నా ఇల్లు వంటిల్లు లేని కథల ఇల్లు కావాలని "My Dream House..! " కోసం తపిస్తున్న గీతాంజలి రాసిన కవిత ఇక్కడ చదవండి
My Dream House..!
వంటిల్లు లేని ఇల్లు కావాలి..
ఉన్నదా మరి ఈ భూమ్మీద?
ఇంటి మిగతా నాలుగు గదుల్లో..
ఉన్న సౌఖ్యం వంటింట్లో ఉంటుందా...?
నా ఉదయ మధ్యాహ్నాలను
సాయం సంధ్యలను...రాత్రుళ్ల కాలాల్ని
వంటిల్లు దగ్ధం చేస్తుంది
నా కాలాలు...నా వేళ్ళను కలం పట్టుకోమంటే...
వంటిల్లు నా చేతిని భగ భగ మండే పొయ్యి మీద పెట్టి కాలుస్తుంది
మనసూ.. ఇల్లు నా వేళ్ళు
కాలుతున్న మాంసం వాసన వేస్తాయి
మండే పొయ్యి నన్ను గాఢంగా కౌగలించుకుంటుంది
నేను ..వేడి వేడి భోజనమై కంచాల్లోకి వస్తాను
వాళ్లకు వినిపించవు కానీ..
వంటలు..నాతో మాట్లాడుతాయి...
లిపి లేని భాషలో...గుసగుసలాడతాయి
వంట ఒక్క నాదేనా.. అతనిది కూడా కదా..
పద పదా అవతలకి ..
అని వంటింటి గడప దాట బోతానా...
అంతే వేగంతో అతని అదృశ్య హస్తాలు
నన్ను మళ్లీ వంటింట్లోకి తోసేస్తాయి
కత్తులతో కూరగాయలు కోస్తున్నప్పటి
నా తెగిన వేళ్ళు కార్చిన రక్తం....
నేను రాయబోయే కథలను
కుత..కుత ఉడికే కూరల్లోకి ఒంపి మరీ రాస్తుంది
అవమానంతో..నొప్పితో
నా మెదడు అక్షరాలతో సహా కంపించిపోతుంది
అమ్మ చెయ్యి ..పిల్లలకి కూడా
అవిశ్రాంతంగా పనిచేసే రక్తమాంసాల పనిముట్టు మాత్రమే
అమ్మకి పర్యాయపదం వంటిల్లే వాళ్ళకి
అమ్మ చేతిలో కలం కంటే
గరిట ఉండటమే అమ్మతనం వాళ్ళకి
తొలి రాత్రి అయిన తెల్లారి..
భార్య బుగ్గల మీది కన్నీటి చారలు.... కళ్ళల్లో తెర్లాడే భయపు నీడలు కాకుండా.. మొగుడు కొరికిన
పెదవుల మీది ఎండిన రక్తపు గీరల గాట్లు.. వాడెంత రసికుడో ..అని చెప్పుకుని మురిసినట్లు..,
వంటలు చేస్తున్నప్పుడు..
కోడలి గాజుల కింద దాక్కున్న ముంజేతి చర్మం మీద... సల సల కాగిన నూనెల మరకలు ..
నా పనితనాన్ని మెచ్చే మెమెంటోలవుతాయి... నా ఒంటి మీద..
కత్తులతో..ఫోర్కులతో... కాగిపోయే నూనెలతో.,
వంటిల్లు గీసిన మచ్చలు..
గోడ మీద వేలాడే ఆక్రిలిక్ పెయింటింగ్స్ కంటే కూడా గొప్పవై కూర్చుంటాయి
దయలేని వంటిల్లు...
నా జ్వరకాలాన్ని కూడా లాక్కుంటుంది
జ్వరంతో నా నులక మంచం కూడా వంటింట్లోకి చేరుతుంది
నా చేయి కలాన్ని పక్కన పెట్టి
103 డిగ్రీల ఉష్ణంతో మరుగుతున్న దేహంతో
మిగతా గదుల్లో ఉన్న జ్వరంలేని రోగులకు వంట చేసి పెడుతుంది...!
అంతేనా...
నెలలో మూడు రోజుల ఋతుకాలాలను కూడా
నొప్పితో సహా వంటిల్లు రాక్షసిలా ఆక్రమిస్తుంది
దయలేని వంటిల్లు..
దహించుకుపోయే నా ఆకలిని దాచుకొని...
వాళ్ళ ఆకలి ముందుగా తీర్చమంటుంది
ఈ వంటిల్లు ఎంత సిగ్గు లేనిదంటే...
వంటయ్యాక నేరుగా పడకటింటిలోకి
అతగాడి ఒంటి ఆకలిని తీర్చమని
వెయ్యి కాళ్లతో ఒక్క తాపు తంతుంది...!
నా కలం మాత్రం..
నా జ్వరాన్ని,నొప్పిని కూడా ప్రేమిస్తుంది
నా వేళ్ళ నుంచి రక్తాన్ని కాక..
అక్షరాలను మాత్రమే తీసుకుని
కవిత్వమో.. కథనో అయ్యి ..
నా అస్థిత్వాన్ని గుర్తు చేస్తుంది
నా చేతిని పొయ్యి మీద కాకుండా
ఖాళీ కాగితాల మీద పెడుతుంది!
అందుకే...
నాకు నా కలం అంటేనే మోహబ్బత్ !
నా వంటని.. వొంటిని గుటుక్కున మింగే
ఈ వంటిల్లు..పడకటిల్లు నాకు వద్దు
నాకు... దేహమే లేని జీవితం కావాలి
నాకు... నేను అతనికి వంట చేయని కాలం కావాలి
అతనికి నేను వంట మనిషిని కాని కాలం కావాలి
నాకు నా కలమే కావాలి
నాకు...వంటిల్లుకి విడాకులు ఇవ్వడం కావాలి!
Ofcourse ...Iam a Writer .. not your Cooker !
వద్దు..!
నాకు వంటిల్లు వద్దు !
నా ఇల్లు వంటిల్లు కాకూడదు..!
నా ఇల్లు నాతో మాత్రమే వంట చేయించకూడదు
నా ఇల్లు పడకటిల్లు మాత్రమే కాకూడదు!
నా ఇల్లు కథల ఇల్లు కావాలి!
నేను కథల్లో రాసిందే నిజంగా
జరిగే ఇల్లు కావాలి!
అదే నా కథల ఇల్లు
నా కలల ఇల్లు!
ఎక్కడుందో చెబుతారా?