తెల్లవార్లూ కురుస్తున్న వర్షం తన మనుమరాలి ఔచిత్యభరితమైన మాటల్లో ఎలా వరదై పారిందో కరీంనగర్ నుండి నలిమెల భాస్కర్ రాసిన కవిత " సృజనాత్మకత " లో చదవండి.
పొద్దస్తమానమూ తెల్లవార్లూ
రోజు రోజంతా పై నుండి కిందికి
అదేపనిగా కారుతున్న సనసన్నటి తుంపరను చూసి
"ఇదేమిట్రా?"అనడిగాను మా మనుమరాల్ని
"తాతయ్యా! ఏ కిర్రాక్ మేస్త్రీ ఆకాశానికి స్లాబ్
వేశాడో గాని చిన చిన్నని క్రాక్స్ వచ్చుంటాయి" అంది ఠకీమని
మర్నాటికే ఆ తుంపర జోరు వానగా మారేసరికి
మళ్ళీ మా చిన్న తల్లిని "మరిదేమిటి?" అన్నాను
"ఓ అదా.. పై లోకంలోని దేవతలు బోర్ వేసి
మరిచిపోయినట్టున్నారు
ట్యాంక్ నిండి పోయి భోరున నీళ్ళు పడుతున్నాయి" అనేసింది ఠపీమని
తెల్లవారేసరికల్లా
అటు ముసురూ కాక ఇటు కుండపోత కాక
వర్షం మామూలుగా కురుస్తుంటే
"నేచురల్ గానే ప్రకృతి
ఏటా ఓ నాలుగు నెళ్ళు
పైన నల్లాలు విప్పుతుంది తాతయ్యా" అంది నింపాదిగా
నేనేమీ ప్రశ్నించకుండానే అసలు గుట్టు విప్పుతూ
అప్పటికే నిండు గర్భిణిగా వున్న నా లేఖిని
మా మనుమరాలు ఔచిత్యభరితమైన మాటలకు
ఇలా ఓ నాలుగు అక్షరాలు కన్నది వెన్ వేంఠనే