పేర్ల రాము కవిత : చెమటంటిన మట్టిపద్యం

By SumaBala Bukka  |  First Published Dec 8, 2023, 2:28 PM IST

నాయిన బరువైన కన్నీటి మూటల్ని ఎత్తుకొనిబోయి చేనుపేగులెండి పోకుండా బువ్వయితడు అంటూ మహబూబాబాద్ నుండి పేర్ల రాము రాసిన కవిత  ' చెమటంటిన మట్టిపద్యం ' ఇక్కడ చదవండి : 


నాయిన కట్టం గొడ్డుకు తెలుసు
నాయిన దుఃఖం మట్టిగుండెకె తెలుసు
నాయినంటే రోజూ చూసే మా ఊరికి తెలుసు 
సూర్యుడికి తెలుసు
రాత్రి దాకా పని చేసి నడుచుకుంటూ
వస్తున్నప్పుడు చూసే రాత్రికి తెలుసు 
అప్పుడప్పుడు పలకరించే వానకు తెలుసు 
మట్టిలో మొలకెత్తే ప్రతీ విత్తనానికి తెలుసు
నాయిన మనిషిరూపంలో ఉన్న 
శ్రమజీవి వేలిముద్ర

ఎప్పుడు
పచ్చని చెట్లమధ్య తిరుగుతూ 
బురదగొర్రు ఎత్తుకొనో
వడ్ల బస్తాలెత్తుకొనో 
గొడ్డలి పట్టుకొనో కనపడే
నాయినను చూస్తే 
లోలోపలొక చెమ్మ పుడుతుంది
ఎప్పుడూ 
మట్టిచేతుల్లోనే పెరిగే నాయిన
ఎండిపోతున్న మట్టిపెళ్లల దూప తీర్చుతడు
బరువైన కన్నీటి మూటల్ని ఎత్తుకొనిబోయి 
చేనుపేగులెండి పోకుండా బువ్వయితడు

Latest Videos

ఎకరం పొలం మడిలో
ఒక్కేడే నిలబడి ఒరం చెక్కి 
ఒరం పూసే ధైర్యంగల
చెమటంటిన మట్టిపద్యం మా నాయిన   
45 ఏళ్ళుగా వ్యవసాయ కొలిమిలో 
భగభగ మండుతున్న పనిముట్టు మా నాయిన

బరువులు మోసే నాయినను 
అదే పనిగా కాసేపు చూశానా
ఆనందం, దుఃఖం ఊటలుగా
రెండు కళ్ళల్లోంచి దుంకుకొస్తాయి.

పొద్దంతా ఎండలో మాడి 
నల్లనిచంద్రుడిలా నవ్వే నాయిన
అప్పులు వెనక్కి లాగుతున్న 
దాని కాళ్ళకు పగ్గాలు కట్టి 
ముందుకే గుంజుకుపోతడు
నాయిన తన బాధల్ని
గడ్డి మోపులాగే గట్టిగా గుంజి
దగ్గరకి బిగించి ఎత్తుకొని నడుస్తుంటడు

పొద్దును 
అల్లించుకుంటూ బోయి 
చేను కాడ మేపుకొచ్చి
సాయంత్రం ఇంటిముందు గుంజకు కట్టేస్తడు
వస్తూ వస్తూ నాలుగు సీతఫలక పండ్లను
తువ్వాల్లో మూటగట్టుకొస్తడు
బువ్వతిన్న గిన్నెను కడిగి 
పిడికెడు బోడకాకరకాయల్ని ఏరుకొచ్చి 
అమ్మ చేతిల బెడుతడు
ఎప్పుడన్నా ఓ పూట
బుడ్డపరకల్ని, కమిశెల్ని
ఇంటి ముందేసుకొని కడుగుతూ 
అన్నం మెతుకులెమ్మటి 
కమ్మటి కూరై మెరుస్తడు

నాయినకు డొంకలు తెలుసు 
చీకటి దారులు తెలుసు
ఎడ్లకు ముక్కుసిక్కాలు యేసుడు తెలుసు 
పగ్గాలు అల్లుడు తెలుసు 
చేనుకు పట్టిన పురుగును 
ఏ మందుతో సంపాలో తెలుసు 
అన్నీ తెల్సిన నాన్నకు 
అప్పుల్ని ఎట్లా ఓడించాలో తెలియదు!.
నాన్న పని దగ్గర ఓడిపోలేదు
అప్పుల దగ్గరే చేతులుకట్టుకోవడం 
నాకు అసలే   నచ్చలేదు
నడవడం ఆపని నాన్న
అప్పులోళ్ళు వస్తే కదలకుండా నిలబడడం 
నాకు నచ్చనే నచ్చలేదు

పంట చేతికి చిక్కకుండా 
ఎండిపోయి రాలుతుంటే
పండిన కంకుల్ని కోతులు ఆగం చేస్తుంటే 
ఎండుతున్న వడ్లను రాజకీయ వానలు తడుపుతుంటే 
నాన్న లాగే వడ్ల గింజలు 
గుడ్లల్ల నీళ్ళు నింపుకొని చూస్తుంటే 
ఏట్ల రాయను అందమైన కవిత్వాన్ని

నాయిన 
లోపలి దుఃఖాన్ని లోపలనే దాచుకొని
వడ్లగుమ్మిలెక్కనే నిలబడుతడు.
(మా నాయిన లాంటి నాయినలందరికి ఈ కవిత అంకితం )

 

ముఖ్యమైనగమనిక : 

ప్రముఖ కవులు, రచయితలు మొదలనుకుని సాహితీ రంగంలో కవులుగా, రచయితలుగా వస్తున్న ఔత్సాహికులు, యువకవులు, రచయితలకు ఏసియా నెట్ తెలుగు చక్కటి వేదికగా మారిందన్న విషయం తెలిసిందే. అర్ధ దశాబ్దానికి పైగా వారి సృజనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వస్తోంది. 

దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని.. మరింతమంది సాహిత్యకారుల చెంతకు చేర్చాలని, ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఏసియానెట్ తెలుగు మరో ముందడుగు వేస్తోంది. రచయితలే తమ రచనలను తమంతట తామే నేరుగా ఏసియా నెట్ తెలుగుకు చేరవేసే సౌలభ్యం కల్పిస్తోంది. మీరు పంపిన రచనల్లో అర్హమైన వాటిని సాహిత్యం (లిటరేచర్) విభాగంలో ప్రచురిస్తాం. 

దీనికోసం మీరు చేయాల్సిందల్లా... మీ రచనలను, చక్కగా, స్పష్టంగా, అచ్చుతప్పులు లేకుండా, అర్థమయ్యేలా తెలుగులో టైప్ చేసి Venugopal.b@asianetnews.in అనే మెయిల్ ఐడీకి నేరుగా పంపండి. 

మీ రచనలతో పాటు మీ ఫోన్ నంబర్, అవసరమైన ఫొటోలు పంపడం మరిచిపోవద్దు. అలాగే కవిత లేదా రచన స్వయంగా మీరే రాసినట్లు పేర్కొనాలి. కాపీ కంటెంట్‌ ను ఏసియానెట్ ప్రోత్సహించదు. ఒకవేళ కంటెంట్ కాపీ చేసి పంపినట్లు తేలితే చట్టపరమైన చర్యలకూ బాధ్యులవుతారు.

- వేణుగోపాల్ బొల్లంపల్లి | ఎడిటర్ ఏసియా నెట్ తెలుగు

click me!