ఎం.ఆర్ అరుణ కుమారి రాసిన కథా సంపుటి " ఇంగ సెలవా మరి " పై పీలేరు నుండి వినాయకం ప్రకాష్ రాసిన విశ్లేషణాత్మక సమీక్ష ఇక్కడ చదవండి.
ప్రతి నిమిషం మారిపోతున్న శాస్ర్త సాంకేతిక , విజ్ఞానాలను అంది పుచ్చుకునే పరుగులో మనిషి అన్నింటినీ మరచిపోతున్నాడు. ఒయాసిస్సులను వదిలి ఎండమావుల వెంట బడుతున్నాడు. ఈ జీవన ప్రస్థానం లో ఒకరోజు ఈ పరుగు ఆపక తప్పదు ! వెనక్కి తిరిగి చూసుకోకా తప్పదు. అప్పుడు తాను నడచి వచ్చిన దారిలో ..తనను నమ్మినవారికి ఏమిచ్చాడు, తాను తిరిగి ఏమి పొందాడు అన్న ప్రశ్నలకు ..ఆత్మ సంతృప్తి , ఆత్మానందం పొందానని భావిస్తే ఆ మనిషి జన్మ సార్థకమైనట్టే ..! లేకపోతే ఎంత పశ్చాత్తాప పడినా గడిచిపోయిన కాలం, గతించిన మనుషులూ తిరిగి రారు కదా..! అటువంటి దయనీయ పరిస్థితి ఎవరికీ రాకూడదనే తన తపన అంటూ... తన పుస్తకంలోని కథలతో జీవిత పాఠాలు అన్వయించి , సమాజానికి మంచి చెడులను విడమరచి చెబుతూ, నానాటికి మానవీయ విలువలు కోల్పోతున్న నేటి ప్రపంచంలో నైతిక విలువలను తన అక్షరాల రూపంలో విత్తి ఆరోగ్యకర సమాజ అభివృద్ధికి తనవంతు సాయాన్ని అందించేందుకు నడుంకట్టి " ఇంగ సెలవా మరి" అనే అద్భుతమైన మానవ సంబంధాల కథలను నేటి తరానికి కానుకగా ఇచ్చారు రచయిత్రి శ్రీమతి ఎం.ఆర్ అరుణ కుమారి.
కథలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనడం నగ్న సత్యం. అటువంటి ప్రభావవంతమైన కథలతో ఈ పుస్తకంలోని ప్రతీ పాత్ర మనతోమాట్లాడుతాయి. ప్రతీ సన్నివేశం మనకు గానీ మన చుట్టూ గానీ సహజంగా జరిగినట్లు అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. మొత్తం 21 కథలు ఉన్న ఈ పుస్తకంలో ఎక్కువగా మహిళ...ఒక కూతురిగా, తల్లిగా, భార్యగా , అత్తగా, తన జీవితంలో ప్రతీ దశలో నేటి సమాజంలో ఎలా గొప్ప పాత్ర పోషిస్తుందో చక్కగా చెప్పారు.
ఎంతో కష్టాలు పడి చదువు చెప్పించిన తల్లిదండ్రులను చీదరించుకునే మూర్కపు కొడుకును కన్నవారి విలువను కళ్లకు కట్టినట్టు ఒక ఉపాధ్యాయురాలు శిష్యునికి చెప్పే కథ "అందుకో నా లేఖ". ఇందులో ధనం సంపాదించడం గొప్ప కాదని మానవీయ విలువలు ముఖ్యమని బోధిస్తారు.
తన మంచి తనంతో కోడలిని మార్చిన అత్త కథ "ముత్యాల దారం". అయిన వాళ్ళ కన్నా మనసున్న మనుషులే గొప్ప అంటూ.. కంటేనే బిడ్డలా..? కష్టంలో ఆప్యాయత పంచేవాళ్ళూ బిడ్డలే... అనే సందేశాన్ని " కొత్త బతుకు" ద్వారా తెలిపారు.
అరుణ తన కథలలో భార్యాభర్తల ప్రేమను , తల్లీబిడ్డల అనురాగాన్ని , కుటుంబ వ్యవస్థ యొక్క గొప్ప తనాన్ని , బిడ్డల బాధ్యతను, మధ్య తరగతి జీవితాల కష్ట సుఖాలను సూటిగా పాఠకులకు అర్థమయ్యేలా చెప్పారు. కరోనా సమయంలో జరిగిన హృదయాలు ద్రవించే సంఘటనలకు తన కథలలో స్థానం కల్పించి, అప్పటి హృదయ విధారక సంఘటనలను వివరించి చెప్పిన తీరు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆకోవకు చెందినవే మన్నించండి మరోసారి, అపురూపమా అందుకో నా లేఖ... ఇందులో మధ్యతరగతి ప్రైవేటు ఉపాధ్యాయుల బాధలు, అమెరికాలోని కన్న బిడ్డల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రుల దీన గాధలను చదివితే హృదయం ద్రవిస్తుంది.
