గడ్డం శ్యామ్ రాసిన 'వాగ్దానపు ఉషోదయం' పై రచయిత సినీ దర్శకుడు నామాల రవీంద్రసూరి రాసిన సమీక్ష ఇక్కడ చదవండి.
మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో తమ ఉనికికి ఎంతో ప్రాధాన్యత ఉందనీ, కావాలనీ ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఆ మనుషులకీ, ఎంతో ప్రాధాన్యత ఉందనుకుంటున్న వారి ఉనికికీ ఒక భద్రత కల్పించి వారు కోరుకున్నది వారికి అందివ్వాలని ఓ నాయకుడు కోరుకుంటాడు..
మనుషుల్ని , మానవ జీవితాల్ని, మన చుట్టూ ఉన్న ప్రాపంచిక సంఘటనల్ని అర్థవంతమయ్యేలా చూసేది శాస్త్రం అయితే, ఎలాంటి శాస్త్రీయ సూత్రాల ప్రమేయం లేకుండా జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేట్లు చేయగలిగే శక్తి ఒక్క కవిత్వానికి మాత్రమే ఉంది.
'కవిత్వం అంటే ఒక అన్వేషణ'
కవిత్వం రాయడం , నాయకత్వం వహించడం ఈ రెండు చేసే వ్యక్తితో సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది.
ఈ కవి నాయకుడు.
ఈ నాయకుడు కవి.
'వాగ్దానపు ఉషోదయం' రాసిన కవి పుట్టిన గడ్డ కావొచ్చు, పెరిగిన వాతావరణం కావొచ్చు చిన్నప్పటినుండే ప్రశ్నించే స్వభావం అలవాటు చేసుకున్నాడు. దిక్కరించాడు, ఎదిరించాడు అవసరమైన చోట ఆసరా అయ్యాడు. నాయకుడు అయ్యాడు. ఒక నాయకుడు కవి అయితే ఎలాఉంటుందో ఈ పుస్తకం ముఖ చిత్రం చూస్తే అర్ధమవుతుంది.
పంజాను పట్టి పులిని పోల్చుకోవాలంటారు. అలాగే ముఖ చిత్రాన్ని బట్టి లోపల ఏముందో కనిపెట్టెయ్యొచ్చు. కవర్ పేజీని ఎంతో భావగర్భితంగా , ఆకర్షణీయంగా అర్థవంతంగా వేశారు.ముఖచిత్రంపై దానిమ్మ రంగులో ఎదిగొస్తున్న బాలసూర్యుణ్ణి నిండా కప్పేసుకుని ఆశగా ఎగరాలని ఆకాశం వైపు చూసే పక్షి ఉన్న పదునైన చిత్రమది.
ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఓ.యూ ప్రొఫెసర్ డా.కొండా నాగేశ్వర్ వ్యక్తిగత ఆలోచనలను వ్యక్తి కోసం కాకుండా సామూహిక సామాజిక సంక్లిష్టత వైపు మలచటం కోసం శ్యామ్ చేసిన ప్రయత్నం అన్నారు.
ఈ పుస్తకం రెండు భాగాలుగా విభజించబడింది. ఇందులో 15 వ్యాసాలు మరో 33 కవితలు ఉన్నాయి . ఇది వ్యాస సంపుటి అనాలా? కవితా సంపుటి అనాలా? అనే ఆలోచన వస్తే "వ్యాస కవితా సంపుటి" అనొచ్చు. ఇందులోని వ్యాసాలన్నీ వివిధ దిన,వార, మాస పత్రికల్లో ప్రచురింపబడినాయి. ఏ వ్యాసాన్ని చదివినా మనలో తెలియకుండానే ఏదో ఆవేశానికి లోనవుతాము. ఉదాహరణకు ఒక సినిమా చూసేప్పుడు తెరమీద జరుగుతున్న సంఘటనకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల మనలో అదే ఎమోషన్ క్యారీ అవుతుంది. అదే విధంగా వ్యాసం కూడా మనల్ని లాక్కెళ్తుంది.
మనుషుల ఆర్థిక అసమానతల్ని వాటి అంతరాల్లోని అనేకానేక ఆలోచనల్ని అక్షరాల్లో పొదిగి ఒక వ్యాసాన్ని చెక్కుతాడు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఎన్నో చీకటి సంఘటనలను చీల్చి వెలుగులోకి విసిరేసే ప్రయత్నం చేసాడు ప్రతి కవితలో. ఈ పుస్తకం నేను చదువుతున్నానంటే దీని వెనుక ఒక మనిషి ఉన్నాడు. వెనుక అంటే పుస్తకాన్ని ముందు పెట్టి వెనుక ఉండడం కాదు. ఈ అక్షరాలు నేను చదువుతుండడం వెనుక అని అర్థం.
ఒక పుస్తకంలో రెండు ప్రక్రియల్ని ఇమిడ్చాడు అంటే అతడు ఏక కాలంలో ఎన్నో పార్శాలను దర్శించే మనిషి అని అర్ధమవుతోంది. జరిగే ప్రతి సంఘటనలోని గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్ ను మూడింటినీ ఈ పుస్తకం లో బంధించడానిపిస్తోంది.
శ్యామ్ కవి కంటే ముందు నాయకుడు. అంటే వ్యవస్థలోని అవస్థలను చూస్తూ వేలెత్తి నినదిస్తూ నిలదీస్తూ క్రమక్రమంగా వ్యవస్తీకృతమైనాడు.
తను వచ్చిన నేపధ్యం
చూసిన స్థితులు
అనుభవించిన పరిస్థితులు
ఒక మనిషిని నాయకుడు గానూ చేస్తాయి లేదా కవి గానూ చెయ్యొచ్చు అనడానికి మంచి ఉదాహరణ గడ్డం శ్యామ్ అని చెప్పొచ్చు. శ్యామ్ కి ఇవి బాగా వర్తించి ఉంటాయి . అందుకే నాయకుడు , కవీ రెండూ అయ్యాడు.
