''కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్'' పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

By Arun Kumar P  |  First Published Jul 5, 2022, 5:41 PM IST

ప్రముఖ రచయిత మనోహర్ చిమ్మని రాసిన ''కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్'' పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 


హైదరాబాద్ : ఆరుదశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన ఒక అసామాన్య వ్యక్తి, ఉద్యమశక్తి, దార్శనికుడు, వ్యూహకర్త, విభిన్నరాజకీయవేత్త, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ప్రముఖ రచయిన మనోహర్ చిమ్మని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం తనదైన శైలిలో సంచలనాలు సృష్టించబోతున్న ఈ సందర్భంలో... ఒక నంది అవార్డు రచయితగా, ఫిలిం డైరెక్టర్‌గా, కేసీఆర్ డైహార్డ్ అభిమానిగా, తెలంగాణ బిడ్డగా ఆయనకి అందిస్తున్న చిరుకానుకే "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకమని మనోహర్ అన్నారు. 

కేసీఆర్ కేంద్రబిందువుగా తెలంగాణ ఉద్యమంలోని వివిధ అంశాలపైన,  ఉద్యమానంతర విషయాలపైన… ఆయా సందర్భాల్లో తన ఆలోచనలను మనోహర్ చిమ్మని తన బ్లాగ్‌లో రాశారు. పత్రికల ఎడిట్ పేజీలకు ఆర్టికిల్స్ రూపంలో రాశారు. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీటన్నిటినుంచి ఎన్నిక చేసిన కొన్ని ఆర్టికిల్స్‌తో మనోహర్ చిమ్మని రూపొందించిన ఒక అందమైన సంకలనం ఈ పుస్తకం. ఈ చిన్న ప్రయత్నం ఇన్‌స్పిరేషన్‌తో... తనలాంటి ఇంకెందరో బయటికిరావాలని, వాళ్ళంతా కూడా వారికి వీలైన విధంగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పనిచేయాలన్నది ఈ పుస్తకం ద్వారా మనోహర్ చిమ్మని ఆశిస్తున్నారు.

Latest Videos

ఈ పుస్తకాన్ని తెలంగాణ ఐటి & ఇండస్ట్రీస్ మినిస్టర్, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ఈరోజు ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత 60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించని తెలంగాణను కేసీఆర్ సాధించారన్నారు. తెలంగాణ సాధన ఆశయం కోసం ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ ఢిల్లీలో ప్రతిఒక్కరిని కలుపుకొనిపోయామన్నారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో ప్లాన్లు వేశారని... తన శక్తియుక్తులన్నీ ధారపోశారన్నారు. చివరికి ఆమరణ  నిరాహారదీక్ష కూడా చేశారన్నారు. అందరూ రాదు రాదు అన్న తెలంగాణను తెచ్చి చూపించారని కేటీఆర్ పేర్కొన్నారు. 

ఇక ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్‌ను రికార్డ్ టైంలో నిర్మించారన్నారు. ఇంతకుముందు ఈ దేశం కనీవినీ ఎరుగని ఎనెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజలకోసం చేస్తూ, ఇప్పుడు దేశంలోనే తెలంగాణను ఎన్నో రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు ఇంత చేస్తున్నా కేసీఆర్ ని కొందరు దూషిస్తున్నారని.. అనరాని మాటలంటున్నారని... ఇలాంటి సమయంలో మనోహర్ చిమ్మని లాంటి రచయిత శ్రమించి కేసీఆర్ మీద ఒక మంచి పుస్తకం తీసుకురావడం నిజంగా హర్షణీయమన్నారు. వారికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని... ఈ పుస్తకాన్ని నేను తప్పకుండా చదువుతానని కేటీఆర్ అన్నారు తన అభిప్రాయాన్ని, రివ్యూను ట్వీట్ చేస్తానని కేటీర్ తెలిపారని రచయిన అన్నారు. 

ట్విట్టర్‌లో "ఆస్క్ కేటీఆర్" కార్యక్రమం ద్వారా తనకు మాట ఇచ్చినట్టుగానే ఈరోజు కేటీఆర్ తన పుస్తకాన్ని ఆవిష్కరించడం తన జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుత  జ్ఞాపకంగా ఉండిపోతుందని మనోహర్ చిమ్మని తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. 

మనోహర్ చిమ్మని రాసిన ఈ "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకాన్ని ప్రగతిభవన్‌లో కేటీఆర్ ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి రంజిత్‌రెడ్డిలతోపాటు - స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి బైరి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం కూడా పాల్గొన్నారు.    

click me!