ప్రముఖ తెలుగు రచయిన నర్రా ప్రవీణ్ రెెడ్డి రచించిన 'పొత్తి' నవలకు 2021 సంవత్సరానికి గాను అంపశయ్య నవీన్ నవలా పురస్కారం లభించింది.
తెలుగు నవలా సాహిత్యంలో నర్రా ప్రవీణ్ రెడ్డి రచించిన 'పొత్తి' నవల చిరస్థానాన్ని సంపాదించిందని... తెలంగాణ గ్రామ జీవితాన్ని, రాజకీయ చారిత్రక అంశాలను , మలిదశ ఉద్యమ తీరును ఈ నవల ఎత్తి చూపిందని కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అభినందించారు. ప్రతిష్టాత్మక అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు వారి ఉత్తమ నవలా పురస్కారం -2021ని నర్రా ప్రవీణ్ రెడ్డికి హనుమకొండలోని హరిత కాకతీయ హాల్ లో ప్రదానం చేసారు.
తెలంగాణకు అందివచ్చిన ఉత్తమ యువ నవలా రచయిత నర్రా ప్రవీణ్ అని... తెలంగాణ మట్టి చైతన్య వారసత్వానికి ప్రతీక నర్రా ప్రవీణ్ రచన అని వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత డా. అంపశయ్య నవీన్ మాట్లాడుతూ తెలంగాణ గర్వించదగిన సాహిత్య ఉద్యమకారుడైన ప్రవీణ్ తెలంగాణ వాస్తవిక జీవితాన్ని, మలిదశ పోరాటాన్ని, సజీవ పల్లె భాషలో 'పొత్తి' నవలగా రాసి ఘనతికెక్కాడని ప్రశంసించారు.
'పొత్తి' నవల వ్యావసాయిక జీవితాలను, ప్రజా ఉద్యమాలను వర్ణిస్తూనే అవినీతిమయ రాజకీయాలను హెచ్చరించిందని, స్వరాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్వనిని ఇస్తుందని సభాధ్యక్షులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో , పల్లెల్లో జరిగిన ఉద్యమంతో పాటు సామాజిక సంస్కరణ దృక్పథం ఈ నవలలో రచయిత సృజించాడని ప్రముఖ విమర్శకులు కె.పి అశోక్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గార్లు కీర్తించారు. నవలకు పురస్కారం అందించినందుకు నర్రా ప్రవీణ్ ట్రస్టు వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన భవిష్యత్ రచనలకు ఈ అవార్డు ఊతం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి డి. స్వప్న, గిరిజా మనోహర్ బాబు, డా. పల్లేరు వీరాస్వామి,నెల్లుట్ల రమాదేవి,కోట్ల వనజాత , స్ఫూర్తి, కామిడీ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.