గోపగాని రవీందర్ కవిత : కొన్ని సందర్భాలు

By Arun Kumar P  |  First Published Jul 8, 2022, 8:54 AM IST

మానవీయమైన పందిరి కిందికి మనమంతా చేరేదెప్పుడో...! అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత   " కొన్ని సందర్భాలు " ఇక్కడ చదవండి : 


తెలిసిన వారే
తెగువను నేర్పించిన వారే
రోజు రోజుకు కనుమరుగవుతున్నారు
అంచనాలు తరుగుతున్నాయి
తప్పటడుగులు పెరుగుతున్నాయి 
అలసట లేకుండా మనసు
తలంపులతో తగువు లాడుతున్నది
దారితప్పిన మనిషి
దరికి వచ్చేదెప్పుడో
మానవీయమైన పందిరి కిందికి
మనమంతా చేరేదెప్పుడో...!
         ***
నడిచిన బాటనే కావచ్చు
కొత్తగా దర్శనమిస్తుంది
నడిచే  మనుషుల ముఖాలు
నిత్యం మారుతుంటాయి
అందుకేనేమో 
ఊళ్ళో  యాత్రికున్నై
దారులన్నింటినీ పలకరిస్తుంటాను
పూలు వికసించిన తోటల్లా
ఇప్పుడు బాటలన్నీ 
మాటలతో విలసిల్లుతున్నాయి..!
           **  
అనుభవాలు చెలిమెల వంటిది
గత కాలపు గుర్తులను
తలచుకున్నప్పుడల్లా
తడియారని స్పర్శలా 
తనువంతా ఉప్పొంగుతాయి
తోడుకున్న కొద్ది
ఊరుతున్న జలంలా
జీవనోత్సాహం ఉరకలేస్తుంది
ఉరుముతున్న ఆందోళనలతో
చెదిరి పోతున్న నల్లని మబ్బుల్లా
చెలిమలెప్పుడు ఇంకిపోవు
అనుభవాలెప్పుడు వీడిపోవు..! 

click me!