అందుకున్నాను: రూపీ కౌర్ MILK AND HONEY

By telugu teamFirst Published Sep 27, 2021, 1:31 PM IST
Highlights

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం రూపి కౌర్ ‘మిల్క్ అండ్ హనీ’ అందిస్తున్నారు వారాల ఆనంద్.

కొత్త తరాన్ని చూసినప్పుడు, వారి రచనల్ని చదివినప్పుడు, వారు వినిపించే సంగీతాన్ని విన్నప్పుడు,గీసే బొమ్మలనీ,రూపొందించిన సినిమాల్నీ చూసినప్పుడు సరికొత్త అనుభూతి కలుగుతుంది.

వారు ఆలోచించే విధానం, వాళ్ళు ఎంచుకునే అంశాలూ, వారి ఇమేజెస్, మెటాఫర్స్ వినూత్నమయిన విలక్షణ మయిన దృశ్యాల్ని ఆవిష్కరిస్థాయి. ముఖ్యంగా (LPG) లిబరలైజేషన్, ప్రైవటైజేషన్, గ్లోబలైజేషన్ల అనంతర కాలంలో జన్మించిన తరం ఆలోచనలు ఎంతో భిన్నంగా ఉంటున్నాయి.   ఇవ్వాళ వారు చూస్తున్న లోకం భిన్నమయింది. పెరిగిన సాంకేతికత, విస్తారమయిన ప్రసారమాధ్యమాలు వారి పైన  తీవ్రమయిన ప్రభావం కలిగిస్తున్నాయి. ఇంకో వైపు ఎక్కువ మందిని చేరేందుకు అవకాశాల్నీ అందిస్తున్నాయి. స్థానికత, ప్రాంతీయత పోయి ఆధునిక ఆధునకానంతర కాలప్రభావం కొత్త తరం వారి సృజన లో స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కవిత్వ రచనల్లో మనం గమనిస్తే గత తరాలు తమ స్కూలు కాలేజీ కాలాల్లో పాఠ్యపుస్తకాల్లోనూ, బయటా చదివిన,చూసిన క్లాస్సికల్ కవిత్వం, లెజెండరీ కవుల కవిత్వానికి భిన్నంగా నేటి యువత తమ సృజనని కొనసాగిస్తున్నారు. రూపంలోనూ సారంలోనూ కొత్త పోకడలకు తెర తీస్తున్నారు. అందులో అన్నీ మంచి పోకడలే వున్నాయని నేను అనను గానీ విభిన్నమయిన, మనసుకు హత్తుకునే కవిత్వం చాలానే రాస్తున్నారన్నది మాత్రం నిజం.

Latest Videos

అలాంటి ఒక ఇండో కనేడియన్ కవయిత్రి రూపి కౌర్ (Rupi Kaur) రాసిన మొదటి కవితా సంకలనం ఇటీవలే ‘అందుకున్నాను’. 1992లో పంజాబ్ లో జన్మిచిన రూపి కౌర్ తన మూడేళ్ళ వయసులో తల్లిదండ్రులతో కెనడా వలస వెళ్ళారు. ఆమె మొదటి పుస్తకం’మిల్క్ అండ్ హనీ’ MILK AND HONEY’

రూపి కౌర్ 18 ఏళ్ల వయసులోనే రచనా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తన రచనల్లో ప్రధానంగా స్త్రీల శారీరక మానసిక సమస్యల మీద రాసారు. ప్రేమ, కోల్పోయిన తనం, హింస, స్త్రీల అణచివేత తదితర అంశాల పైన కవిత్వం రాసారు. నిజానికి కవిత్వం కౌర్ జీవితంలో బాల్యం నుండే అంతర్భాగమై పోయింది. తండ్రి తన తల్లికి రోజు కవిత్వం గురించి గంటలకు గంటలు చెప్పేవాడు. అది ఆమెకు తొలి పరిచయం. తర్వాత సనాతన కుటుంబ ఆచార వ్యవహారాల రీత్యా రూపి నెలసరి కాలంలో ఎదుర్కొన్న వివక్ష, హింసలు, చుట్టు పక్కల స్త్రీలు ముఖ్యంగా దక్షిణాసియా స్త్రీలు ఎదుర్కొన్న అణచివేత దుఃఖం ఆమెను కదిలించాయి. ఆమెను తీవ్రమయిన మానసిక సంక్షోభానికి గురిచేసాయి. 

మొదట్లో రూపి పంజాబీ భాషలో గురుముఖీ స్క్రిప్ట్ లో రాయడం ఆరంభించింది. తన విశ్వవిద్యాలయ ప్రాజెక్ట్ లో భాగంగా ఆమె ఇంస్టాగ్రామ్ వేదిక పైన స్త్రీల రుతుసరి కాలపు ఫోటోల్ని ప్రచురించడంతో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. అనంతరం తన రచనల్ని పోస్ట్ చేయడం ఆరంభించింది. మొదట పుస్తకం కోసమని కాకుండా తనను తాను వ్యక్తం చేయడానికి రాయడం మొదలెట్టిన రూపి కౌర్ అమెరికాలో వున్న ఆనవాయితీ ప్రకారం కవిత్వాన్ని వేదికల మీద ప్రెసెంట్ చేయడం ఆరంభించింది. ఆమె షోలు విజయవంతమయ్యాయి. ఇక తన రచనల్ని ప్రచురించడానికి ఏ పత్రికలూ ముందుకు రాకపోవడంతో తానే తన మొదటి పుస్తకాన్ని ప్రచురిచుకుంది. పది వేల కాపీలు అమ్ముడయ్యాయి. 2017లో ఓ ప్రచురణ సంస్థ మిల్క్ అండ్ హనీ పుస్తకాన్ని ప్రచురించింది. అది అనూహ్య విజయాన్ని సాధించి ఇప్పటికి 25 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. అంతే కాదు దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది.

