పలకరింపు: భాషల భాస్కరుని గాన సమ్మోహనం

By telugu teamFirst Published May 17, 2021, 3:24 PM IST
Highlights

గాయపడి సేద తీరుతున్న  హృదయాన్ని పలకరిస్తే ఎలా ఉంటుందో డి. రాజారాం మోహన శర్మ  పలకరింపు లో  చదవండి.

ఓ రోజు మిట్ట మధ్యాహ్నం
నా చూపులు వాట్సాప్ లోకి జారుకున్నాయి
అంతలోనే నా వాల్ మీద
నలిమెల మెస్సేజ్ రెక్కలు కట్టుకొని వాలింది 
"ఆనాటి చెలిమి ఒక కల... పిబి శ్రీనివాస్ పాడిన పాట"ను మోసుకొచ్చింది
అది నలిమెల గళంలో సమ్మోహనం
నా మనసులో సంతోషం మోసులువారింది
వెంటనే భాస్కర్ సర్ కు ఫోన్ చేశా
ఓ ఆత్మీయ పలకరింపు
నాలో పరమానందాన్ని నింపింది
బాగున్నారా .... సర్ .... 
"బాగున్నాను .... మీరు బాగుండాలి ....
బతుకాల్సిన తరం మీది
ఏదో ఊరట కోసం అలా చేశా"
మనిషికిలాగానే ఆ మాటల్లో ఎంతో నిరాడంబరత్వం
పాటలో పరమార్థం పట్టి చూపించారు
మీ వాయిస్ చానా బాగుంది.
"ఏదో శర్మ గారూ ... మీ అభిమానం .... 
ఇదంతా కేబి శర్మ చలవే ... ఆయనే నా గురువన్నారు. సరిగమలు సరిగ్గా రెండేళ్ళ క్రితం నేర్పారు.
ఇపుడు కీబోర్డ్ కూడా కొనుక్కొన్నాను
వాయించడం కూడా వచ్చు 
భూత, భవిత, వర్తమానాలను చూసుకోవాలికదా!
ఆత్మీయ పలకరింపులతోనే అన్ని వ్యాధులు నయమౌతాయి" శర్మగారూ!.
నిజమే సర్ అన్నాను.
"సాహిత్యంలో పడి సంగీతాన్ని మరిచాను
ఇటీవలే మా చెల్లెలి మృతితో మళ్ళీ మొదలుపెట్టిన" అన్నారు.
సంగీతం మనోగాయాలకు లేపనం కదా! సర్!
"ఆఁ... అది పిబి శ్రీనివాస్ పాట తెలుసు కదా" అన్నారు. 
ఓ... తెలుసు సారని మరింత లోతుగా పలకరించాను. ఆరోగ్యమెట్లుందని అడిగితే 
"బాగుంది కానీ అదేపనిగా చదువడం
రాయడం అస్సలు కుదరడం లేదు". 
ఆయనను కుంగదీసిన తోబుట్టువు మరణమే కాదు
సమాజ సమస్యల పట్ల సైతం లోతుగా స్పందించారు.
ఆహార్యం,అలవాట్లలో మీరు బాగా సుకుమారులు
మందారం, మల్లెపువ్వు లాంటి మనస్తత్వం మీదన్నాను. అభ్యుదయ భావాలను అలుంకున్న 
మా కుటుంబ నేపథ్యాన్ని చెబితే శ్రద్ధగా ఆలకించారు.
ఇక సంగీత సాగరంపై దృష్టి మళ్ళించండన్నాను.
"అదే... నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నాను" అన్నారు
కొన్ని సందర్భాల్లో కొన్ని అలవాటు చేసుకోవాలే
కొన్ని అలవాట్లను మానుకోవాలి మరీ.
దీనికి ఋషివంటి భాస్కర్ సర్
సున్నితంగా నవువ్వతూ
"ఏమో శర్మగారూ!
కొన్ని అలవాట్లు రమ్మన్నా రావాయే
కొన్ని వచ్చినా పోవాయే"
తన ముక్కుసూటి వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రకటించుకున్నారు.
"నేను ఆత్మస్తుతి, పరనిందలకు దూరం
భద్రాచలం, మహబూబాబాద్లో పనిచేసేప్పుడు 
నా సహోపన్యాసకులు 
నన్నెంతగానో ఇష్టపడేవారు 
అదంతా వాళ్ళ అభిమానం మాత్రమే కాదు
నాకది ఆశీర్వచం కూడా
ఇప్పటికీ వారు ఆప్యాయంగా పలుకరిస్తారు
నాకా మాటలతో కడుపు నిండినంత పనైతది
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి"
స్ఫూర్తివంతమైన తన వృత్తిగత జీవితాన్ని తవ్విపోసుకున్నారు 
"మా చుట్టు పక్కల ఉన్నోళ్ళు కూడా నన్నో మునిలా లెక్కిస్తరు"
మరి మీకెలాంటి దురలవాట్లు లేకపాయే
కానీ పాట బాగా పాడిండ్రు
ఎట్లా సాధ్యం ?
"అభ్యాసం సర్" అన్నారు
సార్ అనకండన్నాను
అయ్యో ఫర్వాలేదన్నారు
పద్నాలుగు భాషలతో పాటు 
పసందైన సంగీతం సొంతం చేసుకున్నారు
కారణ జన్ములు మీరు
"కరోనా కారణంగా బయటి కార్యక్రమాలకు వెళ్ళలేకపోవడం బాధాకరం
ఇటీవల అన్నవరం ఇంట్లో ఏనుగు నరసింహారెడ్డి వీడ్కలు సమావేశానికినూ
సాహితి సోపతి పదేండ్ల పండుగకు వెళ్ళాను
మా చెల్లెది సహజమరణమే కానీ ఎవరినీ రావద్దన్నాను
మా ఆవిడ కూడా ఫోన్ లాక్కొని మరీ రావద్దని చెప్పింది"
ఏదేమైనా మీ ఆరోగ్యం పదిలం సర్!
బాగా చదువకుండ్రి ఆలోచించకుండ్రన్నాను
"అదే సార్... నేను జాగ్రత్త పడుతూనేవున్నా
గురువుగారు శ్రీభాష్యంకు అప్పాజోస్యుల పురస్కారం రావడం సంతోషకరం 
శుభాకాంక్షలు తెలియజేయండి"అన్నారు
సరే సర్ థాంక్యూ...
"అయితే శర్మగారూ! మరికొన్ని పద్యాలు,పాటలు స్వయంగా కీబోర్డు వాయిస్తూ ఆలపించాను. 
పంపిస్తాను వినండి"
అంతే ఫోన్ పెట్టేసా
"అలుగుటయే ఎరుంగని...
చెల్లియో చెల్లకో... 
జెండాపై కపిరాజు.... హృద్యమైన పద్యాలు 
ఓ నాన్న నీ మనసే వెన్న... ఆపాత మధురం"
అబ్బురపరిచాయి 
ఎంత మధురాతి మధురంగా ఆలపిచాడో మరీ!
మహానుభావులకు ఏదైనా సుసాధ్యమే సుమా! 

- డి. రాజారాం మోహన శర్మ

( పండితులనైనా, పామరులనైనా సమంగా చూస్తూ, ఫక్కుమని నవ్వుతూ, పలకరించే పదునాలుగు భాషల పండితునికి పదివేల ప్రణామాలు)

click me!