వెలుతురు చేరని చీకటి కాలం...!: మామిడి హరికృష్ణ కవిత

By Arun Kumar P  |  First Published Feb 2, 2022, 2:46 PM IST

ఇంకా చీకట్లు తొలగిపోలేదంటూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కలంనుండి జాలువారిన అద్భుత కవితను ఇక్కడ చదవండి...


1. ఇంకా చీకట్లు తొలగిపోలేదు !

2. అక్కడెక్కడో మనో హర్మ్యంలో ఓ కన్ను తెరుచుకుంటుంది
గాలి అలలపై ఓ దృశ్యం గుండె గడప మీద ప్రత్యక్షం అవుతుంది 
తక్షణమే కాంతి సంవత్సరాల దూరం కూడా అత్యంత సమీపమై 
ఏ ఆధారమూ లేని అంతరిక్షంలో విన్యాసం మొదలెడుతుంది!
చరణ సౌందర్యం-- హసిత లాలిత్యం 
ముకుళిత అధరం-- విప్పారిన నయనం 
వికసిత ఆనందం-- విరహ వినోదాల మెరుపుల మధ్య 
ఒడిలో Butterfly రెక్కలు అలల్లా ఆడిస్తుంది 
ఒంటి కాలి తపో దీక్ష virtual స్పర్శలలో  తన్మయం అవుతుంది 
మోచేయిని - కాళ్ళ వేళ్ళను మాత్రమే నేలపై ఆనించి  
దేహమంతా గాలిలో తేలిపోయే చిత్రం...  
ఎప్పుడూ మట్టిని ముద్దాడే పాదాలు 
ఈ సారి ఆకాశం వంక చూస్తూ 
గాలిలో నడుస్తూ..  కదులుతూ..  
వర్తులాలుగా గింగిరాలు పోయే విచిత్రం... !

Latest Videos

3. కళ్ళతో ఉచ్చ్వాస - మాటలతో నిశ్వాస 
చెవులతో మువ్వల సవ్వడుల ఆస్వాదన 
మస్తిష్కంలో వాయు స్థంభన 
ప్రతి వేకువ చీకటి ఓ యోగ నర్తన !
The gimmick of long legs
the magic of short voices
and the one and only ప్రేమ
 పద్మాసనం వేసుకుని
ప్రాణాయామ కపాల భతిలలో 
దేహ చక్ర స్థానాల మధ్య తారాడుతూ ఉంటాయి !

4. ఈరోజు కూడా ఇంకా వెలుతురు చేరని చీకటి కాలం లోనే 
నీ కంటి చూపు కోసం కలవరిస్తూ ఉంటాను 
ఏ గ్రహణం తాకిడికో తల్లడిల్లి సొమ్మసిల్లి పడి ఉంటావు 
ఇప్పుడు ఇక్కడ లోకం లోకమే 
Digital Projection అయి ఉంటుంది-ఏవీ కనిపించవు 
పుస్తకం లో పద్యం కనిపిస్తుంది -- భావం అర్థం కాదు
FM Radioలో పాట వస్తూ ఉంటుంది- ఏదీ వినిపించదు 
OTT లో Historical Period Thriller -- ఏ భావాన్నీ కలిగించదు 
podcast లో ప్రసంగం-- ఏమీ తలకెక్కదు 
youtube లో Interview -- ఏకాగ్రత కుదరదు 
facebook లో live show -- వాదన ఏదీ ఆకట్టుకోదు 
whatsapp లో message -- చదివినా మెదడుకెక్కదు 
instagram లో కళ్ళు చెదిరే photo -- Retina దాటి లోపలికి తొంగి చూడదు 
భూగోళానికి అవతల అర్ధ ప్రపంచంలో నువ్వు 
ఇక్కడ శూన్య విశ్వంలో అనంతంగా తప్పిపోయిన నేను !

5. అంతేనా--
చేతులు ఏవో కదులుతూ ఉంటాయి-- ఉద్దేశం ఏంటో చిక్కదు
పాదాలేవో నడుస్తుంటాయి -- గమ్యం ఉండదు 
పెదాలేవో పలుకుతూ ఉంటాయి - ఏ భాషో  తెలీదు 
చెవులేవో  వింటూ ఉంటాయి -- స్పందన ఉండదు 
గాలేదో వీస్తూ ఉంటుంది -- ఊపిరి ఆడదు !

6. అలా హృదయం తెరిచి చూస్తూ ఉండగానే 
చుట్టూ తెల్లవారుతుంది 
మనసులో చీకటి మాత్రం వ్రేళ్ళాడుతూనే ఉంటుంది 
ఏ కొమ్మ మీద నుంచో కువకువ అని పాడే పిట్ట 
ఎప్పటిలాగే ఈ రోజు కూడా పాడుతుంది 
ఏదైనా రాగమే--  పాడేదంతా పాటే  అనుకుంటున్నావు కదా
కొంచెం ఆలకించి విను 
ఆ పాట నిండా దుఃఖమే వర్షిస్తూ ఉంటుంది ... 

7. వర్షాన్ని చెరిపేసి - మంచు తెరలు తుడిచేసి 
మళ్ళీ వెలుతురు చేరని చీకటి కాలం కోసం కళ్ళల్లో దీపాలు వెలిగిస్తాను  
ఇప్పుడు, ఇంకా చీకట్లు తొలగి పోలేదు! 
కాదు కాదు...  నాకే ఈ చీకట్లను తొలగించాలని లేదు 
నా మనో హర్మ్యంలో ఏ క్షణమైనా 
నీ దృశ్యం ప్రత్యక్షం కావచ్చు కదా!!
 

click me!