అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం వాసరచెట్ల జయంతి "తురాయి పూలు" అందిస్తున్నారు వారాల ఆనంద్.
ఇటీవలే వాసరచెట్ల జయంతి పంపించిన కొత్త కవితా సంకలనం “ తురాయి పూలు” అందుకున్నాను. తన కూతురు చందన వేసిన ముఖచిత్రంతో ముస్తాబయి వచ్చిందీ సంకలనం.
‘హృదయానికి...
గాయపు తడి తగిలినప్పుడల్లా
అక్షరాలను అందంగా అలంకరించడం
నాకేమీ కొత్త కాదు...’ అన్నారు వాసరచెట్ల ఉయంతి.
అంటే కవిత్వం సంతోషాలనే కాదు గాయాలనూ మోస్తుంది అని ఆమె తన స్వీయగొంతుతో అనుభవంతో చెప్పారు. ‘నేల విమానం’ సంకలనంతో ఇప్పటికే కవిత్వంలోకి అడుగుపెట్టిన వాసరచెట్ల జయంతి ఇప్పుడు ‘తురాయి పూలు’ తో ముందుకు వచ్చారు.
సామాజిక మాధ్యమాల విస్తరణ తర్వాత ఇవ్వాళ కవిత్వం విస్తృతంగా వస్తున్నది. కవులు విస్తారంగా రాయడం మంచి పరిణామమే. అయితే సాంద్రత ఎంత అన్నదే అసలు ప్రశ్న. అదట్లా వుంచి వాసరచెట్ల జయంతిని, చందననీ అభినందిస్తున్నాను.
ఎప్పుడయినా ఎక్కడయినా ఏ భాషలోనయినా సాహిత్యం కన్నా జీవితం చాలా చాలా విస్తారమయింది. అంతేకాదు గాఢమయిందీ, వైవిధ్యమయిందీ, సజీవమయిందీ కూడా.అప్పుడూ ఇప్పుడూ సృజనకారులు జీవితాన్ని చిత్రించే ప్రయత్నమే చేసారు. వ్యాఖ్యానం కూడా చేసారు. అయితే గతంలో కంటే భిన్నంగా ఇవ్వాళ రాస్తున్న కవులూ రచయితలూ ఒక ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నారు. గతంలో సమాజంలో మార్పులు చాలా నెమ్మదిగా వచ్చేవి. వాటిని అర్థం చేసుకుని తమ రచనల్లో ప్రతిబింబించడానికి ఆనాటి సాహిత్య కారులకు సమయం చిక్కేది. కానీ ఇవ్వాళ సాంకేతికతో పాటు సమాజమూ అత్యంత వేగంగా పరుగులు తీస్తున్నది, వైవిధ్యంగా మార్పులకు లోనవుతున్నది. ఊహించని మలుపులు తీసుకుంటున్నది. ఆ మార్పుల్ని అర్థం చేసుకోవడం ఇవ్వాళ అంత సులభంగా లేదు. అర్థం చేసుకుని రాయడం కూడా నల్లెరుమీద నడక కాదు. అదొక చాలెంజ్ గానే మారింది.
‘ప్రపంచం మీ గుప్పిట్లో’ అన్న నినాదం ప్రాచుర్యంలోకి వచ్చాక అసలు ఈ ప్రపంచం గుప్పిటి మూసి ఉందా తెరిచి ఉందా అన్న శంశయం మొదలయింది. దాంతో పాటు తెరిచి వున్నట్టనిపిస్తున్న గుప్పిట్లో కనిపిస్తున్నది వాస్తవమా !? దాని వెనకాల ఇంకో దృశ్యమో లక్ష్యమో ఉన్నాయా ?? అన్నది ఈ రోజు వెయ్యి డాలర్ల ప్రశ్న. ఆ ప్రశ్నను అర్థంచేసుకోవడం దానికి సమాధానాలు వెతకడం ఇవ్వాల్టి మేధావులూ కళాకారులూ చేయాల్సిన పని. కవులూ రచయితలూ కళాకారులయితే దాన్ని అర్థం చేసుకోవడంతో పాటు అర్థం చేసుకున్న విషయాల్ని కళాత్మకంగా ప్రకటించాలి. అంతేకాదు మానవ మనో నైజాల్నికూడా తమ రచనల్లో ప్రతిఫలింప జేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే కవులూ రచయితలూ ఏం చేయాలి ? వాల్లకేమయినా నిబంధనలు ఉంటాయా అంటే అలాంటివి ఏమీ వుండవు. స్త్రీ అయినా పురుషుడయినా ప్రతి కవీ,రచయితా తనదయిన స్వీయబాటలో సృజనకు ఉపక్రమిస్తారు. అట్లని ఏ ఒరవడీ లేకుండా ఎట్లా వుంటుందీ అంటే దానికి సామాజిక అధ్యయనంతో పాటు గతకాలపు సాహిత్య అధ్యయనం ఎంతగానో అవసరమవుతుంది. విస్తృతంగా చదవడం తోటే సృజన కారులు తమ సృజనకు మెరుగులు పెట్టు కోగలుగుతారన్నది నూటికి నూరు పాళ్ళు వాస్తవం.
