డా. గాదె వెంకటేశ్ కథ : అర్బన్ అన్ టచబులిటి

By Pratap Reddy Kasula  |  First Published Dec 23, 2021, 1:14 PM IST

ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగాలు చేస్తున్నప్పటికీ ఏ విధంగా కుల వివక్ష  వెంటాడుతుందో  డా. గాదె వెంకటేశ్ రాసిన "అర్బన్ అన్ టచబులిటీ" కథలో చదవండి.


హబ్బిగూడ రోడ్ నెం. 5. మా ముత్తాత నరకాసురుని వర్ధంతి అదే దీపావళి.  ఆ రోజే మొదటి తెలంగాణ స్టేట్ స్వేరోస్ నెట్ వర్క్ మీటింగ్ కి పోయి బండి మీద వస్తున్న. ఉదయ్ అన్న ఫోన్ చేసిండు. బండి ఒక రోకుకు ఆపి ఫోన్ ఎత్తిన. "తమ్మి ఎక్కడ ఉన్నవ్?. మీటింగ్ అయిపోయిందా? కలుద్దామా?" అని అడిగిండు.  "ఓకే అన్న. మీటింగ్ అయిపోయింది. కలుద్దాం. చాయ్ కేఫ్ దగ్గర నిలబడ్తరాండ్రి" అని ఫోన్ పెట్టేసిన. మళ్ళా బైక్ స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఎక్కువ పెంచిన నిమ్మళంగా వచ్చే బండ్లు ఎనుకబడుతున్నాయ్ నా ఆలోచనల్లా.

అంబేద్కర్ పుణ్యాన ఎం.టెక్, ఎంబిఎ సద్వి, పిహెచ్ డి చేస్తున్న.  ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు చేస్తున్న.  నాకు పెళ్లయి 4 యేండ్లు అయ్యింది. మా భార్య బిఇ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ఆఫీసర్ గా కొలువు చేస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు.  నేను సదువుకొని కొలువు చేయడానికి మా అన్న త్యాగం ఉన్నట్లుగానే, తన ఎదుగుదలకు కూడా తన మామ ఆనందం తోడ్పాటు ఎంతో ఉంది.  నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ (SWRS)లో, తను ఎపి రెసిడెన్సియల్ (APRS) హాస్టల్స్లో చదువుకున్నాం. నేనేమో మాలాగా పిల్లలను ఎపిఆర్ఎస్ లోనే, నవోదయలలోనే సద్విపిస్తే పిల్లలు క్రమ శిక్షణగా, అన్నింటికి తట్టుకునే తత్వం వస్తదని వాదిస్తే, తను మాత్రం ఇంగ్లీషు రాకనే మనం వెనుక బడ్డాం కదా! మన పిల్లలను మన కంటే మంచి సదువు, ఇంగ్లీషు అందించాలి అని పట్టు బట్టింది. నాక్కూడా తనే కరెక్ట్ అనిపించింది. అందుకే పిల్లలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్    నాచారంలో జేర్పించినం.  పిల్లల సదువుల కోసమే హబ్సిగూడలో మా తాహతుకు మించినా కూడా హౌసింగ్ లోన్ తో ఫ్లాట్ తీసుకున్నాం. తగులు దొరికిందని పడ్డనుకొన్నట్టు.  సమాజం నుండి ఇంత తీసుకున్నాం కనుక మన చేతనయింది సమాజానికి చేద్దాం అని ఫీల్ అవుతుంటాను.

Latest Videos

 డా॥ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ IPS  SWRES సెక్రెటరీ అయ్యినంక విద్యార్థుల యొక్క ప్రతిభను మెరుగు పరచడానికి ఎన్నో విధాలుగా, తన వృత్తినే ఫణంగా పెట్టి SWRES విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తుండు. విద్య అందడమే కష్టమయిన ఈ రోజుల్లో దళిత విద్యార్థులందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తుండు కార్పొరేట్ స్థాయిలో.    ఆ స్వేరోస్ నెట్వర్క్ ద్వారా "గీవ్ బ్యాక్ టూ సొసైటీ" కాన్సెప్ట్ తో దళిత విద్యార్థులందరినీ ఏకం చేస్తుండు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినంకా, తెలంగాణాలో జరిగిన గీ తొలుత మీటింగ్ కు (మల్లాపూర్) పొయ్యొస్తుంటే ఉదయ్ అన్న ఫోన్ చేసిండు. అన్న కూడా ఆ మీటింగ్ కు  వచ్చేది ఉండే. ఏదో ఆపతి పని పడి రాలేక పోయిండు.

కేఫ్ దగ్గర బండి ఆపి స్టాండ్ ఏసిన.  ఇంతల్నే అన్న వొచ్చిండు. చాయ్ చెప్పినం. "తమ్మి మీటింగ్ ఎట్లా అయ్యింది? సర్ ఏమ్ మాట్లాడిండు? ఇంకా ఏంది సంగతులు" అని అడిగిండు నా మొకంలోకి సూస్తు.

