తొలి తెలుగు దళిత కథా వార్షిక: కొలుకలూరి ఇనాక్ ఆత్మీయ భినందన

By Pratap Reddy Kasula  |  First Published Dec 24, 2021, 10:04 AM IST

తొలి తెలుగు దళిత కథా వార్షిక -  2020 "తొండం బొక్కెన" ఈ రోజు (24-12-2021) సాయంత్రం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరణ సందర్భంగా ప్రొ. కొలుకలూరి ఇనాక్ ముందు మాట ఇక్కడ చదవండి.


డా. సిద్దెంకి యాదగిరి, శ్రీ గుడిపల్లి నిరంజన్, శ్రీ తప్పెట ఓదయ్య సంకలనం చేసిన కథానికలకు ముందుమాట వ్రాయమంటే చాలా ఆనందం కలిగింది.

2020లో వివిధ పత్రికలలో ప్రచురితమైన కథానికలు 16, నాలుగు అనుబంధ కథానికలు మొత్తం 20 కథానాయికలతో ‘తొండం బొక్కెన'  పేరిట వివరించడానికి సిద్ధం చేశారు వీళ్ళు.  ‘తొండం బొక్కెన' నీళ్లు బావిలోంచి గుంజితే నేల తల్లి గొంతు తడారుతుంది. గుండె లోతుల్లోంచి కథలు తోడితే తెలుగు తల్లి దాహార్తి తీరుతుంది.  మంచి పేరు పుస్తకానికి పెట్టినందుకు ఉత్సాహం కలిగింది.

Latest Videos

ఈ కథానిక సంకలనంలో చాలా మంది సుప్రసిద్ధ రచయితలు, రచయిత్రులు.  వీళ్లలో కొందరు పెద్ద ఉద్యోగాలు చేస్తున్న విద్యాధికులు.  ఇందులోని రచనలన్నీ దళిత జీవితానికి సంబంధించినవే.  అందుకే దీన్ని ‘దళిత కథావార్షిక 2020’ అన్నారు 22 లో ప్రచురించే కథా సంకలనంలో ఇరవై ఒక్క కథానికలు ఉంటాయని అనిపించింది.

సుప్రసిద్ధ కవయిత్రి రచయిత్రి శ్రీమతి జూపాక సుభద్ర ‘మైక్రో సిటీ అప్పులల్ల మన్నువడ' కథానిక అప్పులు, వాటిని వడ్డీతో తీర్చే తిప్పలు, అక్క చెల్లెల అనుబంధం ఆత్మీయంగా ఉన్నవి.  మంచి కథానిక.  తెలంగాణ మాండలికం పరమ రమణీయంగా ఉంది.

ఆంగ్లంలోకి అనువాదమైన మంచి రచనలతో అంతర్జాతీయ గౌరవమర్యాదలు పొందే రచయిత్రి శ్రీమతి గోగు శ్యామల రాసిన కథ ‘కరోనా సుగ్గి’.  ఈ కష్టకాలంలో వచ్చిన కథ.  ఇది వ్యవసాయం విలువ తెలుసుకోకుండా పట్టణాలలో పైసలు సంపాదిస్తామని వెళ్ళిన వాళ్ళు ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధం కావడం తెలుపుతుంది.  నేలమీది విశ్వాసానికి ఈ కథ ప్రతీక. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన విద్యావేత్త డా. పసునూరి రవీందర్ కథానిక ‘శివన్న మరణం'.  విద్యార్థుల పట్ల ఆసక్తి ఉన్న సూర్యాన్ని ప్రోత్సహించిన శివన్న అననుకూల పరిస్థితుల్లో అసువులు బాయుట దుఃఖాన్ని కలిగిస్తుంది.   దళితులకు విద్యే విముక్తి అన్న సత్యం చెప్పిన కథ ఇది.

కథానిక, నవలా రచయితగా ప్రసిద్ధుడైన భూతం ముత్యాలు కథ 'సావు కూడు’.  రెండు భిన్న ఆదర్శాల మధ్య అద్భుతంగా పండిన కథ.  చచ్చిన వాణ్ణి వల్లకాటిలో దహించిన భర్త, నిరాశ నిస్పృహలతో ఊరు నుంచి వచ్చిన పసివాణ్ణి ఆలింగనం చేసుకున్న భార్య మధ్య జననమరణాల అనుభూతుల్ని అతి రమ్యంగా ముడి వేసిన కథ.  మృతుడికి నేలతల్లి ఒడి చిరంజీవికి కన్నతల్లి ఒడి ప్రాప్తించాయి.  మన్నె ఏలియా ‘ఇదెక్కడి న్యాయం’లో భార్యను ఇల్లిల్లు తిప్పికొట్టే రాజారావును, తిరగబడి ఒక్క గుద్దు గుద్దుమని తమ్ముడు చెబితే, తిరగబడ్డ కాంతక్క విజయం చెప్తుంది ఈ కథ.