సీరియస్ అధ్యయనమే ఇవాళ తెలుగు సాహిత్య రంగంలో కొరవడింది. ఈ మాట అందరూ అంటున్నదీ, అనుకుంటున్నదీ, బాధపడుతున్నదీ కూడా. దాన్ని వర్తమాన కవులు, రచయితలు,గమనించాల్సి వుంది. తోచిందల్లా రాయడం సామాజిక మాధ్యమాల్లో తోసేయడం కాకుండా కొంచెం స్థితిమితంగా స్థిరంగా ఆలోచించి తాము ఫీలయి చెప్పదలుచుకున్న విషయాన్ని కళాత్మాకంగా వెల్లడిస్తే ఆ రచనకు అర్థం శాశ్వతత్వం అందుతాయి.
ఇప్పటికీ ఎక్కడయినా మట్టి ఇల్లు
కనిపిస్తే చాలు
నేను పుట్టి పెరిగిన మా ఇల్లు గుర్తొస్తుంది
ఇల్లంతా ఎర్రమన్ను
ఆవు పేడతో కలిపి
అలికి ముగ్గులు పెట్టేది ఎల్లవ్వ.. అంటూ సాగిన ‘మాయమయిన పల్లెతనం’ కవితలో జయంతి నాస్టాల్జియా కనిపిస్తుంది. అంతే కాదు
‘పల్లెలన్నీ నగరాలయిన వేళ
మా ఇంటి జాగాలో కూడా
భవంతి లేచింది’ అని మారుతున్న సామాజిక స్థితిని, తమలో కూడా వచ్చిన వస్తున్న మార్పుల్ని నిజాయితీగా చెప్పారు.
ఇక జయంతిలో వున్న భావుకతను గురించి చెప్పుకుంటే..ఆమె రాసిన " కిటికీ " కవిత మంచి ఉదాహరణ.
‘అలా ఎప్పుడయినా
మేడపైన కిటికీ
ముందున్న కుర్చీలో కూర్చుంటానా
పక్షి రెక్కలు ఆడించినట్టు
కిటికీ చేతులు ఊపుతుంది... అంటూనే
కిటికీ అంటే గది గోడలకు తగిలించిన
ఊపిరితిత్తులే కాదు
మన కళ్ళకు ప్రపంచాన్ని చూపే దివిటీలు’ ఆన్నారావిడ. అట్లా కవితా రూపం ఎత్తి మనల్ని అలరిస్తుంది. జయంతి రాసిన మరో విలక్షణమయిన కవిత ‘కొత్త గానుగ’. విలక్షణమె కాదు ఒక జీవితాన్ని ఒక బతుకుదెరువును ఒక సామాజిక వర్గాన్ని ఆవిష్కరించిన కవిత.
‘ కాల చక్రం తిరిగినట్టే
గానుగ చక్రం తిరుగుతుంటది ... అంటూ మొదలు పెట్టి
దేవుడి ముందు దీపం వెలిగియ్యాలంటే
నలిగిన మేము వత్తీలాగా నిలవడ్తము... అని కొనసాగిస్తూ
“ మైగాంచ్ తెలీహూ” అంటూ మహాత్మా గాంధీతో
నామకరణం చేయించుకున్నోళ్ళం
స్వాతంత్ర సమరంలో కాల్లు కదిపి నోళ్ళం
తెలీవాలాలం
గానుగ నూనె తీసి బతికేటోళ్ళం
మేము గాండ్లోళ్ళం” అని గొప్పగా ముగించింది.
.....
జయంతి వాసరచెట్ల నాన్న గురించి మంచి కవితలు రాసారు, అంతే కాదు అనేక సందర్భాల్లో తన స్పందనల్ని కవితా రూపంలో పెట్టారామె. ఉగాది, ఆమె కూతురు చందన జన్మదిన సందర్భంగా, అమ్మా బాపుల పెళ్లి రోజు సందర్భంగా అనేక కవితలు రాసారు.
....
అయితే ‘సాహితీ శిఖరాగ్రం’ కవితలో
పసి బాల వయసులో అక్షరార్చన చేసి
విశ్వనాథ వారి అడుగుజాడల్లో
కావ్యమై నిలిచాడు... అని శ్రీ శ్రీ గురించి రాయడం సరికాదు.
.....
వాసరచెట్ల జయంతి అక్షరాల్ని రాయడం అలంకరించడం పట్ల ఎంత మమకారంగా ఉంటున్నారో అంతే దీక్షగా చదవడం పైనా మనసు పెట్టాలని కోరుకుంటున్నాను. రాసే ఒడుపును పట్టుకున్న ఆమె రాసే అంశాల మీదా, రైటింగ్ క్రాఫ్ట్ మీదా దృష్టి పెట్టి రాస్తే మరింత మంచి కవిత్వం రాయగలరు. ఆమెకు నా అభినందన.