"శ్రీమద్ మల్కిదేశిక తత్వచంద్రిక" పుస్తకాన్ని వీర్లపల్లి పీఠాధిపతి నిజానంద బసవరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాల కాలంనుంచి అచల సాంప్రదాయం కొనసాగుతున్నదని అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ మల్కిదాస ఆశ్రమంలో గురుపౌర్ణమిని పురస్కరించుకుని జూలై 23 న ఆశ్రమ పీఠాధిపతి సయ్యద్ ఖాజామియ్య సంకలనం చేసిన "శ్రీమద్ మల్కిదేశిక తత్వచంద్రిక" పుస్తకాన్ని వీర్లపల్లి పీఠాధిపతి నిజానంద బసవరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాల కాలంనుంచి అచల సాంప్రదాయం కొనసాగుతున్నదని అన్నారు.
ఆ పరంపరలో నేటికీ ఎన్నో అచల సాంప్రదాయ పీఠాలు భక్తులతో విరాజిల్లుతున్నాయన్నారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సమీక్ష చేశారు. పుస్తకాన్ని సమీక్షిస్తూ డెబ్బై తత్వాలతో, కీర్తనలతో రూపొందించిన ఈ పుస్తకంలో ఎంతోమంది శిష్యులు గురువులను స్మరిస్తూ తమకున్న అనుబంధాలను చాటిచెప్పారన్నారు.
మహదేవునిపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్కిదేశికేంద్రుల విశేషాలను స్మరిస్తూ ఆయన శిష్యులు రాసిన ఈ తత్వాలు, కీర్తనలు అందరూ తెలుసుకుని పాటించాలన్నారు. భారతదేశంలోనే భారతీయ తాత్విక చింతన చాలా ప్రాచీనమైనదని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, భగవద్గీతలు మన జీవితంలో ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు తాత్వికదృక్పథంతో సమాధానమిచ్చాయన్నారు.
ఆశ్రమ పీఠాధిపతి సయ్యద్ ఖాజామియ్య మాట్లాడుతూ మల్కిదేశికేంద్రుల గురుపరంపర సాంప్రదాయాన్ని ఎంతోమంది శిష్యులు పాటిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పెబ్బేరు భూమానంద కృష్ణదాసు, ఆశ్రమ కార్యదర్శి ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.