హైదరాబాద్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో దాసరి మోహన్ రచించిన " రాల్ల కుచ్చె " కథా సంపుటి ఈ రోజు ఆవిష్కరణ సందర్భంగా కందాళై రాఘవాచార్య చేస్తున్న పుస్తక పరిచయం ఇక్కడ చదవండి.
దాసరి మోహన్ గతంలో "దండెం", "అల్మార" కవితా సంకలనాలు రచించారు. ఇప్పుడు "రాల్ల కుచ్చె" కథా సంపుటాన్ని తీసుకు వస్తున్నారు. ఈ సంపుటిలో 17 కథలున్నాయి. అన్నీ వైవిధ్య ఇతివృత్తాలు.
మొట్టమొదటి కథ "జీవితం కొనసాగించాల్సిందే". రెండు వేరు వేరు కుటుంబాల్లోని స్త్రీ పురుషులు కారు ప్రమాదంలో చనిపోతారు. అందరూ వారిని భార్యాభర్తలు అనుకుంటారు. కాని కాదు. తిరిగి వారు నిరాశ పడక ఒకే కుటుంబంగా కలిసిపోతారు. ఇదే "జీవితం కొనసాగించాల్సిందే" కథ. ఇంత వరకు ఇలాంటి ఇతివృత్తం చూసి ఎరుగము.
కథా సంపుటి పేరు గల మరో కథ "రాల్ల కుచ్చె". ఈ కథలో తమ బాల్యంలోని జ్ఞాపకాలను గ్రామంలోని రాల్లకుచ్చె వద్దకు వచ్చి నెమరు వేసుకుంటారు. ఇంకో కథ "అమ్మ సేవ". ఈ కథలో అమ్మను బాగా చూసుకోవాలనే పరివర్తన రావడం. ఈ కథ చదివాకా అనేక మందిలో మార్పు రావచ్చు. మరో కథ సంసార రేఖలు. సంసారంలోని ఎత్తు పల్లాలు, గెలుపు ఓటములు, సన్మానాలు ఎన్నో ఈ కథలో మలుపులుగా రవీంద్ర భారతి వద్దకు వస్తాయి.
"రిటర్న్ గిప్ట్ " కథలో -- తనను ఎవరో గుర్తు తెలియని వారు హాస్పిటల్లో చేర్చి ఆదుకుంటారు. అడిగినా ఎవరూ తెలియదంటారు. తాను కూడ తన జీతంలో మరియు తన సమయంలో 20 శాతం సేవా కార్యక్రమాల కొరకు వినియోగించడమే రిటర్న్ గిప్ట్ లో కొస మెరుపు. మరో కథ "గుంతలు" ! కాలనీల్లో గుంతలు సహజంగా ఉండటం మాములే. ప్రభుత్వం పట్టించుకోదు. అందరూ కలిసి సమావేశాల్లో చర్చించుకుందాం అని అనుకుంటారు. గుంతలు పూడ్వటానికి ఎన్నో అభ్యంతరాలు. కాని ఎవరికి చెప్పకుండా మాష్టారు గుంతలను పూడ్చేస్తారు. అందరికీ కనువిప్పే ఈ గుంతలు కథ .
నేటి కట్న కానుకల సమస్య గురించే " మిడిల్ క్లాసు అమ్మాయి " కథ. కాబోయే భర్త దగ్గరకు కాబోయే భార్య - అదే మిడిల్ క్లాసు అమ్మాయి కట్నం వలన నాన్నకు ఇబ్బందులు అవుతున్నాయని - తాను ఉద్యోగం చేస్తున్నాని - కుటుంబానికి తన సంపాదన తోడుగా ఉంటుందని - ఆర్థిక ఇబ్బందులుండవని కాబోయే భర్తను ఒప్పిస్తుంది. పెండ్లి హాయిగా జరిగిపోతుంది. ఈ నేపథ్యం ఎవరికీ తెలియదు. ఇలా ప్రతి కథ ముగింపులో కొత్తదనం, సరి కొత్త శైలితో పాఠకులను అలరిస్తూ ఆకట్టుకుంటాయి.
ఇంకా మరికొన్ని హాస్య కథలు - తెలుగు అత్త ఇంగ్లీషు కోడలు, పిట్టలు రాలుతున్నాయి, కాలం తీర్పు కథలు మనను ఆలోచింపజేస్తాయి. ప్రతి కథలో సామాజిక హృదయాన్ని రచయిత దాసరి మోహన్ ఆవిష్కరించారు. ఇంకా అనుపమానమైన రచనలు వీరి కలం నుండి వెలువడాలి.