డాక్టర్ సరోజ వింజామర కవిత: మౌన నిష్క్రమణం

Published : May 07, 2021, 03:14 PM IST
డాక్టర్ సరోజ వింజామర కవిత: మౌన  నిష్క్రమణం

సారాంశం

ప్రాణమనే  పెద్ద ఆస్తిని  పోగొట్టుకున్న కరోనా పీడితుల వేదనను డా. సరోజ వింజామర రాసిన  'మౌన  నిష్క్రమణం' లో చదవండి.

నేను చూసాను
శ్వాసలో  ఇరుక్కుని  ఉక్కిరిబిక్కిరి చేసిన 
రూపంలేని  పురుగును                         
ప్రాణవాయువుకోసం తీగ ఆధారానికై  
విషమ గదులకు చేరిన  తోటివారిని
పల్స్ రేట్ ప్రమాదం అంచున  
గొంతులోనే ఆపుకుంటున్న ఏడుపును
మృత్యువుతో  పోరాటంలో  
గెలుపోటముల  కఠిన క్షణాలను
ధైర్యంగాఉండు  నీకేం కాదు  అని  
భరోసాను  ఇవ్వలేని  నిస్సహాయతను
నీకు మేమున్నాం అని 
ఆత్మీయంగా దగ్గరకు తీసుకోలేని  బేలతనాలను
గాజు తలుపులకు అటు ఇటు నిలబడి ఒకరినొకరు ఓదార్చుకోలేని 
ఉద్విగ్న క్షణాలను నేను చూసాను
ఆక్సిజన్ పైపుతో  
మిణుకుమిణుకుమంటున్న  ప్రమాద ఘంటికలను 
లోపల రుధిరధార   ప్రవహిస్తున్నా 
కత్తిగాటు  కనపడనీయని  
మల్లెపూల  శరీరాలను
మృత్యువు  తన  వలయంలోకి  లాగుతున్నప్పుడు 
తప్పులు  చేసుంటే క్షమించి  వదిలేయమ్మా అని మాటిమాటికీ
వేయిదేవుళ్ళను  మొక్కుతున్న  దీన హస్తాలను   
తమ వారికి ఎన్నో  అప్పజెప్పాలని  పెదవి  తెరిచినా 
మాట రాని మూగ చూపులను
ప్రాణమనే   పెద్ద ఆస్తిని  పోగొట్టుకుని  
నిరాడంబరంగా  వెళుతున్న కటిక  పేదలను  
సేఫ్టీ  కిట్ లో  చుట్టబడిన  శవాలకు  దూరంగా  
కన్నీరింకిన  ఆత్మీయులను 
వన దహనంలా  పేర్చిన  వరుస చితి మంటల  శవ దహనాలను 
నేను  చూసాను  
కర్మకాండలు  అంతిమయాత్రలు  ఏవీ లేని  నిశ్శబ్దమైన
మౌన  నిష్క్రమణను
నిశ్శబ్దమైన
మౌన  నిష్క్రమణను  నేను చూసాను.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం