
కలల రాతిరి కౌగిలింత
ఉరకలెత్తి మునకలేసేటి ద్వాదశకళల పుష్కరిణి
దోసిలెత్తి దావతిచ్చె తేనెలొలుకు మేథో మథన గానం
తెల్ల తెల్లని పొగ మంచు బిందువై
నులి వెచ్చని లేత కిరణ గంధమై
లోలోన ఏదో వెతుకుతున్న మది
ఎదపై వాలి పారిజాతమై నవ్వగ
నవ్వితే దోసిట మల్లెలు కురిసినట్లు
పరిమళ భరిత వాయువేదో తాకినట్లు
మంచంతా చల్లగా మనసంతా తెల్లగా
మంచు పూల వలపు మనసు వూసు తెలిపె
తళుకు బెలుకుల భ్రమలలోకంలో చికాకులెన్ని వున్నా
చివాల్న హృదయాకాశంలో ఇంద్రచాపమేదో వెలసినట్లు
మేలుకో నేస్తమాయని తట్టి అభయమేదో ఇచ్చినట్లు
మెరిసిన కనుల అనుభవాల అందమంతా కలంలో వొంపి
మంద మంద సుగంధమై వ్యాపించమనె
ప్రకృతి ఒడిలో పరవశంతో విహరించమనె
కనులు మూసి చూస్తే కమనీయ ప్రవాహం
కనులు తెరిచి చూస్తే కల్లోల ప్రపంచం