పప్పుల వెంకన్న కవిత: కరోనా కరాళ నృత్యాన్ని కట్టడి చేద్దాం

By telugu teamFirst Published May 7, 2021, 4:52 PM IST
Highlights

ఇక మృత్యువు ముందు మోకరిల్లకుండా ప్రతి రోజూ  పండుగ చేసుకుందాం అంటూ పప్పుల వెంకన్న రాసిన కవిత.

మానవ మరణం మామూలైపోయింది 
కన్న బిడ్డడైనా, కడ బంధువైనా
బాల్య స్నేహితుడైనా, భాగస్తుడైనా
పాలివాడైనా, పగతుడైనా
మరణం కలచివేసి 
మనసులోనే దుఖఃపు  కన్నీరు  మరిగి  
కళ్ళకు తెలియకుండానే  కనుమరుగౌతుంది  

మరణం అనునిత్యమై  
కల్లోల భరిత  కలవరాన్ని  సృష్టిస్తూ  
మగత నిద్రలో  సైతం  ఉలిక్కిపడేలా  చేసి 
మానవ మనుగడను ప్రశ్నార్ధకం  చేస్తుంది 

ఎదుటివారి దుఃఖాన్ని  అక్కున  చేర్చుకునే  హృదయం 
ఇప్పుడు సానుభూతికి  కూడా తావు  లేకుండా నిస్సహాయ హృదయ  పాషాణమైపోయింది
పార్థివ దేహానికి  జంకి 
పది గజాల  దూరంలో ఉండడానికి   
పిరికి తనంతో  పరుగు  లంకించుకుంది 

మృత్యువు జల్లెడ  పట్టుకొని 
మానవ లోకాన్ని  జల్లిస్తుంటే  
జల్లెడలో మిగులుతామో  జారి
మృత్యు లోక ముఖ ద్వారంలో  తేలుతామో  తెలియని స్థితి దాపురించింది   

ఇక మృత్యువు ముందు మోకరిల్లకుండా
బుద్ధి జీవులమై మెసులుకుందాం
పర్యావరణాన్ని కాపాడుకుంటూ
ప్రతి రోజూ  పండుగ చేసుకుందాం.

click me!