"అమ్మను చూడాలి" కథలో తల్లి బాధ పడకూడదని తాము బాధను అనుభవించే బిడ్డల గొప్ప మనసు, నాన్న కోసం పరితపించే కొడుకు ప్రేమను. " ఎప్పుడొస్తావు నాన్న" కథలో చూడచ్చు.
రచయిత్రి తన కథల ద్వారా మహిళల్లో చైతన్యాన్ని తీసుకొని రావడానికి ముందడుగు వేశారు. "ఏడడుగులు" కథలో బాడీ షేమింగ్ నేరమని తెలియజేస్తూ.. తనని కించపరిచేలా చూసిన వరుడితో పెళ్లి రద్దు చేసుకొని మహిళకూ ఆత్మ గౌరవం ఉండాలి అని నొక్కి చెప్పారు. పరాయి దేశం వెళ్లి బిడ్డల కోసం శ్రమించి స్వదేశానికి వస్తే ...భర్త తనకి చేసిన మోసం - మరో స్త్రీని సవతిగా స్వీకరించలేక బిడ్డల కోసం ప్రతిఘటించిన మహిళ కథ "గూటిలో రామ చిలుక".
ఇరుగుపొరుగు వాళ్లనే మనవాళ్ళు అనుకుంటాము. అటువంటి ఒక ఆదర్శ మహిళ కథ "మేనత్త". ఈ పుస్తకంలో కొన్ని మార్పు చూట్టూ అల్లుకుని సమాజాన్ని చైతన్యం చేస్తాయి. బిడ్డ లింగాన్ని నిర్ణయం చేసేది భర్త యొక్క జన్యువులేనని శాస్త్రీయంగా చెప్పారు. సోమరి భర్తను మార్చాలి అనే తపన ఒక కథలో చూస్తే, శాడిస్టు భర్త నుంచి విముక్తి పొందిన కథలు, వితంతువుగా మారిన మహిళ కోరే జీవితం గురించి కొన్నిచోట్ల చెప్పారు. చివరి మజిలీలో ఉన్న భర్తకు చిన్ననాటి ప్రేయసిని ఒకసారి కలిపే ప్రయత్నం చేసిన ఆదర్శ భార్య కథ చదివింపజేస్తాయి.
రాయలసీమ యాసలో రాసిన " ఇంగ సెలవా మరి " మనసున్న ప్రతీ మనిషినీ పదే పదే చదివింప జేస్తుంది, ఇందులో బాధ్యత గల ఒక స్త్రీ జీవన శైలి, కుటుంబ విలువలు , బాధ్యత గల భార్య పాత్రను "నీల" పాత్రలో మలవడం, భార్య సమాధి వద్ద భర్త మనసులో మాట చెప్పడం చూస్తే కళ్ళలో నీళ్లు అప్రయత్నంగా వస్తాయి.
ఎన్నో ఏళ్ళు అనేక విధాలుగా అణచివేతకు గురి అయిన మహిళ స్వేచ్ఛను కోరుకోవడం, చివరి రోజుల్లో తన జీవితాన్ని తాను ఎలా మలచుకోవాలో అనే విషయాన్ని సూక్ష్మంగా వివరించారు .
నేటి సమాజంలో కన్నబిడ్డలు తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకి పంపుతున్న తీరులను కూడా వివరించారు. ఈ పుస్తకంలోని చివరి కథ ప్లీజ్ నాన్న నా కొడుకు భద్రంలో అరుణ కుమారి గారు తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలను కథగా రాశారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు సుగుణాలను తెలుపుతూ , తల్లి ప్రేమను కన్నీళ్లు నింపిన అక్షరాలతో బాధను కథలాగా కూర్చుతూ స్వర్గంలోని తండ్రికి తన బిడ్డ బాగోగులు చూడమని చెప్పే ప్రతీ అక్షరాలు పాఠకుల మనసుని తడుముతాయి.
"మన్నించండి మరోసారి" కథలో చితికి పోయిన మధ్య తరగతి జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక తల్లి తన బిడ్డ పోషణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడటం తల్లికి గల బాధ్యతను తెలిపింది. కొందరు దొంగబాబాలు తమ మహిమలతో ఏ విధంగా అమాయకులను మోసం చేస్తున్నారో "మట్టిబొమ్మలు" కథలో వివరించారు.
ఈ కథల పుస్తకంలోని కథల్లో ఒక పేద నిరుద్యోగి కష్టాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని విషయాలు, భార్యాభర్త, తల్లీబిడ్డల మధ్య ప్రేమ, ఆత్మవిశ్వాసం, ఆత్మ గోరవంకోసం పోరాటం, నేటి సమాజంలోని సంక్షోభం వాటి పర్వవసనాలను వివరిస్తూ సమాజాన్ని చైతన్యం చేసేందుకు రచయిత్రి ఎంతో తపించారు. ఈ పుస్తకం చదివిన ప్రతీ ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకుని తమ బాధ్యతలను మరోసారి స్వీకరిస్తారు అన్నది సత్యం.
ప్రతుల కోసం సంప్రదించండి
ఎం.ఆర్.అరుణ కుమారి
ఫోన్.8121523835