వారాల ఆనంద్ కవిత : ఇద్దరు

By Arun Kumar P  |  First Published Jul 1, 2022, 3:34 PM IST

మనుషుల మధ్య అవిశ్వాసం మొలకెత్తి వూడలు దిగిన చెట్టయి విస్తరిస్తున్నది అంటూ కరీంనగర్ నుండి వారాల ఆనంద్ రాసిన  కవిత "  ఇద్దరు " ఇక్కడ చదవండి :
 


విశాలమయిన ఆకాశంకింద
సారవంతమయిన భూమ్మీద
కలిసి బతకాల్సిన ఇద్దరి నడుమా
అలిఖిత విభజన రేఖ
ఆ విభజన రేఖమీది మౌనం
నన్ను అమితంగా భయపెడుతున్నది

మనుషులన్నంక ఇద్దరి మధ్య మాటలుండాలి కదా
మౌనం నాట్య మాడుతుందేమిటి
ఇద్దరి చూపులూ అప్పుడప్పుడయినా కలవాలి కదా
నాలుగు కళ్ళూ ఎందుకు అపనమ్మకంగా చూసుకుంటున్నాయి

Latest Videos

ఇద్దరి చేతులూ స్నేహంగా కరచాలనం చేసుకుని
ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి కదా
ఇవ్వాళ
మనుషులు ఆత్మల్ని అంగట్లో అమ్మేసి
వట్టి దేహాలయి పోయారు
ఆ దేహాల నడుమ ఎడారులు మొలిసాయి
ఏ క్షణం ఎడారి ఎగిసి
ఇసుక తుఫానుగా చెలరేగుతుందోనని భయంగా వుంది

మనుషుల మధ్య
అంకురించిన అవిశ్వాసం మొలకెత్తి
వూడలు దిగిన చెట్టయి విస్తరిస్తున్నది  

ఇద్దరి నడుమా విభాజన రేఖ మీద
తిష్ట వేసుకున్న నిశ్శబ్దం
పేలేందుకు సిద్ధంగా వున్న బాంబులా
నన్ను భయ పెడుతున్నది    

click me!