ఉచితాలకు అలవాటు పడి ఎంగిలిస్తర్ల కోసం ఎగబడుతున్నోళ్ళం! "మనమంతా గొప్పోళ్ళమే... !" అంటూ సోమశిల తిరుపాల్ రాసిన కవిత ఇక్కడ చదవండి:
ఒక్క రోజు ఆటకే
వందల కోట్లు రాసులుగా పోసి
సినిమా ఇండస్ట్రీని సైతం
సీటిగొట్టి గెలిపిస్తున్నోళ్ళం...
మనమంతా గొప్పోళ్ళమే... !
ఒక్కపూట ఆనందం కోసం
ఉన్న పైసలన్నీ మందుసీసాల్లో నింపేసి
వైన్ శాపు ఓనర్లందరినీ
పైపైన కూర్చోబెట్టుతున్నోళ్ళం...
మనమంతా గొప్పోళ్ళమే..!
వాటర్ లేకున్నా క్వార్టర్ మింగి
ఒక్కసారి ఓటు వేసి
ఐదేండ్లు అయిపోయెవరకు
అవినీతి నాయకుల ఆస్తులను
ఎవరెస్టు శిఖరాలకు సమంగా
ఎగబడి పెంచేస్తున్ళోళ్ళం
మనమంతా గొప్పోళ్ళమే... !
విజ్ఞానం పెంచే
విలువైన బడులనోదిలి
గుడులకోసం గుంపులుగా గుమిగూడి
వేలకోట్లను వేగంగా ఖర్చుచేస్తున్నోళ్ళం...
మనమంతా గొప్పోళ్ళమే..!
అందుకేనేమో.. ... !!
ఒక్కబిందె నీళ్ళ కోసం..
పక్కవాళ్ళతో చెక్కుచెదరని
ఉక్కుపోరాటం చేస్తున్నోళ్ళం..!
బక్కచిక్కి ముక్కిపోయిన
ఒక్కరూపాయి బియ్యం కోసం
రోజువారి కూలికి రోకలి చుట్టి
రోజులకు రోజులే క్యూ కట్టి
రోడ్ల పై నిరీక్షిస్తునోళ్ళం..
మనమంతా గొప్పోళ్ళమే..!
ఉచితాలకు అలవాటు పడి
ఎంగిలిస్తర్లకోసం ఎగబడుతున్నోళ్ళం!
కుచితాలు మనసులో నింపుకుని
పక్కింటితో పగను పెంచుకున్నోళ్ళం!
అన్ని నాకే కావాలన్న అత్యాశతో
ఎదురులేని పోరాటం చేస్తూ..
నిదురలేని ఆరాటం పడుతున్నోళ్ళం..!
మనమంతా గొప్పోళ్ళమే.. !
అన్నదమ్ములను సైతం ఆగంజేస్తూ
అంటరాని వాళ్ళుగా చూస్తున్నోళ్ళం!
నిజంగా నిజమే...
మనమంతా.. ఎంతో.. గొ ప్పో ళ్ళ మే..!