"అన్న ప్రవీణ్ సార్ డైనమిక్ లీడర్ షిప్ ఏదో జర్గబోతుంది అనిపిస్తుంది. మనం ఎన్నో ఉద్యమాలను చూశాం. భాగస్వాములం అయ్యాం. కాని సార్ డా॥ బిఆర్ అంబేద్కర్, ఎస్ఆర్.శంకరన్ ఐఏఎస్ బాటలో మన జాతికి ఒక కొత్త పంథాలో, 10 కమాండ్స్ ఇచ్చి ఒక తరం ముందు చూపుతో సాగుతుండు.   మన దళిత పిల్లల ప్రతిభను ప్రపంచ వ్యాప్తం చేస్తుండు.  ఇప్పుడు SWRES పిల్లలందరు ఇంగ్లీష్ మాట్లాడుతుండ్రు.  ఒక తరం ఇంగ్లీష్ ముందుకు పోయింది.  ఇదో గొప్ప మలుపు.  రియల్లీ హి హీస్ ఏ డైనమిక్ లీడర్ అన్న.  అంతేకాదు అన్న దళిత, హరిజన, ఎస్సీ లాంటి పదాలకు బదులుగా ఇక నుండి "స్వరోస్"గా పిలువాలి అని, రాజకీయ అధికారం ఎంత ముఖ్యమో జ్ఞానవంతులు కావడం కూడా అంతే ముఖ్యం అని, ఆ దిశగా SWRES  ను క్షేత్రాలుగా చేసుకొని జ్ఞాన సేద్యం చేయాలని పిలుపునిచ్చిండు. అంబేద్కర్ కావాలనుకున్నటువంటి ఉద్యోగి డా||ప్రవీణ్ సర్ అన్న" అని మీటింగ్ కు పోయిన జోష్ తో నేను సిన్నపాటి లెక్చరే ఇచ్చిన టీ గ్లాస్ కిందపెడుతూ "అవునా తమ్మి అయితే చాలా మిస్ అయినా, ఇంకోతాప తప్పక రావాలే, వస్తా". అయితమాయే గాని మా బ్యాచ్ వాళ్లు ఎవరన్నా వచ్చిండ్రా? అని ఆత్రంగా అడ్గిండు.

మేడి వెంకట్ నర్సన్న వచ్చిండు. మిమ్ముల్ని అడ్గిండు. మీ నంబర్ తీస్కుండు. "ఇగో అన్న సెల్ నెంబరు మీకియ్యమని రాసిచ్చిండు". అని పేపరిచ్చిన, "వెంకట్ నర్సన్న బాగుండా..? వెంకట్ నర్సన్న ఆరోగ్యం అంతంత మాత్రమే కానీ ఏ మీటింగ్ వదలడు కదా..? మనసు ఊరుకోదు కదా.  అలాంటి ఆశిర్కంలేని, నికార్సయిన మనుషులు ఈ కాలంలో చాలా అరుదు. ఈ సారి ఎట్లయిన కలవాలే తమ్మి వెంకటనర్సయ్యను"-  నేనిచ్చిన సెల్ నెంబర్ ఫీడ్ చేసుకుంటూ. 

“ఏదేమైనా ఫూలే-అంబేద్కర్ ఇచ్చిన ఆత్మగౌరవ ఆయుధంతో మనం ఈ స్థితిలోనన్న ఉన్నాం తమ్మి. నీకు ఈ రోడ్డు నెం. 5 యాదికుందా?" అడ్గిండు ఆ బజారులోకి చూస్తూ.

అన్న ఎందుకు గుర్తులేదే!  ఈడనే నేను గిప్పుడు ఇల్లు కొన్న అపార్ట్మెంట్ జాగలనే ఒక ఆఫీస్ లో, ఆఫీస్ బాయ్ గా పని చేసిన.  నా 9వ తరగతి ఎండాకాలం సెలవుల్లో కిష్టయ్య మామ నన్ను, శేఖర్ ను, ముత్తిలింగంను జేర్పించిండు గదనే ఎట్లా మర్సిపోతా.   నా హైదరాబాద్ జీవితాన్ని ఇక్కడే ఒక ఆఫీస్ బాయ్ గా సురువు జేసిన గదనే" అన్నాను.   బేరర్ ఇచ్చిన చిల్లర తీసుకుంటూ.

"యాదృశ్చికమైన గొప్పవిషయమేమంటే తమ్మి ఎక్కడ అయితే నువ్వు పని మనిషిగా చేసినవో అక్కడే ఇల్లు కొనడం.  చదువు కోవడం,  జ్ఞానవంతులు కావడం వల్ల జర్గిన మిరాకిల్ ఇది.   ముంగల ముంగల నీ కుటుంబంలో ముందు తరానికి నువ్వు పడ్డ అవమానాలు, బాధలు పోయినట్టే తమ్మి, గిదే గద తమ్మి పూలే - అంబేద్కర్ కల అని ఊపిరి పీల్చుకుంటా నా మొకంలోకి సూసిండు - తమ్ముడి ఉన్నత స్థితి తల్సుకొని కించిత్ గర్వంతో.

ఆ... గదేం లేదన్న where ever you go our caste will follow you బాధలో కూడా అసహనంతో ఆవేశంగా అన్నాను.  అన్న మొకం ఒక్కసారిగా డీలా పడ్డది.  నిశబ్దం అవరించింది.  ఏడికి పోయిన నీకు వేయబడ్డ ఎస్సీ/ఎస్టీ అంటరానొడిగా ముద్ర అడుగడుగున తరాల తరబడి వెంబడించడం ఈ బ్రహ్మనైజ్డ్, మనువు సమాజంలో షరా మామూలే కదా" అన్నాను మళ్లీ కొంత నిశబ్దం తర్వాత.

నేను మాట్లాడుతున్నప్పుడు నా మొఖంలో ఇంకిపోయిన రక్తాన్ని సూసి, నాకు ఏదో కనిపించని గాయమయ్యిందని పసిగట్టినట్టుండు ఉదయ్ అన్న. తను కొంత ఇబ్బంది పడ్డా సుత్లయించుకొని ఈ మెకానికల్ లైఫ్ లో ఇంత దగ్గరున్న మనసు విప్పి బాధలు, సంతోషాలు పంచుకునే తీరువాటే లేకుండా పోతుండే తమ్మి, పిల్లలు బాగున్నారా? కొత్త ఇల్లు ఎట్లా ఉంది.  ఈ వాతావరణానికి అలవాటు పడ్డారా? అని నన్ను సమ్లాయిస్తూ నా గాయానికి కారణం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉదయన్న దగ్గరకి తీసుకొని భుజం మీద చెయ్యేసిండు. నేను మౌనంగా ఉండిపోయిన.

