దుఃఖ రంగస్థలంగా మారిన జీవితంలో నీ ఓటు ఒక పొద్దు పొడుపు కావాలి అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' ఓటే దారిదీపం.. ' ఇక్కడ చదవండి :
దండాలు పెడతారు
అవసరమైతే నీకే దండలు వేసి
పడిపడి మొక్కుతారు
దేవుడిలా చూస్తారు
ఎరవేసి గిరిగీస్తారు
ముగ్గులోకి లాగుతారు
వాళ్ల లక్ష్యం అలాంటిది
వాళ్ళ అవసరం అంతటిది
సరిగ్గా ఇప్పుడే నీలో ఆలోచన లోపిస్తే
విజ్ఞత విడిచి తప్పటడుగు వేస్తే
చేదును మింగకా తప్పదు
కండ్ల నీళ్ళు కురవకా మానవు
బతుకులో తీపిని పంచటానికే
ప్రజాస్వామ్యంలో నాయకుడి అవసరం
గాయాల గొంతుకలకు
ధైర్యమిచ్చి ఊతమవ్వడమే నాయకత్వం
దుఃఖ రంగస్థలంగా మారిన జీవితంలో
నీ ఓటు ఒక పొద్దు పొడుపు కావాలి
జాగ్రత్తగా ఆలోచించి
బ్రహ్మాయుధంగా ఓటును ప్రయోగించాలి
భవిష్యత్తుకు నిచ్చెన మెట్లు నిర్మించాలి