అంతర్హితం: విమర్శలో బహుముఖీనత

By telugu team  |  First Published May 19, 2021, 1:52 PM IST

కవి, రచయిత రూప్ కుమార్ డబ్బీకార్ వెలువరించిన అంతర్హితం సాహిత్య వాస్యాల సంపుటిపై ఏనుగు నరసింహా రెడ్డి సమీక్ష చేశారు. రూప్ కుమార్ సాహిత్య విమర్శ లోతులను ఆయన అందులో తడిమారు.


కవిత్వానికెన్ని నిర్వచనాలున్నాయో విమర్శకు అన్ని వర్గీకరణలున్నాయి.  సాహిత్య విమర్శ, ప్రక్రియకు రూపానికి సీమితమై  ఉండాలని కొందరంటారు.  పాశ్చాత్య విశ్వ విద్యాలయాల్లో  school  of criticism తో పాటు వాటిలో ఉప విభాగాలుంటాయట.  కానీ అభిరుచి విమర్శలో  ఆ పరిమితులుండవు. రచయిత లేదా విమర్శకుడి దృష్టికోణపు వైవిధ్యాన్ని బట్టి విమర్శా గ్రంథపు విస్తృతి ఉంటుంది. సాహిత్య ప్రక్రియలపై, ప్రక్రియలో రూపాలపై, సాహిత్య కారులపై రాసిన వ్యాసాలన్నీ ఒకచోట  చేర్చి ప్రచురించడం అరుదైన విషయమేం కాదు. వాటిని వైవిధ్యభరితంగా నిర్వహించడమే ప్రధానం.అంతర్హితంలో విమర్శకుడు అదే పని చేసాడు.

రూప్ కుమార్ డబ్బీకార్ సున్నితమైన వ్యక్తి. హృద్యమైన కవి. బహువిధ వస్తువులపై కథలు రాసే రచయిత. హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ తెలిసిన అనువాదకుడు. సహృదయ విమర్శకుడు. అంతర్హితo వ్యాససంపుటిలో విమర్శకుడి సున్నితత్వం చూడొచ్చు.  అట్లా అని సదసద్వివేచన  మరిచిపోడు. చురకలు ఉండవు కానీ నర్మగర్భంగా సూచనలు  ఉంటాయి. అంతర్హితంలోని  రూప్ కుమార్ లోని విమర్శకుడిని అంచనా వేయడానికి ఇందులో ముప్పై వ్యాసాలున్నాయి.  అందులో కళ, చరిత్ర, కథలు, కవిత్వం, పరిశోధన, అనువాదం, సాహిత్యకారుల వైశిష్ట్యం, వారి ఇంటర్వ్యూలు  ఉన్నాయి.  ఇంగ్లీషు నుండి తెలుగులోకి వచ్చిన కవిత్వం, ఉర్దూ నుండి అనువాదమైన కథలు రూప్ కుమార్ వ్యాసవస్తువులైనాయి. తెలుగు కవితా సంకలనాలపై సమీక్షలు, తులనాత్మక కథా వ్యాసాలు కూడా వున్నాయి.

Latest Videos

పాకాల తిరుమల రెడ్డి తెలుగు వాళ్ళకు మాత్రమే పరిమితమైన చిత్రకారుడు కాడని 'శిల్పకళా పరిణామ దశకు రూపాంతర రేఖ' వ్యాసం ద్వారా చాటి చెప్పాడు రూప్ కుమార్. ఐరోపా ఆధునిక చిత్రకళను దేశీయ చిత్ర రంగానికి పరిచయం చేసాడని చెబుతూ        యంగ్ టర్క్స్ గా ప్రసిధ్ధి  చెందిన 'Bombay Comtemporary Indian Artists’ లలో పి.టి. రెడ్డి ఒకరని విలువైన సమాచారాన్ని ఇచ్చాడు. తెలంగాణ మట్టి పరిమళాన్ని శిల్ప, చిత్ర, సాహిత్య కళారంగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన పాకాల తిరుమలరెడ్డి, యశోదారెడ్డిని లింకు చేస్తూ రాసిన ఈ వ్యాసం సాహిత్య కారులకు గొప్ప సమాచారం. 

