ఇరుగు పొరుగు: మూడు అస్సామీ కవితలు

By telugu teamFirst Published May 6, 2021, 4:06 PM IST
Highlights

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ మూడు అస్వామీ కవితలను తెలుగులో అందించారు. చదవండి.

ప్రకృతి దృశ్యం 

ఎండలోనూ వానలోనూ 
ఏడుస్తున్న వృక్షాలు 
పొడవయిన శవాల్లా పడివున్నాయి
ఎండలో వానలో 
గట్టిపడుతున్న మృతదేహాల్లో 
పుట్ట గొడుగులు సేదదీరుతాయి
ఆకుపచ్చని గతంతో 
చెట్ల మొదల్లు కుప్పలు కుప్పలుగా 
పేరుకుపోతాయి
కాలం గడుస్తున్న కొద్దీ 
శవాలు కట్టే కోత మిషిన్లకు 
తరలించ బడతాయి
వేదనలు 
ముక్కలు ముక్కలుగా చీల్చబడతాయి 
చదును చేయబడతాయి
మనం కాలానికి నిలబడ్డ కలపను 
కూల్చేస్తాం 
కుండల్లో పెంచే బోన్సాయి 
అడవుల్లో కూరుకుపోతాం
మన హృదయాలు 
కఠిన ఎరుపు గోధుమ రంగు శిలలాంటి 
మహాగోనీ వృక్షాలు 

        అస్సామీ మూలం: నిలిమా తకురియా హక్ 
        ఇంగ్లిష్: రాహత్ అమీన్ 
        తెలుగు: వారాల ఆనంద్ 

---------------------  
నేనింకా మరణించలేదు 

నిశబ్దం నీడల్లో స్థిరపడుతోంది 
నా చేతులేమో 
చిక్కటి రహస్య అడవిని కోరుకుంటున్నాయి
నిశబ్దంలో రాయి కూడా 
నీడల్లోకి జారుకుంటోంది
నన్నిక్కడ వదిలేసిన వాళ్ళంతా 
తిరోగమిస్తున్న అడుగులతో 
నీడల దారుల్లోకి దిగిపోతున్నారు
బహుశా 
ఇక్కడ జీవం లేని వాళ్ళే మాట్లాడుతారేమో
నేనింకా మరణించలేదు 

            అస్సామీ మూలం : నీలిం కుమార్ 
            ఇంగ్లీష్: ప్రదీప్ ఆచార్య 
            తెలుగు : వారాల ఆనంద్
----------------------

పాలస్తీనా

వాళ్ళు నివాసాల్ని అడిగితే
జైళ్ళలోకి తరలించాం
 
వాళ్ళు శాశ్వత జీవితాల్ని కోరితే
మరణాల్ని ప్రసాదించాం
 
తర్వాత
వాళ్ళ జైళ్ళని కూల్చేసి
మొక్క జొన్న క్షేత్రాలుగా మార్చేసాం
 
ఆ నేలనుంచి మొలకెత్తిన
ఆ చేయి ఏమిటి
 
ఆ చేయిలోనుంచే
అనేకానేక చేతులు మొలుస్తాయి
 
మనల్ని
మరణం వైపు తోసేస్తాయి

అస్సామీ మూలం: నవకాంత్ బరువా
ఇంగ్లిష్: ప్రదీప్ బిస్వాస్
తెలుగు: వారాల ఆనంద్

click me!