వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాస రావు రాసిన కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు కవితను ఇక్కడ ఇస్తున్నాం, చదవండి.
పిడికెడు మట్టి చాలు దోసెడు నీళ్ళు చాలు
విత్తనం మొక్కై మొగ్గ తొడిగి హరి తి౦చడానికి
వయసు ఏదైనా వాత్సల్య పు లాలనే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
పుట్టి ఏడుస్తాం చచ్చి ఏడిపిస్తాం
చావు పుట్టుకల మధ్య ఉత్తుత్తి బొమ్మలం
ఊపిరి ఆగినా బతికితేనే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
నవమాసాలు మోస్తం కంటికి రెప్పలా చూస్తాం
కలల సౌధం కోసం బరువు ఎంతైనా భరిస్తాం
మాయ మర్మాల లోకం భ్రమల జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
కులాల కొట్లాట లో నాయకులం అవుతాం
మతాల చిచ్చుకు కార్యోన్ముఖులం అవుతాం
బతుకు లేదు ఇప్పుడిక రంగుల ఉనికే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
దిన ఫలాలు వార ఫలాలు తనివి తీరా చూస్తుంటాం
వత్సరానికొకసారి పంచాంగాలు అదేపనిగా వింటాం
తక్షణమే అన్నీ మరిచిపోయి టాటా అంటేనె జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
నానా గడ్డి కరిచి పేరుకోసం పాకులాడుతాం
పరాయి కిరాయి బృందంతో పత్రికల్లో ప్రకటన లిస్తాం
ఏనాడైనా సామాన్యుడిని గురికొట్టే వాడిదె జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
చదువులు ఎన్నో చదివి పదవులు ఎన్నో వరించాం
పట్నం మర్మమేరిగి పల్లె రుచులు మరిచాం
ఉన్నూరుని వదిలి కన్నవారిని కాదంటే నే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
ఓడిపోవడం గెలవడం పడిపోవడం ఉత్తిదే
మోసపోవడం చెడిపోవడం అంతా తిత్తిదే
నిరంతరం అన్వేషించి నేర్చుకునె పాఠశాలే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం