అమ్మ ఒడి లాలింపులా ఇల్లంటె ఒక పేగు బంధం అంటూ హన్మకొండ నుండి పొట్లపల్లి శ్రీనివాసరావు రాసిన కవిత " జ్ఞాపకాల జాతర " ఇక్కడ చదవండి :
పేదోడి పూరి గుడిసె
పెద్దోడి ఇంద్ర భవనం
ఎటూ కానోడి అప్పిల్లు
మట్టి ముట్టినోడికి ముట్టనోడికి
చివరాఖరి ఊపిరి కన్నా ముందే
మట్టి వాసన తెలిపే విశ్రాంత సౌధం
అందరూ తలదాచుకునే చోటు
కూడికల తీసివేతల గుణింపుల భాగహారంలో
నిండు సున్నాకు కుడి ఎడమల ఎందరెందరో
శక్తి కొద్ది స్వప్నించి సేద తీరే తపనతో
నిర్మించుకొని నిదురించే స్వేచ్ఛా తీరం
చెమట చుక్కల పనితనంతో మెరిసే నిర్మాణం
పునాదులపై పేర్చే ఇటుక మీద ఇటుకను
ఇసుక సిమెంటు కలగలసి ఇటుక బంధంతో
జతకలసి ఇనుమూ కంకరకూ మరింత ధైర్యాన్నిస్తూ
బ్రతికినంత కాలం తోడైనీడై జీవించే ప్రాణ మిత్రులు
సుతిమెత్తని తీవెలతో అల్లిబిల్లిగా అల్లుకుని
పూచిన గుమ్మడి పూల అందాలు
పచ్చదనపు జాతరై లతలుా క్రోటన్లుా
మిద్దె మీద కొలువుదీరే ఆకుపచ్చని బంధాలు
కుటుంబం కుటుంబం అంతా పెనవేసుకు సాగే
ఎడతెగని వూసుల మమకారాల మధువనిలా
వారసత్వపు వాత్సల్యపు జ్ఞాపకాల కూడలి
అమ్మ ఒడి లాలింపులా ఇల్లంటె ఒక పేగు బంధం