డా.ఓర్సు రాజ్ మానస కవిత : మట్టి మనిషి....!

By Arun Kumar P  |  First Published Jan 5, 2023, 3:02 PM IST

ముళ్ళ సువ్వలు పర్సుకున్న దారొంట  ఒట్టికాలితో పయనం అంటూ  వడ్డెర కులంలో మట్టి పని చేసేవారి గురించి ధర్మపురి నుండి డా.ఓర్సు రాజ్ మానస రాసిన కవిత  " మట్టి మనిషి....! " ఇక్కడ చదవండి: 


మబ్బుల సీకటి ఘడీలను దొబ్బుకుంటూ
మంటోరు* నెత్తిన  తట్ట,బుట్ట  
సుక్కలోలే మెరుస్తయ్
 
ముళ్ళ సువ్వలు పర్సుకున్న దారొంట
సెమట సుక్కలు బందూక్ లా గుచ్చుతున్న
ఒట్టికాలితో అనంత పయనాల
నడకలు జారుస్తరు

ఊరవతల తాటికమ్మల గూడాల్లేసుకొని
నిశి రాతిరిలో పురుగు బుసితో సెలిమంటారు
ఎడారి బతుకులకు ఎన్నెల ఎల్గులే సలువ పందిరి

Latest Videos

మట్టిమనిషులు  సంచార జీవనం సాగిస్తూ
బండరాళ్లను ఎద గల్మలకు అదుముకుంటరు
కరకు రాతి గుండెకు ఆదరువు ఆ రాయే

ఎండిన డొక్కలను పూడ్సుటకు బువ్వకై ఆరాటం
బక్కసిక్కిన దేహానికి సుట్టుకొనే బట్టకై పోరాటం
దిగులు మోముతో ఆకాసమొంక జూస్తుంటడు
తనువును సుట్టుకొనే సిన్న బట్టముక్కలేని  మంటోరు..!

* మంటోరు - వడ్డెర కులంలో మట్టి పని చేసేవారు.

  

click me!