పుస్తక పరిచయం : పాటను పదునెక్కించే విమర్శ

By Arun Kumar P  |  First Published Dec 16, 2022, 9:18 AM IST

ఇవ్వాళ సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూమి బుక్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన పసునూరి రవీందర్‌ రాసిన వ్యాస సంకలనం ‘‘పోటెత్తిన పాట’’ ఆవిష్కరణ సభ సందర్భంగా సామిడి జగన్‌ రెడ్డి రాసిన ముందుమాట నుండి కొన్ని భాగాలు ఇక్కడ చదవండి:
 


గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సమాజం నిర్మించిన ప్రజా ఉద్యమాలలో కొనసాగుతున్న కవితా కళా సంప్రదాయాలను, వాటిని తీర్చిదిద్దిన రచయితల చరిత్రను, సాహిత్యాన్ని విశ్లేషించడానికి పూనుకున్నాడు అంబేద్కరిస్టు అయిన డాక్టర్‌ పసునూరి రవీందర్‌. ఇందుకు ఆయన మహాత్మా ఫూలే, డాక్టర్‌ అంబేద్కర్‌ ఆలోచనల సరళితో రూపు దిద్దుకున్న బహుజన దృక్పథాన్ని ఎంచుకున్నాడు.  ఈ నేపథ్యంలో ఆయన రాసిన వ్యాసాలను సంకలనం చేసి ‘‘పోటెత్తిన పాట’’ పేరుతో వెలువరిస్తున్నారు.  రవీందర్‌ మొదలు పెట్టిన ఈ క్రమానికి ఒక చారిత్రిక నేపథ్యం ఉన్నదని నేను భావిస్తున్నాను.  రాజకీయంగా తెలంగాణలో అంబేద్కరిస్టులు, వామపక్షవాదులు చేపట్టిన కార్యాచరణకు, సాంస్కృతిక రంగంలో రవీందర్‌ చేస్తున్న కృషి కొనసాగింపుగా భావిస్తున్నాను. దళిత బహుజన సాహిత్య ఉద్యమం మొదలైన నాటి నుంచి విప్లవవాదుల సహా అభ్యుదయ, విప్లవ రచయితలకు, దళిత బహుజన రచయితలకు కొన్ని వైరుధ్యాలు కొనసాగుతూ వచ్చాయి. అవి మిత్రవైరుధ్యాలే అయినప్పటికీ వాటిని అధిగమించడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు. రవీందర్‌ ఈ  వైరుధ్యాలను ఈ పుస్తకంలో చర్చించారు. పైగా విశ్లేషించి వాటిని అధిగమించడంలో భాగంగానే ఈ రచనకు పూనుకున్నాడు.

ఇంతకు ముందు రవీందర్‌ వెలువరించిన ‘‘తెలంగాణ ఉద్యమ పాట ` ప్రాదేశిక విమర్శ’’ అన్న సిద్ధాంత గ్రంథమైనా, ఇప్పుడు వెలువరిస్తున్న ‘‘పోటెత్తిన పాట’’  గ్రంథమైనా వామపక్షవాదులు, అంబేద్కర్‌వాదుల మధ్య కుదిరిన రాజకీయ ఐక్య సంఘటనను సాంస్కృతికంగా, తాత్వికంగా మరింత బలోపేతం చేసేదే. గత కొంతకాలంగా భారతదేశంలో ప్రబలుతున్న పరిస్థితుల నేపథ్యంలో రవీందర్‌ వంటి యువ పరిశోధకుడు చేస్తున్న పరిశోధన ఎంతటి విలువైందో ఈ నేపథ్యంలో అంచనాకు రావచ్చు. ఈ తరహా రచనలను ఉద్యమ సాహిత్యంగా, ప్రచార రచనలంటూ ఒక చిన్న చూపు చూస్తూ మాట్లాడే వారికి రవీందర్‌ చేస్తున్న కృషి ఒక జవాబు.

Latest Videos

గత  వందేళ్లుగా భారత దేశ సాంస్కృతిక రంగంలో ప్రజాస్వామిక విలువలను ప్రవేశపెట్టిన సాంస్కృతిక కళారంగాలపై పరిశోధన రూపేణా పుస్తకాలు రావడమనేది ప్రస్తుతం స్తబ్దచేతనగా మారిన ప్రగతిశీల రాజకీయాలకు ఊతమిస్తుందనే చెప్పాలి. ఆయా సాహిత్య ఉద్యమాలలో పనిచేస్తూ రచయితలుగా, విమర్శకులుగా చలామణిలో ఉన్న వారికి రవీందర్‌కు చాలా తేడా ఉంది. ఆయన స్వయంగా ఒక గాయకుడు. ఒక పాట రాయడంలోని సాదక బాధకాలు ఆయనకు అనుభవమే. స్వయంగా పాటలు రాసిన వ్యక్తి. దాదాపు అన్ని రచనా  ప్రక్రియలలో ప్రవేశం ఉన్నది. ఈ కారణం చేత రవీందర్‌ ఈ రంగంలో విమర్శ రాయడానికైనా, చరిత్రను నిర్మించడానికైనా సరైన వ్యక్తి.  పాటలను ఒక చారిత్రిక దృక్పథంతో సామాజిక, రాజకీయ ఆర్థిక కోణంలో ఇంతటి విస్తృతంగా చర్చించిన రచయిత మరొకరు లేరు. మొత్తం తన వ్యాసాలలో సామాజిక చర్చకొస్తే బహుజన దృక్పథంతో విశ్లేషించడానికి రవీందర్‌ రాజకీయ, ఆర్థిక విషయాలకోస్తే మార్క్సిస్టు విశ్లేషణ పద్దతులు ఉపయోగించడం కనిపిస్తుంది. తెలుగు విమర్శకులలో ఇంతటి బహుముఖీన ప్రతిభ ఉండడం చాలా అరుదైన విషయం. స్వయంగా కళాకారుడు కావడం వల్ల కావచ్చు, చింతల యాదగిరి మీద రాసిన వ్యాసం ఈ పుస్తకంలోకెల్లా విశిష్టమైంది. పాటకు సంబంధించిన విమర్శకు అదొక నమూనగా నిలువదగ్గ వ్యాసమది. భవిష్యత్తులో రవీందర్‌ గమనానికి ఈ రచన ఒక సూచిక.