తమ్మి మనసుల బాధ సెప్పుకుంటే తగ్గుతది, ఆనందం ఉతారైతది.  ఈ అవమానాలు కొత్తేం కాదు గద మనకు, సెప్పు తమ్మి ఏం జర్గిందో అన్నడు జెర్రంత నా మీద ప్రేమతో, అధికారంతో.  నా ప్రమేయం లేకుండానే నా గొంతు మనసును ఆర బెట్టడానికి సెప్పుడు ఘురూ చేసింది.

ఆ రోజు సెప్టెంబర్ 19,  సకల జనుల సర్వే రోజు. ఇల్లు కొంటందుకు బయానా ఇచ్చిన రెండు నెలల నుండి సిన్న సితకా కరెంటు, ఫర్నీచర్, కలర్స్ లాంటి మార్పులు చేర్పుల పనులు చేయిస్తున్నాం.  పనిజేసేటోలకు పని అప్పజెప్పి పొద్దుగూకేటాలకు వచ్చి సూసుకుంటుంటిమి.  సర్వేకు మీ మరదలుకి డ్యూటీ పడింది.  నేను ఊర్లో సర్వేలో పేరు నమోదు చేయిస్తనంటే  "వద్దు పిల్లలకు అవసరమైతది.  మీ ఓటరు కార్డు కూడా హైదరాబాద్లో తీయలేదు.  ఎందుకో మీరు అన్ని ఊర్లోనే ఉండాలనుకుంటారు.  అందరూ పట్నాలకు వస్తుంటే మీరు ఊరు ఊరు అని పడి సస్తరు.  గిదన్న ఇక్కడనే ఉండనిద్దాం" అని హైదరాబాద్లోనే నమోదు చేయించాలని పేలిపిచ్చింది. మెడకు పడ్డ పాము కరువకమానదన్నట్టు ప్లాట్ దగ్గరనే ఉన్నా.  సర్వే చేసేటోళ్లు ఏ టైంకి వస్తారో తెల్వదు కనుక పొద్దున్నుంచి పొద్దుగూకే దాకా పడిగాపులు కాస్తున్నాను.  నాలాగే ఆ అపార్ట్మెంట్ 101, 105, 302 ఫ్లాట్స్ వాళ్లు కూడా బయటనే ఎదురు చూస్తుండ్రు.  మా నడుమ మాటలు కల్సినయ్, పరిచయాలు ఏర్పడ్డాయి.  తొలుత పక్కాళ్లతో,  ఆ మాటల్లో 105 ఫ్లాట్ యజమాని  రెడ్డిది  మా పక్క ఊరే అని తెల్సింది.  ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ అని మన పక్క ఊరు వలిగొండే అని తెలిసింది.  302 రామచార్యులు, ఆయన భార్య బ్యాంకు కొలువులు.   101 డా॥ శాస్త్రి గారు రిటైర్ అయ్యారని పరిచయం చేసుకున్నాడు.

తాను మన ఊర్లో వారి కొందరి పేర్లు చెప్పి వాళ్లు నా ఫ్రెండ్స్ మీకు తెల్సా? అని అడిగిండు.  నాకు తెల్సు అన్నాను.  "వాళ్లంతా యూనివర్సిటీలో నాకు ఫ్రెండ్స్" అని చెప్పాడు.  చాలా విషయాలు సర్వేపై, ఇతరత్ర చర్చకొచ్చినయ్.  అందరం చాలా తొందరగా కల్సిపోయాం.  ఆత్మీయంగా మాట్లాడుకున్నాం.  ఒక మంచి చదువుకున్నాయన, ఇద్దరు ఉద్యోగస్తులు నైబర్స్ అయ్యారని వాళ్లు సంతోషించిండ్రు. సమయం గం.6.30 కావొస్తుంది.  సర్వే వాళ్లు వచ్చిండ్రు.  బహుష మాదే ఆకర్ది అయ్యింటది.  5వ ఫ్లోర్ నుండి రెండు గుంపులుగా విడిపోయి సర్వే సురువు సేసిండ్రు. అందరూ వాళ్ల వాళ్ల ప్లాట్స్ లోకి వెళ్ళిండ్రు. గం. 7.30కి సెకెండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిండ్రు. ఫ్లాట్ 302లో సర్వే చేసిన టీమ్ మా ఫ్లాట్ కి,  మరొక టీమ్ 103 ఫ్లాట్లోకి పోయ్యిండ్రు, చారి సార్ కూడా ఆ టీమ్ తో పాటే తాను మా ప్లాట్ కి వచ్చాడు.

ఆ టీమ్ కి నేను మా కుటుంబ వివరాలు చెబుతుంటే వారికి సార్ సహకరిస్తున్నాడు.  నేను దాదాపు అన్ని నోటికి సెబుతున్నాను.  కులం కాడికొచ్చేసరికి నేను నా నోట సెప్పకుండా తటపటాయించి క్యాస్ట్ సర్టిఫికెట్ వాళ్ల ముందర పెట్టిన రామాచార్యులు వినకూడదని.  కాని అలా పెట్టడం చూసి తాను సటుక్కున పట్టేసుకొని, "37 రాసుకోండి" అన్నాడు. 'అమ్మా' దొరికిపోయానురా అనుకొన్న మనసులో.  సర్వే టీమ్ వివరాలు నమోదు చేయడం అయిపోయి, వెళ్లి పోయిండ్రు.