‘INSTA POET’ గా రూపి కౌర్ ది గొప్ప విజయం. ఆమె తన కవితలతో కొత్త  తరాన్ని అమితంగా చేరారు. ఆకట్టుకున్నారు. సీరియస్ కవిత్వ లక్షణాలు లేవని అంతా చదువరులని చేరడమే లక్ష్యంగా రాస్తున్న కవిత్వమని విమర్శకులు విమర్శించినప్పటికీ కౌర్ కవిత్వంలో వర్ధమాన స్త్రీ సమస్యలు, మానసిక శారీరక అణచివేతలకు ప్రతిస్పందనలూ వున్నాయి. అలతి అలతి మాటల్లో ఆమె వ్యక్తం చేస్తున్న భావాలు హృద్యంగా వున్న్నాయి.   

ఇవ్వాళ ప్రపంచమంతా బిజీ బిజీ. సమయం లేదు అంటూ పరుగులు పెడుతున్న సమయంలో  ఈ ఇంస్టా కవిత్వం వేగంగా చదువరుల్ని ఆకట్టుకుంటున్నది.

కొత్త తరం తమకు అందుబాటులోకి వచ్చిన కొత్త ప్రసార మాధ్యమాలయిన వాట్స్అప్, ఇంస్టా గ్రామ్, ఫేస్బుక్, ట్విటర్  తదితరాలలో కేవలం వుబుసుకు పోక కబుర్లతో కాలక్షేపం చేయకుండా నాలుగు కవితా పంక్తులు చదవడాన్ని నేను మనసారా ఆహ్వానిస్తున్నాను. అందులో భాగంగా రూపి కౌర్ విజయాన్ని అభినందిస్తున్నాను.

రూపి కౌర్ పుస్తకాలు ఆన్లైన్ లో అందుబాటులో వున్నాయి.

LET’S IND OUR OWN SUN

GROW OUR WN FLOWERS

THE UNIVERSE DELIVERED US WITH THE LIGHT AND SEEDS

WE MIGHT NT HERE AT TIMES BUT THE MUSIC IS ALWAYS IN,IT JUST NEEDS TO BE

TURNED LOUDER

FOR AS LONG AS THERE IS BREATH IN OUR LUNGS- WE MUST KEEP DANCING

అంటున్నారు రూపి కౌర్. ఆమె కవితలు కొన్ని చదవండి.


అతన్ని ఎట్లా ప్రేమించాలో 
నేర్చుకుంటున్నాను

నన్ను నేను ప్రేమించుకుంటూ 


*
నాలో నాకిష్టమయింది నీ వాసనే

నువ్వు భూమిలాగా మూలికలాగా తోటలాగా 
మిగతా మా అందరికంటే 
మరింత ఎక్కువ మానవీయంగా 

*
ఎవరు నీకేమీ 
తిరిగి ఇవ్వలేరో 
వారికే 
నువ్వు ఇవ్వు 

*
నీకు సరిపడినంతగా 
నువ్వు లేక పోతే

మరెవరికీ సరిపడినంతగా 
వుండలేవు 


*
ఏదో ఒకచోట 
నీ వెతుకులాటను ఆపాల్సిందే

ఎందుకంటే నువ్వు దాన్ని 
ఒంటరిగా వదిలేయాల్సిందే కదా 

*
కొంతమంది మనుషులు 
ఎంత చేదుగా వుంటారంటే

వారితో నువ్వు 
మరింత దయగా వుండాలి 

*
నువ్వే 
నీ ఆత్మ సహచరుడివి 
 
*
ఈ ప్రపంచం 
నీకెంత దుఖాన్ని ఇస్తుందంటే

నువ్వు దాంట్లోంచి 
బంగారాన్ని తయారు చేస్తావు 
అంతకంటే స్వచ్చమయిందేదీ లేదు 

*

నువ్వు నీ ఏకాంతంతో 
ప్రేమలో పడు 
*

నేను నీటిని 
ప్రాణాన్ని ఇచ్చేంత 
మెత్తని దాన్ని

నీటిలో ముంచేసే
కఠినమయినదాన్ని కూడా 
*

ప్రేమ క్రూరమయింది కాదు 
మనమే కౄరులం

ప్రేమ ఒక ఆట కాదు 
మనమే ప్రేమలోంచి 
ఓ ఆటను సృష్టించాం 
*

నా నాలుక చేదుగా వుంది 
నిన్ను కోల్పోయిన ఆకలితో 
*

మనం నిజాయితీగా మొదలయ్యాం 
దాన్ని నిజాయితీగానే ముగిద్దాం 
*

మనుషులు వెళ్ళిపోతారు 
కానీ 
ఎట్లా వెళ్లి పోయారన్నది 
ఎప్పటికీ వుండిపోతుంది 
*

వారసత్వం 
------------

నువ్వు అచ్చం మీ అమ్మలాగే వున్నావు 
బహుశా నేను ఆమె సున్నితత్వాన్ని కొనసాగిస్తున్నానేమో

మీ ఇద్దరి కళ్ళూ ఒకేలా వుంటాయి 
మేమిద్దరమూ అలసిపోయి వున్నామేమో

ఇంకా మీ చేతులు . . . 
మేమిద్దరమూ వాడిపోయిన చేతి వేళ్ళను పంచుకుంటాం

కానీ నీ కోపంలోని ఉధృతి మీ అమ్మలో కనిపించదు 
అవును నువ్వన్నది నిజమే 
అదొక్కటి మా నాన్న నుంచి వచ్చింది.


         - స్వేచ్ఛానువాదం : వారాల ఆనంద్

click me!