‘బైండ్ల చంద్రయ్య బోనాల పండుగ' కథ రాసిన డా. శ్రీనివాస్ గారిది సాహసోపేతమైన రచన.  విద్యావేత్త, రాజనీతి దార్శనికుడు, ఆంగ్లాంధ్ర భాషా నిపుణుడు వ్రాసిన కథ చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది.  బైండ్ల చంద్రయ్యను కరుసుకున్న పటేల్ పెళ్ళాం, సేంద్రయ్యకు దండం పెట్టిన దామోదర్ రెడ్డి కథ చదివి తీరవలసిందే.
కుమారి ఎండ్లూరి మానస కథ ‘మెలీనా’లో  అత్యాధునిక జీవితం చిత్రితమైంది.  తన రంగస్థలం మీద తనదికాని నాటకం చూసింది మెలీనా.  తాగుడు చుట్టూ తిరిగిన మానవసంబంధాల పరిణామాలు ఈ కథలో సహృదయులు చూస్తారు.

ఎండపల్లి భారతి ‘సూరే గ్యానం’ కథలో సూర్య గ్రహణం రోజు అన్నం తినడానికి కలిగిన చిత్రించింది.  ఆధునిక సమాజం అతుకుల్నిచూపించింది.  చరణ్ కార్టూనిస్ట్ కథ ‘బొంబాయి పొట్టేలు’లో దున్న మాంసం దొంగ తనంగా తినవలసి రావటంలోని వైచిత్రి ప్రదర్శితమైంది.  తినటానికి కూడా ధైర్యం లేని సమాజగతి చూపిన మంచి కథ.  కె.పి లక్ష్మీ నరసింహ ‘దోసిలి పట్టు' కథ దుఃఖం కలిగిస్తుంది.  సిక్కెంటికలిచ్చి స్టీల్ పాత్ర తీసుకునే స్త్రీ తాగటానికి నీళ్ళు ఇమ్మంటే ‘దోసిలి పట్టు' అనటం బాధగా ఉంటుంది.   నవీన్ ఔదార్యంలో బిడ్డ పాలు తాగింది.  తల్లి నీళ్లు తాగింది.  చదివి తీరాలి.

కౌలూరు ప్రసాదరావు ‘రెండు గ్లాసులు' కథలో ప్లేట్ కడుగనన్న సత్యానందంని కొట్టిన వెంకటరత్నం. ఇందిరాగాంధీ లేఖతో ఎట్ల రాజీకి వచ్చాడో, వాటేసుకొన్నాడో చూస్తే సంతోషం కలుగుతుంది.  డాక్టర్ తవ్వా వెంకటయ్య కథ  కొండి గాడు అని పిలిచే సంఘం దౌష్ట్యం తెలిపే కథ.  దున్నలను అంకాలమ్మకు బలి ఇచ్చే శవాలను పూడ్చే కాల్చే కొండయ్య శవం ఏమయ్యింది? బిడ్డల చదువు సంస్కారం మీద ఆరని తపన ఉన్న అద్భుత ఆత్మీయ అతిథి కథ ఇది.  కరుణరసార్థ్రంగా ఉంది.

రామ్ పెరుమాండ్ల ‘కన్నీటి కథ' నిజంగా కన్నీరు తెప్పిస్తుంది. పిల్లలు లేని ముత్యాలు పొందిన దుఃఖం అంతా ఇంతా కాదు.   ఏడుస్తూ కడుపు మీద కన్నీరు కారుస్తూ శాశ్వత నిద్రలోకి జారిన దృశ్యం ఏడుపు కలిగిస్తుంది.  తప్పెట ఓదయ్య కథ ‘మల్లక్క కథ' గొప్ప మానవత్వానికి ప్రతీక. ఇరిగి పోనీ, ఇంకి పోని ఆత్మీయతకు ఈ కథ మచ్చుతునక.  అక్క కులం కురుమ. తమ్ముడి కులం మాదిగ.  ఏ జన్మల బంధమో ఈ అనురాగం.  డబ్బులేక  చదువు ఆగిపోయే తమ్ముని డబ్బిచ్చి చదివించింది మల్లక్క.  ఈ డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం ఎవరికీ ఉండదు.  ఉద్యోగం వచ్చిన తమ్ముడు వడ్డీతో రుణం తీరుస్తానంటే అసలు మాత్రమే తీసుకొన్నది అక్క.  మల్లక్క అద్భుత స్త్రీ మూర్తి.