మరో కోణంలో చెప్పుకోవాలంటే  తెలుగులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ తరహా రచనలకు పరిశోధనకు పూనుకున్న తొలి దళిత చరిత్రకారుడు డాక్టర్‌ పసునూరి రవీందర్‌.  సామాజిక ఉద్యమాల నుంచి మొదలు పెడితే విప్లవోద్యం వరకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో దళిత బహుజన నేపథ్యం లేని కళాకారులు లేరు. ఒకరిద్దరు ఉన్నా, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.   వందేళ్ల ప్రగతిశీల లేఖక్‌ సంఘ్, ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ ఉద్యమంలో అనామకంగా మరణించిన దళిత బహుజన కవులు, కళాకారులు ఎంతోమంది. అంతేకాదు తెలంగాణలో ప్రజానాట్యమండలి కార్యాచరణకు సంబంధించిన వెలుగులోకి వచ్చిన చరిత్ర అంతంత మాత్రమే. మొత్తంగా  ప్రగతిశీల క్యాంపునకు సంబంధించివారి నేపథ్యం చూస్తే అత్యధికులు అట్టడుగు వర్గాల వాళ్లు, ముస్లింలు. వీరిలో ఆధునిక విద్యారంగంలో ప్రధానంగా సామాజిక శాస్త్రాలకు సంబంధించిన చరిత్ర గురించి దాని ప్రాధాన్యత గురించి తెలిసింది నామ మాత్రమే. దీంతో ఆనాటి కాలనా దేశ వ్యాప్తంగా వామపక్ష ఉద్యమాలకు, వలసవాద, సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యారచణకు సంబంధించిన సాంస్కృతిక రంగాల చరిత్రంటూ అందుబాటులో లేకుండా పోయింది. అదే ఉన్నట్టయితే వర్తమాన సందర్భంలో యువతరానికి ఉత్తేజ పూర్వకమైన కార్యాచరణకు సంబంధించిన ఎజెండా దొరికేది. 

తెలంగాణ సాయుధ పోరాట కాలానికి తొలినాళ్లలో వరంగల్‌, నల్గొండ , ఖమ్మం వంటి జిల్లాలో గ్రామ గ్రామాన ప్రజా నాట్యమండలి కళాకారులు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మాల కులానికి చెందిన రాజారాం, ప్రముఖ గాయని సంధ్య తండ్రి గొడిశాల బుచ్చయ్య, తిరునగరి రామాంజనేయిలు, ప్రియంవద వంటి మహిళ, దళిత చిత్రకారులు కుమారిలస్వామి, అర్హా,  హైదరాబాద్‌కు చెందిన చిత్రకారుడు సయ్యద్‌ బిన్‌ అహ్మద్‌ వారిలో ప్రముఖులు. సుద్దాల హనుమంతుపై ప్రముఖ పరిశోథకుడు జయధీర్‌ తిరుమలరావు వల్ల, వారి కుటుంబం పూనుకోవడం వల్ల రెండు పుస్తకాలు వెలువడ్డాయి.  తెలుగులో వ్యాసాలు రావడం వల్ల మరాఠీ దళిత మహాకవులు అన్నాబావు సాఠే, నారాయణ సుర్వే,  అమర్‌షేక్‌, విలాస్‌ ఘోగ్రే వంటి వారి గురించి తెలిసింది. వీళ్లంతా దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చెందిన వారే. ఈ పరిస్థితులలో రవీందర్‌ తన పుస్తకాలతో వేస్తున్న బాట భవిష్యత్తులో మరింత లోతుగా, మరింత విస్తృతంగా నిర్మితమయ్యే అవకాశం ఉన్నది. ఈ పరిశోధనకు సంబంధించి ఈ ముందు మాటను విస్తరించి రాయడానికి కారణమిదే.

సాధారణంగా కవి గాయకులైన వ్యక్తులు తమ సాటి రచయితల కృషిని గ్రంథస్తం చేయడానికి పూనుకోరు, పూనుకున్నా  అందుకు సాహసం కావాలి. ఒకరి గురించి రాసి మరొకరిని విస్మరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విస్మరణకు గురైన వ్యక్తి కక్ష కట్టడం ఖాయం. ఒక దార్శనికతతో కొంత మంది రచయితలను ఎంపిక చేసుకుని విశ్లేషణకు పూనుకున్నారు. రవీందర్‌కు తాను చేస్తున్న పని పట్ల ఒక స్పష్టత ఉన్నది. ఆయన దానిని బాధ్యతగా తీసుకున్న తీరు ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది.

click me!