నరాల సుధాకర్ కవిత : బందీలవుతున్నాం

By Arun Kumar P  |  First Published Apr 27, 2022, 10:38 AM IST

మారీచ జింక వర్ణాలకు బందీలవుతున్నాం అంటూ  లౌకిక శక్తుల పునరేకీకరణ కోసం తపిస్తున్న నరాల సుధాకర్ రాసిన కవిత "బందీలవుతున్నాం" ఇక్కడ చదవండి: 
 


తరిచి చూసుకుంటే నమ్మకద్రోహాలకు బలి అవుతూ
నిత్య  బందీలుగ మారుతున్న స్వాతంత్ర్య బతుకులు మనవి
నది లాంటి నిజాలను
నిజాయితీ లేనివారు దాచెయ్యడంతో
అబద్దాల ఎండమావికి మనం బందీలవుతున్నాం
బలవంతుడు బలం ప్రయోగించి
మనల్ని బలహీనుల్ని చేస్తుంటే 
ప్రశ్నించలేని జడత్వపు చేతిలో బందీలవుతున్నాం
తాము మంచి వాళ్లమని చెప్పుకోవడానికి ఎదుటోళ్లను చెడ్డగ చూపెడుతున్న వారి దృతరాష్ట్ర కౌగిలిలో బందీలవుతిన్నాం
అగ్ని హోత్రం ఇదంటూ మనల్ని కబోదులను చేస్తూ
మంచికి చితి పేరుస్తున్న వారి కబంధ హస్తాల్లో బందీలవుతున్నాం
చుట్టూ తాము సాగిస్తున్న దుర్నీతిని చూడకుండ మన కళ్లకు కడుతున్న  గాంధారి గంతలకు బందీలవుతున్నాం
సమాజ హితం కోసం అగ్ని గుండంలో నడిచే 
మన పాదాలకు మర్ధన చేస్తామని దారి మళ్లిస్తున్న 
మారీచ జింక వర్ణాలకు బందీలవుతున్నాం

click me!