పెరిగిన విజ్ఞాన విపంచిలో మానవుల బాధ్యతను "స్వేచ్ఛా ప్రపంచం' కవితలో గుర్తు చేస్తున్నారు హైదరాబాద్ నుండి ప్రసూన బిళ్ళకంటి. ఆ కవితను ఇక్కడ చదవండి.
అరచేతిలో ప్రపంచం
అడుగడుగునా ఆనందం
కావలసిన స్వేచ్ఛ
అనుభవించేంత సంపద
వెతుక్కున్నంత విజ్ఞానం
కావలసిన సమాచారం
అందుబాటులో వనరులు
ఆదుకునే రాజ్యాలు
ఇదీ నేటి ప్రపంచ వర్తమానం
అంతలోనే
విజ్ఞానం పెరిగింది
స్వేచ్ఛ అవధులు దాటింది
యువత చెడుదోవ పట్టింది
నాయకుల ఉచిత స్వార్థకోరలకు
సామాన్యుడు బద్ధక బలిపశువు అవుతున్నాడు
తరాల సంస్కృతులు మంటగలిసి
విష సంస్కృతి విలువల వలువలు విప్పేసింది
పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు
సూక్ష్మ క్రిమి రూపంలో మూడవ ప్రపంచ యుద్ధం చేరింది
జరగాల్సిన నష్టం జరిగింది
పెరిగిన విజ్ఞాన విపంచిలో
సరిగమలనే స్వీకరించాలి
విశ్వంలో ప్రతిజీవి జీవించే హక్కును
బాధ్యతగా తెలుసుకోవాలి.