రామాచార్యులు గారి కండ్లల్లో ఏదో కనుగొన్న ఆనందం కనిపిస్తుంది.  నాకు మాత్రం మనసులో ఏదో తప్పు జర్గిపోయిందన్న అపరాధ భావం వెంటాడుతుంది. ఎందుకో, కులం గురించి నోరు జారొద్దని దయామణి ఫ్లాట్ కొన్నప్పటి నుంచి జాగూరత చేస్తుంది.  వాళ్ల కొలీగ్స్ అనుభవాలను ఎప్పుడూ ముందలేసేది.  కాని రామాచార్యులు నన్ను సొంతమనిషిలా భావించి ఏవేవో చెబుతుండు.  ఆ మాటలు నన్ను కట్టిపడేసినయ్. రాండి సార్ మా ఫ్లాట్ కి పోయి మాట్లాడుకుందాం. మీతో నేను సాన మాట్లాడాలి అని వాళ్ళ ఫ్లాట్ కి తీసుకుపోయిండు.  నాకు గత్యంతరం లేదు, వెళ్లాను. ఇంట్లోకి వెళ్లగానే తలుపులు వేసిండు.  ఫ్రిజ్ లోంచి సల్లని నీళ్ల బాటిల్ తీసి నాకిస్తూ 'సార్ మేము ఎస్సీనే, మాలోల్లం, మాది గుంటూరు' అండు చారి సార్ ఆత్రం ఆగబట్టుకోలేక.  సల్లటి నీళ్లు గొంతులోకి దిగుతున్నయ్, ప్రాణం సల్లబడింది.  నా అనుభూతికి మాటలు రావడంలేదు.  ఇంతకుముందు చారి సార్ కండ్లలో చూసిన ఆనందం ఇప్పుడు నామనసులోకి జొచ్చింది. ఎడారిలో మంచి నీళ్లు దొరికినట్టయ్యింది.  ఏదో వెలితి తీరింది.  సర్ మనవాళ్లు ఈ అపార్ట్మెంట్లో ఎవ్వరు లేరనే బాధ ఉండే, గిప్పుడు అది తీరింది.  చాలా సంతోషంగా ఉంది అన్నడు చారి సార్.  ఓనర్స్ నేమ్ బోర్డు చూసి మాకు అదే ఫీలింగ్ కల్గింది.  గిప్పుడు ఒక తోడు ఉందన్న భరోసా వొచ్చింది.  దయామణి కూడా మనోళ్లు ఎవ్వరు లేరు, ఎట్లా నెగలాలో అని భయపడుతూనే ఉండేది.

తాను సంతోషిస్తదని ఎమ్మటే ఫోన్ చేసి విషయం చెప్పిన.  తాను సర్వే కొత్త హుషారుతో చేసి ఫ్లాట్ కాడికి జల్ది వొచ్చింది.  సార్ వాళ్ల మేడమ్ కూడా ఆఫీస్ నుండి వొచ్చింది.  అందరం మాటల్లోకి దిగినం.

ఆనందం వచ్చిన, బాధొచ్చినా అన్నింటికి తొందరగా రియాక్ట్ అయ్యే దయామణి మాటలు షురూ జేసింది. "సార్ ఇల్లు కొననైతే కొన్నాం కానీ ఓనర్స్ నేమ్ బోర్డులోని పేర్లు సూసినంకా భయమేసింది.  మొత్తం 15 మంది ఓనర్స్ లో ఎస్సీలం మేము ఒక్కలమే.  ఎట్లా నెగుల్తామోనని అదురుజొచ్చింది.  అయినా మీ పేరు కూడా రామాచార్యులు అని రాసుంది కదా సార్" అని ఆగబట్టుకోలేక అడిగేసింది దయ.

రామాచార్యులు గారు ఒక్కసారి నవ్వి తన పేరులోని బ్యాక్ గ్రౌండ్ చెప్పిండు.  చిన్నప్పుడు ఒక సారు నన్ను చాలా ఇష్టపడేటోడు.  కాని ఇతర కులాల పిల్లలకు నన్ను ముట్టుకోవడం ఇష్టం ఉండకపోతుండే, చిన్న కులపోల్లమని.  అందుకే ఆ రోజుల్లోనే సార్ నా పేరు రామయ్యను, రామాచార్యులుగా మార్చిండు.  అప్పుడు పేరు మార్సినంక ఆ సార్ చెప్పిండు. " ఈ పేరుతో నీ జీవితంలో నీకు చాలా మేలు కల్గుతది. సమాజంలో నీకిచ్చే గౌరవం పెరుగుతది” అన్నాడు. ఇప్పుడు అదే జర్గుతుంది. నన్ను ఎవ్వరైనా బ్రాహ్మనుడే అనుకుంటారు.  నన్ను ఇతర కులస్తులు ఎవ్వరు ఎస్సీ అనుకోకుండా ఉండడానికి నా పేరు మొదటి గార్డు, ఇక మా మేడమ్ రంగు రెండవ గార్డు.

ఆఫీస్ లో ఎట్లయినా తెలుస్తది.  కాని బయట ఎక్కడ కులం జెప్పం" అన్నడు చారి సార్.  అంతగా తప్పనిసరి పరిస్థితి అయితే "నాన్ వెజిటేరియన్స్ మి" అని చెబుతాం.  కాని మనోళ్లు ఎక్కడన్న తారనపడితే చాలా సంతోషంగా ఉంటది.  మీరు కూడా ఎక్కడ చెప్పకండి, బయట పడకండి.  ఎవ్వరన్న అడిగినా  నాన్ వెజిటేరియన్స్ అని చెప్పండి" అని ముందు జాగ్రత్త చేసింది వాళ్ల మేడమ్.

 నేను చాలా సీరియస్ గా వాళ్ల ముచ్చట్లు వింటున్న మౌనంగా,  మాటల మధ్యలో దయామణి ఇంట్లో పని చేయడానికి ఒక మనిషి (పని మనిషి అనడం ఇష్టం లేదు) కావాలి మేడమ్ అని అడ్గింది.   మేడమ్ "మా ఇంట్లో చేసేటామే బాగా చేస్తుంది.  తనను మాట్లాడుతలే.  మా ఇంట్లో 8 సంవత్సరాల నుండి పని చేస్తుంది.  చాలా బాగా రీతిగా చేస్తది.  నెలకెంత కూడా నేను మాట్లాడుతలే.  మనం చెబితే కాదనది" అన్నది మేడమ్.  అంతలోనే "సార్ ఏ మాత్రం మనం ఎస్సీ అని తెల్సిన కష్టం.  ఆమెకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏ కోశాన బయట పడకూడదు. ఆమె ఎమిటోళ్లని అడిగినా 'నాన్ వెజిటేరియన్స్' అని చెప్పండి"  అని హితబోద చేసిండ్రు ఇద్దరు.  నాకు ఓపిక నశించింది.  అది మీ మరదలు గ్రహించింది.