"ఆదివాసులతో వారం రోజులు" అనే వ్యాసం చదివితే తన పట్లే కాకుండా జనం పట్ల ఎంత శ్రద్ద ఉందో కనబడుతుంది. ఈ వ్యాసాన్ని రాస్తూ చివరలో దేశ అభివృద్ధి నగరాలనుంచి కాదు ఆదివాసీ గూడెంల నుంచి జరగాలి. ఆదివాసుల గొంతుకగా నిలబడి వారి హక్కుల కోసం ముందుండాలి అనే చైతన్యం నింపుకున్నాం అంటూ ముగిస్తాడు.
అదే ఆదివాసీల మధ్య గడిపిన అతని అనుభవాన్ని "గర్విద్దాం" అనే చిన్ని కవితలో-
అడవి ఆదివాసుల మధ్య
వెన్నెల వెలుగుల కింద
ఆ రాత్రి నిద్ర నిజంగా బాగు
ఇంటి ప్రేమ మరిపించేలా అంటాడు.
కవి ఇక్కడ సమాజానికి దూరంగా ఉన్న ఆదివాసీల జీవన విధానాన్ని ఆవాహన చేసుకున్నాడు.
అస్తమించిన సూర్యుడు ఉదయించక మానడు. మరణించిన వీరుడు ఏదో ఒక రూపంలో తన ఉషోదయ వెలుగుల్ని ప్రసారించక మానడు అని వీరుడుకి మరణం లేదు అనే ఆశాభావాన్ని ముందు తరాలకు తెలిసేలా వీరుడైన "మారోజు వీరన్న"
గురించి మరో వ్యాసంలో అద్భుతంగా రాసాడు. మారోజు వీరన్న లాంటి వీరులకు సహచరులం అని నినదిస్తూ "స్వాప్నికులం" అనే కవితలో -
మేం
స్వాప్నికులం
అలుపెరుగని బాటసారులం
కలల తీరాల దరికి సాగే నావికులం
బందీలేని బంధాల్లో
స్వేచ్చా సమానత్వం కోరు
ఆత్మీయ సహోదరులం
సహచరులం
అని తను చేసే పోరాటంలో
విశ్రాంతిని ఆశించని వీరుడిలా కనిపిస్తాడు.
జీవితాన్ని ఒక పోరాటంలా మల్చుకొని స్ఫూర్తినిచ్చిన ఉద్యమకారుడు జార్జిరెడ్డిని పూర్తిగా చదివేసి అతన్ని నిలువెల్లా నింపుకొని అతని గూర్చి అనర్గళంగా రాసే శ్యామ్ లో కనిపించని జార్జిరెడ్డి దాగున్నాడు. అందుకే ఈ పుస్తకాన్ని జార్జిరెడ్డికి అంకితమిచ్చాడు.
ఆసిఫా కవిత నుండి హత్రాస్ సంఘటన దాకా అన్ని కవితల్లో అద్భుత స్పందన కనిపిస్తుంది. దీనితో కవి స్పందనాశీలి అని అర్ధమవుతోంది. శ్యామ్ రాసిన వ్యాసాలను, కవితలను పరిశీలించి నట్లైతే పరిస్థితులను అనుభవించి అక్షరీకరించినట్టు ఒక అనుభవం, ఒక పరిశీలన, ఒక శ్రద్ద, ఒక నిబద్ధత నిండైన బాధ్యత కనిపిస్తుంది.
కొన్ని వ్యాసాల్లోని సారాంశం అందరికి తెలిసిందే అవ్వొచ్చు. కానీ ఒక ఆర్ద్రతాభావంతో ఆరాధనా సారంతో రాయడం వల్ల సజీవంగా ఆ మనుషులు కాసేపు మన కళ్ళ ముందు కదలాడి వెళ్తారు. ఉదాహరణకు మారోజు వీరన్న గురించి మరియు జార్జిరెడ్డి గురించి రాసిన వ్యాసాల్లో ఇతడికి వారిపట్ల ఉన్న ఇష్టం స్పష్టమౌతోంది. ఇందులోని కవితలన్నీ సందర్భాలు, సంఘటనలే కవిత్వీకరించినట్లు మనకు కనిపిస్తాయి. కవితల్లో శ్యామ్ వాడిన భాష చాలా సరళంగా ఉంటుంది. కవితా నిర్మాణం కూడా కొత్త కొత్త పద్ధతుల్లో కనిపించింది. చిన్న సమస్యనైనా, పెద్ద సంఘటనైనా శ్యామ్ అవలీలగా కవితా వస్తువు చేసుకుంటాడు. ఇతని కవిత్వంలో సాగతీత విధానం ఉండదు. చెప్పాలనుకున్న విషయం సూటిగా, ఫట్ మని కొట్టినట్లుగా చెప్పేస్తాడు. ప్రతి కవితలో శ్యామ్ అనుభవం అతను చేసిన అధ్యయనం రెండూ కనిపిస్తాయి.
ఏ భాషా కవిత్వమైనా ఒక కొత్త తరానికి నూతన మార్గాన్ని అన్వేషించే దిశలోనే సాగుతుంటుందనడానికి ఉదాహరణ గడ్డం శ్యామ్ రాసిన "వాగ్దానపు ఉషోదయం" అని చెప్పొచ్చు. పాతికేళ్ల వయసులోనే ఎంతో అనుభవాన్ని అక్షరీకరించి అందించిన శ్యామ్ కి మనసారా అభినందనలు తెలుపుతున్నాను.