సిస్టర్ అనసూయ నవల 'విముక్తి' పైన యడవల్లి శైలజ ( ప్రేమ్) రాసిన సమీక్ష ఇక్కడ చదవండి.
సమీక్ష: యడవల్లి శైలజ ( ప్రేమ్
' విముక్తి' నవల చదువుతుంటే సిస్టర్ అనసూయ మొదటి నవలని అర్థమవుతున్నది. అనగనగ ఒక కథలా మొదలైనట్లు, కథానికలా అనిపించినా పోను పోను పరిణితితో సాగిపోయింది. ఇది విమర్శ లాంటి సమీక్ష అని మీకు అనిపించవచ్చు కానీ కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్టు చెప్పక తప్పదు.
మన రచయిత్రి సమాజంలో జరుగుతున్న అరాచాకాలను చూసి అందరిలోనూ సోదరి సోదరుల భావన రావాలని తన పేరు సిస్టర్ అనసూయగా పెట్టుకోవడం నిజంగా అభినందనీయం. సృష్టికర్త శతకంలో కూడా తను ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను పద్య రూపంలో రచించారు. ఈ మధ్య కాలంలో కవయిత్రులు నవలా రచనలో తామేమి తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. సిస్టర్ అనసూయ చేసిన ప్రయత్నంకు శుభాభినం దనలు.
undefined
నవలలో ఎన్నో మలుపులు , ఏళ్ల తరబడి పాతుకుపో యిన దోపిడిదారితనం, కుల వివక్ష, లింగ వివక్షత దళిత జీవితాలను విచ్ఛిన్నం చేసిన తీరు కంటతడి పెట్టిస్తుంది. పల్లె ప్రజల భాష పచ్చి అలుకు వాసనలా పరిమళిస్తూ ఉంటుంది. ఆకిలూకి, పొయ్యి అలికి ముగ్గు బెట్టడం పల్లెలో నివసించే ప్రజల జీవన విధానం గురించి తెలియజేస్తుంది.
" సూరయ్య ' వయసు మళ్ళినప్పటికీ పెళ్ళి చేసుకున్న రాధమ్మను మంచిగా చూసుకుంటాడు. భార్య తల్లవుతుందని సంబరపడడమే కాకుండ కాలుజారి పడ్డాక భార్య గురించి ఆమె భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి తను చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెప్పి నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు నన్ను క్షమించమని అడుగుతాడు. బొట్టు, గాజులు, పూలు తీయవద్దని కోరతాడు. ఇంకా నీ వయస్సు చిన్నదేనని పిల్లలు పుట్టిన తర్వాత మీ అమ్మ దగ్గర ఉంచి నువ్వు మనువాడమని నీ కోసం అన్ని రాసిపెట్టాను. నువ్వు ధైర్యంగా ఉండమని ఆమెకు ధైర్యమిచ్చిన మంచి మనిషి. అంతేగాక నాకు నువ్వుతప్ప మరెవరు లేరని ఆవేదన పడతాడు. ఈ సమాజంలో మనిషి చనిపోయిన తర్వాత జరిగే తంతును కూడా జరపకని ఈ జనాలు నిన్ను విధవను చేస్తారు ఎవరేది చెప్పినా సరే నువ్వు వినకు ఈ సమాజం తీరే అంత అని ఒక గురువులా భార్యకు భోధిస్తాడు. ' సూరయ్య ' లాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉంటే బాగుండేది కదా!అనిపిస్తుంది".
సాంప్రదాయల పేరిట జరిగే మూఢనమ్మకాలను ఎదిరించమని చెప్పినా ఆమె కాని సూరయ్య స్నేహితుడు సోమయ్య కాని ఆపలేక పోతారు. భారతీయ సాంప్రదాయలకు ఒక మహిళ చెల్లించిన మూల్యం ' జీవితం ' .