నేను అదే చెబుతుంటాను మేడమ్.  మా ఆయనే మన కులం ఎందుకు చెప్పకూడదు. చెప్పకుండా ఎన్ని రోజులు దాస్తం అంటాడు.  మీరైనా కొద్దిగా చెప్పండి మేడమ్ అని వాళ్లకి కంప్లైంట్ దోరణిలో నవ్వుతూనే అంది.  నేను సప్పుడుసెయ్యలే.  అంతటితో ఆగక "మనం వచ్చిందే పిల్లల కోసం కదా.  వాళ్లకు ఇబ్బందులు అయితే మా పర్పస్ సెర్వ్ కాదు కదా.  మన ఆత్మ గౌరవం ముఖ్యమే? వాళ్ల భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా.  అయినా మాంసం తింటున్నామని బొక్కలు మెడకు వేసుకుంటామా మీరైనా చెప్పండి మేడమ్.  తన పిల్లల భవిష్యత్తు కోసం కులం దాచడంలో తప్పులేదు అన్నట్టు వాళ్లకు ఫిర్యాదు చేసింది.

వాళ్లిద్దరూ ఒక సారి నా వైపు చూసి "వెంకట్ మనం ఎంత సోషలైజ్ అయినా సమాజంలో ఇంకా కులం ఉంది.  మీరింత డబ్బు సంపాదించినా, గొప్పొళ్లమయినా సమాజంలో నీ కులంను బట్టే నీకిచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది.  నువ్వు దయామణి వర్షన్ కూడా అర్థం చేసుకోవాలి కదా.  తను, తన గురించి ఏం ఆలోచించడం లేదు.  తన పిల్లలకు సమాజంలో అవమానాలకు గురి కాకుండా ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాలని అనుకుంటుంది.  దాని కోసం కులాన్ని దాస్తుంది.  మాకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది చెప్తా వినండి అంది.

మాది ఆంధ్రా బ్యాంకు, గనౌఫౌండ్రీ బ్రాంచ్.  మా బ్రాంచ్ లో (వాళ్ల ఫ్యామిలీలో) ఎవరికన్న రక్తం కావాల్సి వస్తే నోటీస్ బోర్డులో "రక్తం కావాలని నోటీస్ పెడ్తరు.  రక్తం ఇవ్వాలనుకునే వాళ్లు వారి పేర్లను, సెల్ నెంబర్ తో సహా అక్కడ పెట్టే రిజిస్టర్లో రాయాలి.  చాలా రోజుల నుండి అది జరుగుతుంది.  ఒకటి రెండు సార్లు నేను కూడా రక్తం ఇద్దాం అని పేరిచ్చిన నాదే మొదటి పేరు పిలుస్తరేమో అని రోజు చూస్తుండేదాన్ని.  నా తర్వాత చాలా మంది పేర్లు ఇచ్చిండ్రు.  నాకు కాల్ రాలేదు. వారం రోజుల తర్వాత నోటీస్ బోర్డులో "శర్మగారు రక్తం ఇచ్చినందుకు ఒక కృతజ్ఞత నోటీస్ ఉంది బోర్డులో.  అరె నా కంటే వెనుకకు పేరు ఇచ్చినాయిన రక్తం తీసుకుండ్రు, నాది తీసుకోలేదు అనిపించింది.  కాని మరి ఎందుకు తీసుకోలేదో? ఏమో నాకర్ధం కాలేదు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు.  తర్వాత కూడా ఇంకొకసారి అలానే చాలా అర్జంటుగా O+ve రక్తం కావాలని నోటీసు పెట్టిండ్రు.  కాని మొదటి పేరు ఇచ్చిన నా కంటే తర్వాత ఇచ్చిన శాస్త్రిగారిదే తీసుకుండ్రు. అతను నా తర్వాత 4 రోజులకు పేరు ఇచ్చిండు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది.  ఆయన మా డిపార్ట్మెంటే.  ఆయన సెలవులో ఉండే.  నాలాంటి అనుభవమే ఒకలిద్దరికి ఎదురయింది మా ఆఫీసులో. వారిలో ఇతర బిసి కులాల వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకు నా రక్తం తీసుకోలేదో ఎట్లయినా తెలుసుకోవాలనిపించింది.  పర్సనల్ డిపార్ట్మెంట్లో  తెల్సిన నాాాతో సన్నిహితంగా  ఉండే కమ్మ మిత్రురాలిని అడిగిన.  ఆమె చాలా భయంకరమైన విషయం చెప్పింది భయపడుతు.  మేడమ్ బ్రాహ్మన్స్ కి లేదా అగ్రకులాల వారికి రక్తం కావాల్సి వచ్చినప్పుడు, అదే కులం వాళ్ల (సేమ్ కమ్యూనిటి) రక్తం దొరికేంత వరకు ఆగుతరు.  ఇగ ప్రత్యామ్నాయం
లేదన్నప్పుడు మాత్రమే చూసి చూసి వేరే వాళ్లది తీసుకుంటరు అని చెప్పింది.  నేను చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పకండి.  మీరు నాకు చాలా సాయం చేసిండ్రని మీకు అబద్దం చెప్పలేక  నిజం చెప్పిన అని మాట తీసుకుంది. వెంకటేష్ అట్లా కులం వివక్ష పైకి కనపడకుండా ఉంటది. అది మోడ్రన్ అన్ టచ్ బులిటి .    కాని పర్యవసనం వెంటాడుతుంది.  అది రూపాంతరం చెందిన కరుడుగట్టిన కులం పాటింపు.  ఆ రోజు నుంచి నా మనసు విరిగిపోయింది.  మనం ఎంత ఆత్మగౌరవం గురించి మాట్లాడిన అనుభవం మరొక రకంగా ఉంటుంది.  వాళ్ల మాటల్లో మంచితనం, చేతల్లో కులతత్వంలా.  అని కళ్ల నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది మేడమ్.  నా దిమ్మె దిరిగిపోయింది.