డా. సిద్దెంకి యాదగిరి విద్యావంతుడు, ఆలోచనాపరుడు, సాహిత్య ఆచరణ శీలి వ్రాసిన కథ ‘మూడు గుడిసెల పల్లె'. రాజకీయం పల్లెలను పీడిస్తున్న తీరుతెన్నులకిది దర్పణం. ఎస్సీ సర్పంచ్ కు కేటాయించిన ఎన్నికల్లో లావాదేవీలిచ్చి పుచ్చుకోవడాలు,  అన్నీ నిర్ణయించేది పటేల్ అయితే ఈ ప్రాబ్లం నుంచి పల్లెలు ఎప్పుడు బాగుపడతాయని ప్రశ్నించే సమకాలీన సమస్యను ప్రతిబింబించే కథ.  సహృదయులు ఆవేదనతో ఆలోచిస్తారు.

ఈ దళిత కథావార్షిక 2020 సంకలనం అనుబంధంగా 4 కథానికలు చేర్చారు.  వేముల ఎల్లయ్య కథ వాస్తవ సంఘటనలకు ప్రతి రూపం.  కథ రాస్తే రాంగోపాల్ వర్మ సినిమా తీశాడు.  మారుతి రావు కూతుర్ని సర్కస్ రాజు మమ్మీ డాడీ ఆట ఆడించగా హత్యకు గురైన ఇతివృత్తం ఉన్న కథ.  పేరాలు, తప్ష, కామాలు, పులిస్టాప్ లేని కథ ఇది.  కక్క వంటి మంచి రచన సృజించిన సాహితీమూర్తి కథ.  చిక్కని తెలంగాణ తెలుగు మాండలికం అల్లుకున్న చక్కని కథ.  డా. గడ్డం మోహన్ రావు కథ కులం తప్పు. ఈ కథా రచయిత విద్యావేత్త మంచి ఉద్యోగి మంచి నవలా రచయిత.   పూలు పండ్లు అయిన పిల్లను కాదనీ మాదిగోల పిల్లను మనువాడిన వాడి తండ్రికి వేసినదే ‘కులం తప్పు'.  సంప్రదాయ సజీవతకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది.  ఈ తండ్రికి పుట్టిన కొడుకులు అందరూ కులాంతర వివాహాలు చేసుకోవడం ఒక అభ్యుదయ దృక్పథ ప్రేరకంగా ఉంది.

డా. గంధం విజయలక్ష్మి కథ ‘కొక్కిడి మిడిసుల్లు'.  దీనిలో వదినే మరదుల ముచ్చట్లు,  కుల వృత్తి మాండలికం పొదువుకున్నాయి.  సుప్రసిద్ధ సాహితీ సమాజ రాజకీయ చైతన్యవంతుడు గుడిపల్లి నిరంజన్.  బండ పోయి జీవితాలు చిత్రమై, దేశాలు పోయిన మాదిగల బతుకులు బాధామయ గాథల ఆవిష్కరణ ఈ కథ ‘గుండె నిండా జీలు బండనే’.  జీలుబండ చిద్రమయింది.  పొలాల నోట దుమ్ము పడింది.  వ్యవసాయం ధ్వంసమైంది.  బతుకులు ఆగం అయ్యాయి.  ఎక్కడ పరిష్కారం?  ఎవరు జవాబుదారి?  గుండెలు పిండే కథ సహృదయుల గుండెలనిండా జీలుబండ నిలుస్తుంది.

బాధించే మంచి కథతో ఆరంభమై వేధించే వేదం ఆత్మకథ తో దళిత కథా వార్షిక 2020 ముగుస్తుంది.  ఈ కథానికలన్నీ దళితులు వ్రాసినవే.  అన్నింటా దళిత జీవితం నిండి వుంది.  దళితులు దళిత జీవితం రాస్తే అది హృదయంగమంగా ఉంటుందనడానికి ఇందులోని ఈ కథలే సాక్ష్యం.  ఈ కథాంశాలను గ్రహించి దళితేతరులు ఈ కథలు వ్రాస్తే అవి ఇంతగా హృదయాన్ని పట్టిపీడిస్తాయని చెప్పటానికి సాహసం కావాలి.  ఈ దళిత రచయితలే దళితేతర ఇతివృత్తాలు స్వీకరించి, కథానిక సృష్టి చేసిన దళిత వేదన అద్భుతంగా ప్రపంచితం అవుతుంది.  అందుకే దళిత సాహిత్యం మానవ విముక్తి పోరాటంలో ప్రధాన భూమిక పోషిస్తుందని భారతీయ సాహిత్యం భావిస్తోంది.  ఇంత మంచి కథానికలని వ్రాసిన రచయితలను, రచయిత్రులను అభినందిస్తున్నాను.

ఈ కథానికల్ని సంకలనం చేసి సాహితీలోకానికి అందిస్తున్న దళిత కథావార్షిక 2020 సంపాదకులను అభినందిస్తున్నాను. ఈ కథ చదివి ఆనందించే సహృదయ పాఠకులకు స్వాగతం పలుకుతున్నాను. శుభాకాంక్షలతో…

click me!