సంరక్షించుకోవాలని కవిత గుర్తు చేశారు.

డా.ఎం. దేవేంద్ర ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 2016 లో పూర్తి చేసిన సిద్ధాంత గ్రంథం " తెలంగాణ కథ - వర్తమాన జీవన చిత్రణ(1990-2010) " .  ఈ గ్రంథంలో కథానికల ద్వారా తెలంగాణ జీవితాన్ని, అస్తిత్వఉద్యమాలను కూలంకుషంగా చిత్రించారు రచయిత్రి ఎం. దేవేంద్ర.  తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోని అన్ని పరిణామాలను స్వీయానుభవాలతో అన్వయించి కథా విశ్లేషణ చేయడం ఈ పుస్తకం ప్రత్యేకత. దేవేంద్ర రచయిత్రి కావడం ఈ పరిశోధనకు కలిసి వచ్చిన మరో విశేషం. 

అత్మీయ అతిధిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తెలంగాణ కథానిక వాస్తవికతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. నారసింహచారీ, నవీనాచారీ, పారిశ్రామికవేత్త  వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

click me!