స్వామి రామానంద తీర్థ తన జీవితాన్ని ఆత్మ కథగా  'Memories Of Hyderabad Freedom Struggle' పేరుతో చేసిన రచనకు హరి ఆదిశేషు రావు ‘హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం: అనుభవాలు, జ్ఞాపకాలు’గా తెలుగులోకి అనువదించారు. మూలం ఏమిటి, అనువాదం ఏమిటి, అనువాదం ఎలా ఉంది, ఈ తరానికి రామానంద రిలవెన్స్ ఏమిటి అనే అంశాలను మాత్రమే చర్చించి వదిలి వేయలేదు.  ఆత్మకథలోని సంస్థానపు రాజకీయాల వాద వివాదాలను ఇతర రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో, సంఘటనలతో తులన (compare) చేసాడు. రామా నందులోని స్వామిని, నాయకున్ని ఈ గ్రంథం ద్వారా అంచనా వేసాడు. 'Tragedy Of Hyderabad ' రచయిత మీర్ లాయక్ అలీ రామానందను' He possessed no particular qualities of leadership ' అనడానికి కారణాలు ఆనాటి రాజకీయాలలో ఉన్నాయని చెప్పడం ఈ విమర్శకున్న లోతును తెలియజేస్తుంది.  బ్రిటిష్ ఇండియాలో పర్యటించేటప్పటి ప్రకటనలకు, సంస్థానంలో ఉన్నప్పటి ప్రకటనలకు రామానందలో తేడా కనిపించేదని, అందుకు కారణాలను స్థూలంగా విమర్శకుడు అన్వేషించాడు. కన్నడ ప్రాంతంలో పుట్టి, మరాఠీ ప్రాంతంలో పెరిగి స్టేట్  congress నాయకుడిగా పనిచేసిన రామానందకు తన బలాలు బలహీనతలు తెలుసునని చెబుతూ లాయక్ అలీ విమర్శ ఒక శతృ శిబిరపు కామెంటేనని వాచ్యంగా కాకుండా ధ్వని  పూర్వకంగా చెప్పాడు.  
4వ, 5వ, 6వ  నిజాం ల దగ్గర పని చేసిన సాలార్ జంగ్ - 1 అనబడే మీర్ తురబ్ అలీ ఖాన్ సంస్కరణలు హైదరాబాద్ పరిపాలనను ఎలా స్థిరపరిచాయో చెబుతూ మౌల్వీ చిరాగ్ అలీ రాసిన పుస్తకం 'Hyderabad (Deccan ) Under Sir Salar Jung ' ను   గాజుల దయాకర్ 'ఆదునిక హైదరాబాద్ చరిత్ర - సాలార్ జంగ్ సంస్కరణలు' గా తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకాన్ని సమీక్షిస్తూ నిజాం పాలకుల పాలనలో తెలంగాణ చరిత్రకు పడిన పునాదులలో ఇది కొంత భాగమని అర్ధం చేసుకోవడానికి పనికొస్తుందని వ్యాఖ్యానిస్తాడు. యథాతథ ఒప్పందo విఫలమై ఆపరేషన్ పోలోకు దారి తీసిన సంఘటనలన్నీ పెను విషాదామని భావిస్తూ లాయక్ అలీ రాసిన Tragedy of Hyderabad కు ఏనుగు నరసింహారెడ్డి చేసిన అనువాదం ‘హైద్రాబాద్  విషాదం’ను  విమర్శిస్తూ  రాసిన  వ్యాసంలో  ఎవరైనా  రచయిత  వాదన  ఔననో,  కాదనో   పేరాలకు  పేరాలు  తమ అభిప్రాయాలను గుమ్మరిస్తాను.  కానీ  రెండు వైపులా  ఉన్న సాధక  బాధకాలను చర్చిస్తూ,లాయక్ అలీ  గోoతులోని  ఆర్తిని  పట్టుకోవడానికి  ప్రయత్నించాడు. మొత్తం  స్వతంత్ర  భారత  యవనికి మీద నాలుగు రోజులు  ఆటాడిన  ఇతర  సంస్థానాలైన   జునాగఢ్,  కాశ్మీర్ ను   హైద్రాబాద్ తో  సమానంగా  చర్చించాడు .  ఇది విమర్శకుడి విస్తృతి. 
       
డజనుకుపైగా  కవుల  కవిత్వం మీద రాసిన వ్యాసాలు అంతర్హితం లో సింహభాగం  ఆక్రమించాయి.  ముకురాల  రామారెడ్డి, కాళోజీ, అమ్మంగి , నందిని  సిధారెడ్డి , నిఖిలేశ్వర్ , రాధేయ, అన్వర్, రఘుశ్రీ, రామానాయుడు, వెంకటకృష్ణ, ఏనుగు నరసింహా రెడ్డి కవుల సంకలనాల మీద  రాసిన సమీక్షలు విమర్శలు  ఇందులో ఉన్నాయి.  హైకూ రచనల  తీరు తెన్నుల    మీద  వ్యాసాలు, గుర్రం జాషువా డిలాన్ థామస్  కవిత్వంలో  బాల్యం  పై   ఏనుగు నరసింహ రెడ్డి రాసిన  పరిశోధనపై వ్యాసం కవిత్వ విభాగంలో  విలక్షణమైనది.
         
