బెల్లం ముక్కిచ్చి పండుగ చేసుకోమంటే పథకాల రథచక్రాల కింద నలిగి పోయెదెవరు? అంటూ హైదరాబాద్ పాతనగరం నుండి రేడియమ్ రాసిన కవిత ఇక్కడ చదవండి :
ఉచితానుచితాలు సాగితే
ఉచితాలకు ఆర్థిక వ్యవస్థ
లంకాదహనం మైపోదా
బాగా కుడుములు తిన్నాక
అది వమనం కాకమానదు
పేరు గొప్పకు పోయి
ఊరు దిబ్బచేసుకుంటే
చరిత్ర విక విక నవ్వుతుంది
ప్రజా పాలనలో
పాలన తిరోగమనం పడుతుంది
ధరలు వామనునిలా పెరిగి పోయి
జనం బతుకు భారమై పోయి
పోరు బాట పడుతుంది
గెలుపు కొరకు ప్రజల డబ్బును
దారి మళ్లించడం
దారద్ర రేఖకు దిగువకు నెట్టడం
పాలన కాదు
మోసపూరిత లాలన
బెల్లం ముక్కిచ్చి
పండుగ చేసుకోమనడం
పథకాల రథచక్రాల కింద
నలిగి పోయెదెవరు?
నీరు నీరనుకుంటూ పోతే
డబ్బు నీరై పారిపోదా!
ఆత్మబంధువు అంటూ కూర్చుంటే
రొక్కం రూటు మారదా!
ఇంకెక్కడ పురోగతి
ఇక ప్రగతి అధోగతి
జనం నిజాన్ని నిలదీసినపుడు
కోటలు కూలిపోలేదా!
అందుకె అందుకే
వేకువను ఎవరు ఆపలేరు