మీరు మారాలి.  మీ సిద్ధాంతాలు విలువలు, ఆత్మగౌరవం చెప్పడంలో తప్పులేదు.  కాని ఇక్కడ మన పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టి మాట్లాడడం అంటేనే మాకు అభ్యంతరం.  చదువు కొని ఉద్యోగం చేస్తున్న ఒక ఎస్సీల 50 ఏండ్ల అనుభవం మాది.  మీరు వాస్తవాన్ని అర్ధం చేసుకోవాలి.  పెద్ద దానిగా చెప్తున్న అని ఆఖరి అస్త్రాన్ని సందించారు మేడమ్.

నాకు గాయాలు లేక కాదు.  ఈ స్థితిలో మన గాయాలు వాళ్లను సమాధాన పర్చలేవని అర్థం అయ్యింది.  కాబట్టి అస్థిత్వ సామాజిక ఉద్యమాల ఉద్దేశాలు ఎల్లబెట్టాలన్న యావ సచ్చిపోయింది గా గాయాల ముచ్చట్లు ఇన్నంక.  దయామణికి నేను ఎక్కడ హర్ట్ అవుతానోనన్న భావన ఒక వైపు ఉన్నా,  ఇన్ని రోజులు తనలో ఉన్న ప్రశ్నలను సందించగలిగానన్న తృప్తి కనిపించింది తన మొఖంలో.

అలా వాళ్ల అనుభవాలు, భరిస్తున్న  అవమానాలు , తెలివిగా వాళ్లు ఒక 'నాన్ వెజిటేరియన్స్ - బట్ నాట్ టెల్ క్యాస్ట్'   అనే  సూత్రం మీద జీవితాన్ని సాగిస్తున్న, సాగించాల్సిన తేరు తెన్నులను మాట్లాడుకుంటున్నారు.   నేను నిశబ్దంగా వింటున్నాను.  తరాల గాయాల అనుభవాల ఆత్మగౌరవ పోరాటాల మధ్య చౌరస్తాలా.

నా ఐడియాలజీని గురించి పెళ్లికి ముందే చెప్పిన, నా విలువలు,  నమ్మకాలు లేదా నిర్ణయాలు తనకు ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కాని ఇంతకుముందు ఎప్పుడు తాను ఈ కులం దాచటం గురించి చర్చ చేయలేదు.  చేసినా సీరియస్ గా కాదు. ఇప్పుడే ఎందుకు సీరియస్ గా చేసిందో నేను అర్థం చేసుకోగలను.  అది తల్లి మనసు.  పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటం మాత్రమే అని అర్థమైంది.  కులం తెలిస్తే పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులే కండ్ల ముందు తచ్చాడుతున్నాయి తనకు.  అది ఇప్పుడు స్వయంగా తను ఆఫీసులో అనుభవిస్తోంది.  అది తానొక్కదాని ఉద్దేశ్యం మాత్రమే కాదు.  ఎందరో మధ్య తరగతి వాళ్లు ఎదగడం కోసం లేదా అవమానాల నుంచి గట్టెక్కడానికి గత్యంతరం లేక బ్రాహ్మనైజ్ డ్అవుతున్న వాళ్ల అందరి సందిగ్ధ పరిస్థితి అని అర్థమైంది.

"అత్మగౌరవం, విలువలు అని పట్టుకు తిరిగే ఏ వ్యక్తి తన కుటుంబాన్ని సంతృప్తి పరచలేడని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థం అయ్యింది" నాకు.

నేను ఇంకా వాదించాలనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్లు బాధితులే, నేను బాధితుడినే. వాళ్ల అనుభవాళ్లను కాదనడానికి లేదు. నా స్పృహను ఆధిపత్య కులాల కుట్రని ఎదుర్కొవాలనే ప్రయత్నాన్ని కాదనడానికి లేదు.  ఇవి నాణేనికి రెండు ముఖాలు బొమ్మ బొరుసు లాంటివి.  ఎటు వైపు ఖరాబైనా ఆ నాణెం చెల్లదు.  అందుకే చివరకు నేను ఒక్కటే మాట అన్నాను.  మనం ఇలా ఎంత దూరం పరిగెడదాం ఎదురు తిరుగలేమా? ఎదురు తిరుగుతున్న వాళ్లను కనీసం అనుసరించలేమా??   పూలే - అంబేద్కర్ కలల సాకారం కోసం,  కులాల అంతరాలు లేని సమాజం కోసం ఇంకా ఎన్ని తరాలు ప్రమిదలు కావాలి? చూద్దాం? ఎవ్వరి ప్రశ్నలకు సమాధానం లేని చర్చలు.

హాల్ అంతా కొద్ది సేపు నిశబ్దం అవరించింది మా మధ్య. సమయం రాత్రి 11.00 అయ్యింది. సరస్వతి మేడమ్ ఆ వాతావరణాన్ని ఛేదించడానికి  “చాలా రాత్రవుతుంది.  అందరం పొద్దుగాళ్ల లేసి పోవాల్నాయె. మీరు ఇక్కడే తిని పండుకోండ్రి.  పిల్లలు కూడా అమ్మ దగ్గరికి పోయిండ్రు అన్నారు కదా"  అంది. "లేదండి మెడమ్ పోతాం అన్నాం" ఇద్దరం ఒకేసారి.  "లేదు చాలా రాత్రయ్యింది" వద్దు అన్నాడు చారీసార్.  సరే మేడమ్ బెడ్ షీట్స్ ఇవ్వండి మా ఫ్లాట్లో పడుకుంటామని బువ్వ తిని, బెడ్ షీట్స్ తీసుకొని కింద మా ఫ్లాట్ లో పడుకున్నాం.  సీకటిమొకాన సూర్యుడు రాకముందే లేసి వెళ్లిపోయాం నిన్న రాత్రి ఫలితం తేలని చర్చల్లా!