ముకురాల రామారెడ్డి  రెండు  సంపుటాలను  కలిపి  తెలంగాణ  సాహిత్య  అకాడెమీ  ప్రచురించిన  నవ్వే కత్తులు , దేవరకొండ దుర్గం  కావ్యాలపై  సాధికారికమైన  విమర్శ చేశాడు .   అనపోతానాయకుడినో, సింగమనాయుడినో  స్పష్టం  చేయకుండానే  రామారెడ్డి ‘త్రిభువన రాయ' అని  సంభోధిస్తాడు.  దానికి ఐనవోలు శాసనాన్ని  పేర్కొంటూ అందులో  ‘అనపోతానాయకుడి’ని  ఉద్దేశించి  ఉందని, అనపోతానాయకుడి కాలానికి  ఓరుగల్లు, భోనగిరి, సింగవరం  కోటలు వెలమల వశమయ్యాయని అందువల్లే   అనపోతానాయకుడిని  ఉద్దేశించి రామారెడ్డి  ఈ బిరుదం  వాడారని  విశ్లేషించాడు. 
'ఇదియే  దేవరకొండ, ఇదియే  దేవరకొండ 
ఇటయెన్నడో   మెదిలెనట  వెలమపులిగండ'
అనే  మాదిరి  కవితా వాక్యాల ద్వారా ' కవికి  పద్యమంటేనే  అభిమానం  ఎక్కువని  తోస్తోంది. వచన  కవితల  నడక  కూడా  పద్యశైలిలో , గేయరూపంలో  ఉంటుంది’అని నిర్ధారిస్తాడు. 

డా. అమ్మంగి వేణుగోపాల్ కవిత్వాన్ని హిందీలోకి అనువాదం  చేసిన  సందర్భంగా రాసిన వ్యాసంలో అనువాదంలో జాతీయాలు, నుడికారాలు  భాషాంతరీకరణకు ఒదగవని చెబుతూ మూలభాషలో లాగానే  లక్ష్య భాషలో  నుడికారాన్ని వెతుక్కోవాలని  చెబుతూ ‘చెవిటివాని  ముందు  శంఖం ఊదినట్లు'  అనే తెలుగు మాటకు  సమాంతరంగా  ఉన్న‘బైంస్ కే సామ్ నే  బీన్ బజానా' ను  గుర్తు  చేస్తాడు. 'పచ్చిమోసగాడు'ను ‘కచ్చా ధొకేబాజ్’ అనలేమని ‘పక్కా ధొకేబాజ్' అనాలని చెబుతూ  లక్ష్యభాషలోతులు  తెలియకుండా  ఇవన్నీ  తెలియవంటాడు.  'నలిగిన  హృదయం' అనే కవితను ‘కుచ్ లా  హృదయ్' శీర్షికతో  హిందీలో చేసిన  
'శీఘ్ర  గతిసే చల్  పడా
పీచే  బీజ్ లీకే దీప్-సా- ఖంబా 
మేరే ఆగే  మేరే  ఛాయా  
దారాశే చిప్కే  ప్రకాష్ కో ఉక్కడ్ తీ కాలే  తేజ్  తల్వార్ 
సీ మేరీ  ఛాయా’ 
అనే రంగయ్య  గారి  అనువాదం  బాగుందంటాడు .

రూప్ కుమార్ స్వయంగా కవి కావడం వల్ల కవిని ప్రశoసించినా, సూచనలిచ్చినా   మంచి వాక్యాలన్నీ ఏరతాడు.

‘ఎన్ని  వంకర్లు  తిరిగినా  
ఒతుకు  దీర్ఘ చతురశ్రం
నిలబెడితే  నిచ్చెన 
పరిస్తే  అది పాడె' (ఇక్కడి  చెట్ల గాలి - నందిని సిధారెడ్డి)
'పర్వతానికి
కొమ్ములు మొలిచాయి
గుడికట్టారు '  (చిలక్కొరికిన అక్షరాలు-రఘుశ్రీ )
'మొన్న  పులుల  భయం 
నిన్న మనుషుల భయం 
నేడు ప్రాజెక్టుల భయం’ (ముంపు - పి. విద్య సాగర్ )
‘పుట్టిని  నమ్ముకోవాల్సిందే 
ముంచే నీళ్లను                                                  
ఒడుపుగా  ఆసరా  చేసుకోవలసిందే’ (మూల మలుపు - ఏనుగు నరసింహారెడ్డి)

