శాస్త్రీయ దృక్పధం ఆవశ్యకతను తెలియజేస్తూ "నీ ధైర్యమే దైవం" కవిత మేడ్చల్ నుండి చంద్రకళ. దీకొండ అందిస్తున్నారు . ఇక్కడ చదవండి.
రంగు రాళ్ళు, జాతకాలు
చిలక జ్యోస్యాలు, రాశి ఫలాలు
వాస్తు శాస్త్రాలు చుట్టూరా ఎన్నో మెట్టవేదాంతాలు...!
మాయ మాటలతో, ముఖస్తుతులతో
మత్తు మందు జల్లే మాయగాళ్ళు
ఆదమరచి ఉన్న అమాయక
లేడి పిల్లలను వేటాడే వేటగాళ్ళు...!
కనికట్టు చేసే కేటుగాళ్ళు...
క్షుద్రవిద్యలతో భయభ్రాoతులను చేసే బూటకపు బాబాగాళ్ళు...
మంత్రముగ్ధులను చేసే మంత్రగాళ్ళు...
ప్రవచనాలతో లోబర్చుకునే దొంగ స్వాములు...
సంతానయోగం కల్పిస్తానంటూ
అత్యాచారానికి పాల్పడే గోముఖ వ్యాఘ్రాలు...
లోకమంతా ఎందరెందరో...!
మాధ్యమాలలోనూ పెంచి పోషించే త్రి.డి. మాయాజాల "నాగబంధనాలు"...
అలవాటైన ఆచారాలు
నరనరంలో జీర్ణించుకుపోయిన మతపిచ్చి విశ్వాసాలు
మంత్రాలకు చింతకాయలు రాలవనే ఇంగితజ్ఞానం లేని ఆలోచనా లోపాలు...!
కట్టుబాట్లకు, సామాజిక జీవనానికి
నిర్దేశించిన ఆచార సాంప్రదాయాలు
సంకెళ్లయి మేధను దిగ్బంధనం చేస్తుంటే...
అవిద్య, అజ్ఞానం, బలహీనతలు
చేతబడులతో రాతలు మారుతాయంటూ నమ్మబలికే మానవాధముల మాటలకు లొంగి
ఆత్మహత్యలకు,నరబలులకు సిద్ధపడుతూ
మళ్లీ ఆదిమానవులుగా మసలుతున్న మానవులు...!శాస్త్రీయ ఊపిరి గాలులు పీల్చక
మూర్ఖత్వంతో ముడుచుకుపోయి
ఉన్న జన్మను త్యజించి
ఉందో, లేదో తెలియని పునర్జన్మకై పాకులాడుతూ
బలవుతున్న అభాగ్యులు ఎందరెందరో...!
ఆత్మవిశ్వాసం నీదైతే
ఆవహించవు ఏ అతీత శక్తులూ
నీలోని ధైర్యమే దైవం
నీలోని భయమే దెయ్యం
బోధనతోనూ, శిక్షణతోనూ
చిన్ననాటినుంచే శాస్త్రీయ
దృక్పథాన్ని పెంచితేనే
భావితరమైనా బాగుపడుతుంది...!!!