ప్రముఖ కవి అఫ్సర్ రాసిన Isolation కవితను ఇక్కడ అందిస్తున్నాం. అఫ్సర్ అమెరికాలోని ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలోని సౌత్ ఏషియా స్టడీస్ పనిచేస్తున్నారు.
యెన్ని అందాలుగా
సర్దుకుంటూ కూర్చుంటామో
జీవితాన్ని-
యెదురుగా నిలబడిన
పూల మొక్కలోకి
పురుగు వచ్చేస్తుందని
ప్రతి రెమ్మలో పది రెప్పల్ని కాపలా వుంచుతామా
కొలుస్తూ కొలుస్తూ కాలాన్ని
కొన్ని ఖాళీ సమయాల్ని నింపడానికి
కొన్ని పుస్తకాలూ
కొన్ని ఉత్తరాలూ
యింకొన్ని ఫోన్ నెంబర్లూ
యెన్ని తీసి తీసి పెట్టుకుంటామా
ఆకుపచ్చ చివర మొగ్గ నవ్వుతుంది
చివరికి-
పుస్తకమేదో పుటలు తెరుచుకుంది
ఆఖరికి-
ఉత్తరమేదో వాక్యమై వెలుగుతుంది
మనసుకి-
మరచిపోలేదని
గుర్తుచేస్తుంది ఫోన్ నంబర్ యేదో మెరిసి-
జీవితం భలే వుంది కదా అని,
అన్నీ చేయిదాకా వచ్చేశాయ్ అనుకుని
వొళ్ళంతా పండగ చేసుకుంటామా!
అప్పుడొస్తుంది
ఆగీ ఆగీ ఆ మృత్యువు.
యీ క్షణమే నన్ను రాల్చి వెళ్లిపోయే
నెమ్మదస్తురాలైన గాలిలాగా-
అన్నీ వదిలేసి
నేనొక్కడినే మృత్యువుతో లేచిపోతాను,
నా పూలూ
నా పుస్తకాలూ
నా ఫోన్ నెంబర్లూ
అన్నీ నా గదిలోనే వదిలేసి!