అమెరికాలో స్థిరపడినా తెలుగు మమకారంతో రచనలు చేస్తున్న కె.గీతకు ఈ సంవత్సరం అంపశయ్య నవీన్ నవలా పురస్కారం దక్కింది.
కాలిఫోర్నియా వాస్తవ్యులు డా.కె.గీత రాసిన నవల "వెనుతిరగని వెన్నెల"కు 2022 సంవత్సరానికి గాను "అంపశయ్య నవీన్ నవలా పురస్కారం" లభించింది. డిసెంబరు 24, 2022 న హన్మకొండలోని కాకతీయ హోటల్ లో జరిగిన సన్మాన కార్యక్రమానికి కె.గీత తల్లి, ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మి హాజరై అందుకున్నారు. గీత అన్నయ్య రవీంద్ర ఫణిరాజ్ గీత స్పందనని సభకు చదివి వినిపించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ప్రతియేటా తన జన్మదినోత్సవం నాడు తొలి నవలా రచయితలకు ఈ పురస్కారాలను అందజేస్తూ వస్తున్నారు. ఈ సభలో శాసన సభ్యులు దాస్యం వినయభాస్కర్, కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. తాటికొండ రమేష్, నవీన్ కుమార్తె స్వప్న, ప్రొ. బన్న అయిలయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావు మున్నగు ప్రముఖులు పాల్గొన్నారు.
undefined
ఈ సందర్భంగా నవీన్ గ్రంథాల ఆవిష్కరణ కూడా జరిగింది. ఇప్పటికే "వెనుతిరగని వెన్నెల"కు జూలై, 2022లో వంశీ ఇంటర్నేషనల్ డా. హేమలత పురస్కారం లభించింది. కాగా "అంపశయ్య నవీన్ నవలా పురస్కరం" ఈ నవలకు రెండవ పురస్కారం.
"వెనుతిరగని వెన్నెల" నవల కౌముది అంతర్జాల పత్రికలో ఆరుసంవత్సరాల పాటు సీరియల్ గా ప్రచురితమై, టోరీ రేడియోలో ఆడియోగా ప్రసారమై అత్యంత ప్రజాదరణ పొందింది. డా.కె.గీత ఈ సందర్భంగా తన స్పందన తెలియజేస్తూ "ఈ నవలా నాయిక తన్మయిలా యువతులందరూ నిలబడాలని, ఎప్పటికప్పుడు జీవితాన్ని నిరాశామయం కాకుండా తనని తాను కాపాడుకుంటూ తన చుట్టూ ఉన్నవారిని కూడా ఆ పాజిటివిటీతో ప్రభావితం చెయ్యాలని అన్నారు. ఈ కథ తన్మయిలా కష్టాల పాలైన ఎందరో యువతులకు అర్థవంతమైన గమ్యాన్ని సూచిస్తుందని, జీవితం విలువ తెలియజేస్తుందని అనుకుంటున్నాను. ఇది ఎందరో తన్మయిల వంటి యువతుల స్వీయ గాథ. తన్మయిలా జీవితపు పెను సవాళ్ళని ధైర్యంగా, సంయమనంతో యువతులందరూ ఎదుర్కోవాలని ఆశిస్తున్నాను" అన్నారు.