తను ఏరే కవితా వాక్యాలలో మెరుపుగాని, అపూర్వమైన ఊహా కానీ, కొత్త  తాత్వికపుటాలోచన  కానీ  ఉండడం  వలన  రూప్ కుమార్  సమీక్ష చదివితే  ఆ సంకలనంలోని  మంచి  కవితలన్నీ  అందులో  దొరికేపోతాయనిపిస్తుంది. 
కథా సాహిత్యం మీద రాసిన  వ్యాసాలు  అటు  విస్తారంగాను,  విశ్లేషణాత్మకంగానూ  ఉంటాయి. ఆయన  ఎంపికలోనే  ఒక  ప్రతేక్య  దృష్టి  ఉంటుంది.  ఎన్నో  కథలున్న మూడు  తరాల  తెలంగాణ  కథ  అన్న పుస్తకంలో భండారు అచ్చమాంబ, పాకాల యశోదా రెడ్డి, జాజుల గౌరిల  కథలను ఎంపిక  చేసుకోవడంలోనే  ఆయనకొక  లక్ష్యం  ఉంది.  ముగ్గురూ స్త్రీలే అయినా  వాళ్ళు సృష్టించిన  పాత్రలు  ఏ  తరంలోనూ  నిరాశకు  గురికాలేదని  విశ్లేషించారు.  మార్క్స్  భావాలతో తీవ్రంగా  ప్రభావితమైన  రషీద్  జహాన్   ఒక  రచయిత్రిగా  ఉర్దూ  కథా సాహిత్యం మీద వేసినముద్ర ఎంతబలమైనదో చెపుతూ వచనంలో కథా గమనాన్ని అద్భుతంగా నడపేంచిన రషీద్ జహాన్ ఎందరో యువ రచయిత్రులకు ప్రేరణగా నిల్చిందంటాడు. జర్కాన్  అనే  రంగు రాయి  శీర్షికతో  త్రిపుర  రాసిన  కథలోని  మానసిక  ప్రపంచాన్ని  విశ్లేషించాడు.
ముగ్గురు ఆధునిక కాలపు తొలి ఉర్దూ  రచయిత్రుల  కథల  అనువాదం  'గోరింటాకు.' ప్రసిద్ధ  రచయిత  అంజద్  ఎంతో ఇష్టంగా  చేసిన  అనువాదాలివి.   సాదత్  మంటో, ఇష్మత్  చుగ్తాయి, వాజిద తబస్సుమ్  మూల కథలివి.   ఈ అనువాద కథలు విశ్లేషిస్తూ చాలా  లోతుల్లోకి  పోయాడు  రూప్ కుమార్.  ముగ్గురూ ఒక రకంగా లైంగికతను  రచనల్లోకి  ఎక్కించినవారే.  ఈ అనువాదాలను విశ్లేశిస్తూ   మంటో  రచనల్లో  ప్రధానంగా  లైoగికత  ఉంటే, ఇస్మత్  చూగ్తాయి రచనలు మార్క్సిస్టు దృక్పథంతో స్త్రీ వాద    చట్రంలో  సాగాయంటారు.  ఇంకోచోట  వాజిద తబస్సంను  ముజతబా హుస్సేన్ 'ఆమె  అన్ని  మర్యాదల  హద్దులను  దాటిందని  అన్నారం’టాడు. ఈ  వ్యాసంలో  విమర్శకుడు  ఇస్మత్  కథ  'ఘోన్ఘట్'  కు  అనువాదకుడు  తెలుగులో  'మొండిపట్టు ' అని  పెట్టడంలోని  హేతువు  విశ్లేషిస్తూ' మూల  కథా  రచయిత్రి  'ఘోన్ఘట్' పేరు  పెట్టి కథకు వస్తు ప్రాధాన్యతను ఆపాదించగా అనువాదకుడు పాత్రల గుణాన్ని  పరిగణలోకి  తీసుకున్నాడని  చెప్పాడు.  లక్నో  ఉర్దూ, హైదరాబాద్  ఉర్దూ  మధ్యగల  తేడాను  చెబుతూ  ప్రాంతానికి  సంబoదించిన  మర్యాదలను  అనువాదంలో  చెదరకుండా  ఉంచాలంటాడు .

కాళోజీ మీద కొత్తగా  రాయడం  కష్టమని  చెబుతూ  కొత్తదనానికి ప్రయత్నించాడు.  అద్దేపల్లి సహృదయతను, సి.వి.కృష్ణా రావు నిబద్ధతను, సామల సదాశివ నిఖార్సుతనాన్ని  రికార్డు  చేశాడు.  డిలాన్ థామస్, గుర్రం  జాషువాను  ఒక  వేదిక  మీదచూడడం  ఆశ్ఛరంగా  ఉందనీ రాసాడు.

పరిశీలన, పరిశోధన, అనుసంధానం , సున్నితమైన  హెచ్చరికలతో రూప్ కుమార్  విమర్శ  రచయితలకూ, పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది.  అనవసర  ప్రశంసలు  కానీ  పని గట్టుకున్న విమర్శ కానీ ఉండదు. ఆయన మనసు కవిత్వంలో  ప్రతిఫలించినట్లే  అంతర్హిరంలోనూ ప్రతిబింబించింది. 

- డా. ఏనుగు నరసింహారెడ్డి.                                                                                        
8978869183

click me!