దసరా ముందు ఫ్లాట్లోకి దిగినం. పని చేయడానికి వాచ్మెన్ భార్య లీలను (సరస్వతి మెడమ్ చెప్పిన ఆమెను) కుదుర్చుకున్నాం.  మాకు డ్రైవర్ కావాలని దేవులాడుతుంటే వాళ్ల కొడుకు ఉన్నాడని చెబితే తననే పెట్టుకున్నం. "  ఓనర్స్ నేమ్ బోర్డులో పేరు రాయించాలి. మీలో ఎవరి పేరు రాయాలో వివరాలు రాసివ్వండి" అని బిల్డర్ ఫోన్ చేసిండు.  ఇక్కడ ఇల్లు తీసుకోవాలన్న ఆలోచన నాదయినా ఆచరణలో పెట్టింది దయనే కాబట్టి "దయామణి AE" అని వ్రాయిస్తా అని మీ మరదలకి చెప్పిన.  తాను వద్దంది. "ఎందుకు?" అని అడిన, నీ పేరే రాయించు అంది. లేదు... లేదు నీ పేరు పెట్టడమే న్యాయం అన్న.  నా మాటల్లో సిన్సియార్టీ, కృతజ్ఞత తనకు అర్థమైంది. అయిన కాని వద్దంది.  కారణం అడిగితే "దయామణి అంటే క్రిష్టియన్స్" పేరట, ఆ పేర్లు ఎస్సీ, ఎస్టీలే పెట్టుకుంటారట కదా!.  బోర్డులో ఆ పేరు చూసి, అపార్ట్మెంట్లో అందరికీ మనం ఎస్సీ, ఎస్టీలం అని తెల్సిపోతదేమో వద్దు" అంది.  నాకేం చెప్పాలో తెల్వలేదు.  ఒక్కొక్కరు మా క్యాస్ట్ కన్ఫర్మెన్స్ కోసం ఏం చేస్తుండ్రో రోజుకో వార్త మోసుకొస్తుండేది లీలమ్మ. బహుషా తనకు కూడా ఆ అవసరం ఉందన్న భావన తన మాటల్లో కనిపించేది.  కానీ ఎవ్వరూ భయట పడక పోతుండ్రి.

ఇంకోసారి ఇంట్లోకి గ్రిల్స్ చేయించాలి.  నాకేమో అక్కడ ఎవ్వరూ తెలియదాయే.  అందుకే చారిసారికి ఫోన్ చేస్తే తేజస్విని స్కూల్ ముందు వర్క్ షాప్ అతను బాగా చేస్తాడని అడ్రస్ చెప్పిండు.  అప్పుడే కదా అన్న మీకు కూడా కాల్ చేసి అడ్గిన.  అప్పుడు మీరు అతను "మా చిన్న మామనే" అన్నారు కదా అన్నాను. "అన్న అవును తమ్మి.  ఆయనే కదా మీకు గ్రిల్ చేసింది" అన్నడు.  ఒక సారి మధ్యలో గ్రిల్ అయ్యిందో లేదో అడుగుదామని వర్క్ షాపు దగ్గరికి కారులో మీ మరదలు, నేను పోతున్నం.  డ్రైవర్ కు అడ్రస్ చెప్పి అటు తీసుకుపొమ్మని చెబుతున్న.  అంతల్నే డ్రైవర్ "నాకు తెల్సు సార్ వీళ్లు మాదిగోల్లు.   ఈ ఏరియాలో ఆయన్నే అందరికీ గ్రిల్స్ చేస్తడు" అండు.  మాటల్లో ఎమ్మటే నేను "అవును మా ఉదయ్ అన్న వాళ్ల మామనే" అంటుంటే దయామణి టక్కున వద్దని సైగ చేసి చెయ్యి నొక్కింది. అంతల్నే నోట్లో మాట నోట్లనే ఆపిన తర్వాత ఎందుకు చెప్పొద్దన్నావని అడ్గితే, అతను మీ అన్న వాళ్ల మామ అని చెబితే మనం మాదిగోళ్లమని డ్రైవరికి తెలుస్తాది కదా అందుకే వద్దని అన్న అంది.

ఒక రోజు చారి సార్ వాళ్ల కూతురు పుట్టినరోజు అని తెలిసి విష్ చేద్దామని ఇంట్లోకి పోయినం. చారిసార్ ఆ రోజు రాత్రి మాట్లాడినంత స్వేచ్చగా మాట్లాడలేదు. కూర్చున్నాం.  ఇంతలో ఎవలో తలుపు కొట్టిండ్రు. కిటికీలోంచి చూసిండ్రు.  అపార్ట్మెంట్ సెక్రెటరి రావు.  మమ్మల్ని బెడ్ రూంలో కూర్చోబెట్టి, తలుపు తీసిండు.  తను మాట్లాడి కొద్ది సేపట్లో వెళ్లిపోయిండు.  మమ్మల్ని బయటికి రమ్మండ్రు.  మాకు విషయం అర్థమైంది.   రెడ్డి కూడా ఆ రోజు మాట్లాడినంత చనువుగా మాట్లాడలేదు.  బహుశా తను మన ఊరి మిత్రులను కల్సి ఉంటాడు. ఎందుకంటే అన్న మీరు అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు చేసినప్పుడు రాళ్లతో కొట్టింది వాళ్లే కదా. ఇప్పుడు హిందుత్వ వాదులుగా ఉన్నారు.  చారి సార్ కూడా ఇప్పుడు బయట మాట్లాడడం లేదు.  కనిపిస్తే స్మైల్ ఇచ్చి వెళ్లిపోతుండు.  నా పెద్ద కొడుకు జై దీరన్ నా సెల్ రింగ్ టోన్ "జాగోరే జాగో అంబేద్కర్" పాట ఎప్పుడు పెట్టుకొని వింటుంటాడు.  మీ మరదలు ఆ రింగ్ టోన్ తీసేసింది.  ఎందుకని అడిగితే పని చేసేటామెకి "అంబేద్కర్ పాట" వినబడితే అనుమానం వస్తుంది.  అందుకే తీసేసిన అంది.  అలా సాధ్యమైనంత వరకు కులం బయట పడకుండా దయామణి జాగ్రత్త పడుతుంది.  నేను ఎక్కడ "బ్లాస్ట్" అవుతానోనని నన్ను కంట్రోల్ చేస్తుంది.   స్వతహాగా మాట్లాడే నా తత్వాన్ని, మాట్లాడే పద్ధతిని మార్చుకొమ్మని పదేపదే అడ్గుతుంది.

