నాగిళ్ళ రామశాస్త్రికి కాళోజీ తత్వనిధి పురస్కారం

By Pratap Reddy Kasula  |  First Published Dec 25, 2021, 11:04 AM IST

నాగిళ్ల రామశాస్త్రికి హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో పోతన కళా పీఠం కాళోజీ తత్వనిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది. బి నరసింగ రావు తనకు కాళోజీతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.


స్థానిక పోతన విజ్ఞాన పీఠం "కాళోజీ తత్వనిధి" పురస్కారం ఈ సంవత్సరానికి నాగిళ్ళ రామశాస్త్రికి హన్మకొండలో  ప్రదానం చేశారు.   కాళోజీ యాదిలో ఈ అవార్డు ప్రతీ సంవత్సరం అందచేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరానికి గాను కాళోజీకి అత్యంత సన్నిహితుడు, కాళోజీ గురించి పూర్తిగా తెలిసిన,  సమాజానికి తెలుపుతున్న నాగిళ్ళ రామశాస్త్రికి అంద చేస్తున్నామని నమిలికొండ బాలకిషన్ చెప్పారు.  ఈ సభకు అధ్యక్షత పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శి నమిలికొండ‌ బాలకిషన్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత నటులు బి. నర్సింగరావు కాళోజీతో తనకు ఉన్న అనుభవాలను వివరిస్తూ ఈ సభలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు.   ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడుతూ కాళోజీ సాహిత్యాన్ని,  ఆ సాహిత్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి రామశాస్త్రి మనకు మంచి గ్రంథాలయంగా ఉపయోగపడతారని కొనియాడారు.  కాళోజీ అవార్డు గ్రహీత నాగిళ్ళ రామశాస్త్రి మాట్లాడుతూ కాళోజీతో కలిసి తాను పాల్గొన్న సభల విశిష్టతను,  కాళోజీ మధనపడిన సందర్భాలను, తెలంగాణ కోసం ఆయన పడిన తపనను వివరిస్తూ ఈ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Latest Videos

ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు కవితలను వరిగొండ కాంతారావు, గండె శ్రీనివాస్, డాక్టర్ పాతూరి రఘురామయ్య, గొట్టె రమేశ్, జూలూరి నాగరాజు చదివి వినిపించారు.  ఎన్ వి ఎన్ చారి రాసిన కాళోజీ ఏకపాత్రాభినయంను కుసుమ సుధాకర్ ప్రదర్శించారు.  పల్లె నాగేశ్వరరావు వాఖ్యాతగా వ్యవహరించిన  ఈ సభలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, పోతన విజ్ఞాన పీఠం కార్యనిర్వాహకులు జె. నాగమణీంద్ర శర్మ,  ప్రముఖ కవులు రచయితలు పాల్గొన్నారు.

సినారె రచనల ముద్రణ, పునర్ముద్రణ

జ్ణానపీఠ  పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి రచనల ముద్రణ, పునర్ముద్రణ కార్యక్రమాన్ని శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు కొనసాగిస్తున్నది.  గతంలో అక్బర్ సలీం అనార్కలి చిత్రానికి వారు రాసిన మాటలు, పాటలు మరియు సుమారు 2,200 పాటలను ఏడు సంపుటాలుగా  ఈ ట్రస్ట్  ప్రచురించింది.  సినారె వివిధ  విశ్వవిద్యాలయాల్లో, ఇతర సంస్థలు నిర్వహించిన సదస్సుల్లో చేసిన ప్రసంగాలు, ప్రత్యేక సంచికలకు, కవుల, రచయితల పుస్తకాలకు రాసిన పీఠికలు, ముందు మాటలను ప్రస్తుతం ఒక సంపుటంగా తీసుకురావాలని ఈ ట్రస్ట్ భావిస్తున్నది.  డా. సినారె చేసిన ప్రసంగాలు, రాసిన పీఠికల ప్రతులను ఆ సందర్భం వివరాలు, ఛాయా చిత్రాలు డా. జుర్రు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి, శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు, కేరాఫ్ తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్డు, అబిడ్స్, హైదరాబాద్ - 500 001 కు పంపగలరని శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు కోరుతున్నది.

click me!