తనను అని కూడా ఏం ఫాయిదా.  ఈ బ్రాహ్మనైజ్ డ్ సమాజం అలా ఉండకుంటే బ్రతికి బట్ట కట్టలేరనే పరిస్థితులకు నెట్టేస్తుంది.  తను తన పిల్లలు భవిష్యత్తు కోసం తీసుకునే చర్యలు చాలా గొప్పగా అనిపిస్తున్నాయి.  నా మనసాక్షిని చంపుకొని, జాతి ప్రయోజనాలు కాపాడాల్సిన పనిలో భాగస్వాములం కాలేకపోతున్నందుకు బాధపడ్తున్న అన్నా" అన్నాను అసహాయుడిగా..

తమ్మి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థితికి వొచ్చినోళ్లం. ఇంకా ఎంతని పరుగెడదాం.  ఊరవతలికి పోతిమి.  మతం మార్చుకుంటిమి.  అయినా అక్కడికి వచ్చిరి.  అక్కడా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను అమలు చేసిరి.  మనుషులం మారితిమి.  పూలే-అంబేద్కర్ వెలుగులో జ్ఞానాన్ని పొంది సామాజికంగా ఎదిగి నిరూపించుకుంటిమి.  అయినా కులం వెంబడిస్తూనే ఉంది.  అస్పృశ్యానంతర  రూపాలను వెలుగులోకి తెస్తూ, రూపాంతరం చెందిన మనువు రూపాలను ఎండగట్టాల్సిన బాధ్యత మన తరందే.   గందుకే అస్పృశ్యానంతర  స్థితి   కులం రూపాలను కలుగు లోంచి గుంజి ఎదుర్కొనడం ఇప్పుడు మనం చేయాల్సిన అసలు పని.

ఫిజికల్ అన్ టచబులిటి గురించి మాట్లాడాల్సిన కాలం కాదిప్పుడు.  మనలో చదువుకున్న వాళ్లు కూడా బ్రాహ్మనైజ్ గా మారడానికి మొగ్గు చూపుతూ పేర్లు, మతం మార్చుకుంటూ జీవిస్తుండ్రు.  ఎదురు తిరిగి నిలబడి మన కులానికి, జాతికి శాశ్వత గౌరవం తేవడానికి వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేయడానికి సిద్ధ పడడం లేదు.  బుద్ది హద్దు అనే నినాదంతో గట్టా నడుస్తోల్లకన్నా మనం ఆసరా ఉంటలేం. గీ కాలంల ఆత్మగౌరవ స్వశక్తి ఉద్యమాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ్మీ" అన్నడు అన్న.

అంబేద్కర్-పూలేలు కులం, మనువు కొమ్మలు, మొండెం నరికేసిండ్రు.  వేర్లను సమూలంగా నాశనం చేసే బాధ్యత మనలాంటి రిజర్వేషన్ ఫలితాలను అనుభవించే వారి భుజాలపై ఉంది.  ఇప్పుడు మనువు మొండాలు చిగురించకుండా వేర్లు విస్తరించకుండా యాసీడ్ పోసి తగలబెట్టాలి.  దానికి గట్టిగా నిలబడి, త్యాగానికి సిద్ధపడాల్సింది మన తరమే.  ఎందుకంటే ఇప్పుటికే చాలా ఆలస్యం అయ్యింది.  ముందు తరాలు ఇంకా స్వార్థంగా తయారయ్యే ప్రమాదం ఉంది అన్నడు. అంబేద్కర్, పూలేలను అకాడమిక్ నాలెడ్జ్ కోసం . కాకుండా, వాళ్లలో పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంది. అండు అన్న కొంత ఆవేదనతో.

ఇంతలో నా ఫోన్ రింగయ్యింది. ఎత్తిన. "జాన్సన్ స్కూల్ తర్వాత ఎదురుంగా సందులో పార్క్ వ్యూ అపార్ట్మెంట్" అని ఫోన్ పెట్టేసిన.  "తమ్మి ఎవరు?" అండు .  బుద్ధుడి విగ్రహం,  నేమ్ ప్లేట్ ఆర్డర్ ఇచ్చి ఉంటిని అన్నా వాళ్లు వస్తుండ్రు.  నేను పోనా మరి అని సెలవడ్గినా.  అన్న ముఖం ఒక్క సారిగా గర్వంతో తొణికిసలాడింది. బిగ్గరగా ఒక్కసారి దగ్గరికి తీసుకొని గుండెకద్దుకుండు.  ఈ తెగింపే కావాలి తమ్మి "కీప్ ఇట్ అప్" అండు ఇద్దరం ఇంటి తొవ్వ పట్టినం. ఫ్యియాల్ నింపుకున్న రాకేట్ లా.

click me!