" సూరయ్య పాత్రకు విరుద్ధమైన పాత్ర నారయ్యది. వంశోద్దారకుడి కోసం కట్టుకున్న భార్యను చితకబాది ఆడ పిల్లని అమ్ముకుందా మంటాడు. తాగుడు కోసం కన్నపేగు బంధాన్ని కూడా లెక్కచేయడు. అతని భార్య కమల లేనప్పుడు తన చిన్న బిడ్డను అమ్మి వళ్ళు తెలియనంతగా మద్యం తాగి ఏమీ తెలియనివాడిలా ఇంటికొచ్చి పడుకుంటాడు. ఇరుగుపొరుగు గట్టిగా అడిగేటప్పటికి నా రక్తం, నా బిడ్డ నా ఇష్టం అంటాడు. మద్యం దుకాణాలు ఉండడం వల్ల చితికిన ఒక కుటుంబ చిత్రం మనకు కనబడుతుంది ".
ఈ సమాజంలో నరేందర్ లాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. స్నేహం ముసుగులో ఉన్న మేక తోలు కప్పుకొన్న పులులు. మంచిగా నటిస్తూ స్నేహితుడి భార్యనే అమ్మకానికి పెట్టిన ప్రబుద్ధుడు. రక్త సంబంధం కాకపోయినా దోస్త్ కదా అని నమ్మి ఇంట్లోకి రానిస్తే ఆ దోస్త్ నే నమ్మించి అతడి భార్యను విదేశాలకు అమ్మేసిన నయవంచకులూ ఉన్నారు. ఈ నవల చదివిన తర్వాతనైనా ఇటువంటి వాళ్ల భారిన పడకుండా కొంచెం జాగ్రత్త పడకమానరు. అన్నా! అని ఆప్యాయంగా పిలిచిన ఆమె తన సొంత అన్నలాగే భావించిన భారతినే మోసం చేసిన నీచుడు. కామపు చూపులతో ఆమె వైపు చూస్తుంటాడు.
ఇటీవల పక్కింటి వాళ్లనో, ఎదురింటి వాళ్లనో, మనతో ఉన్న వాళ్లనో అన్నయ్యా అని నోరార పిలిచి వాళ్లను నమ్మి వాళ్లతో బయటకు పోతే రేప్ చేసిన సంఘటనలు కోకొల్లలు. అందరూ భారతి లాగ తెలివితో తప్పించుకొనే పరిస్థితులు ఉండకపోవచ్చు.
దుర్గాదేవి భర్త తప్పులను మన్నించి అతనితో కాపురం చేసే సగటు మహిళ. భర్త స్త్రీ లోలత్వంను మార్చాలను కోదు. అతనిలో మార్పు తీసుకొని రావాలని ప్రయత్నించదు. కానీ ఇంట్లో పనిచేసే పనిమనిషిని మార్చుతూనే ఉంటుంది. భారతిని తన ఇంటికి తీసుకొని పోయినప్పుడు అయ్యో నీ కులమేదో ముందే అడగాల్సిందే. నిన్ను తాకిన చేత్తో నన్ను తాకుతాడంటుంది. కానీ అక్కడ ఆమెకు అన్యాయం జరగబోతుందన్న గ్రహింపుకూడ రాదు. జరుగుతున్న లైంగిక వాంఛ కన్నా ఆమెకు కులమే ఎక్కువైంది. వాళ్ల కులమైతే ఆగంచేసినా ఏంకాదా? ఆడ పిల్లకు అన్యాయం జరిగినా ఒప్పైపోతుందా? ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతుంటాయి.
' భారతి ' అందంతో పాటు తెలివిగల అతివ. సమయానుకూలంగా ఆలోచించగలదు ఓర్పు, సహనం,భయం అన్నింటికి ప్రతిరూపం ఆమె. తనను అమ్మేయాలని అనుకున్న నరేందర్ బారినుండి తెలివిగా తప్పించుకుని దుర్గాదేవి తనతో రమ్మని పిలిచిన వెంటనే ఆమెతో నడిచి ఆమె భర్త మానభంగం చేయాలని చూస్తే అక్కడ నుండి బయటపడి ఆ తర్వాత దారిలో కనబడిన స్వామిజీ వెనుక నడుస్తూ అతను మంచివాడా? చెడ్డవాడా అని సతమతమవుతున్న ఆమె మనసును కుదుటపరచుకుని ఆకలి, భయంతో రాత్రిపూట నిద్దుర లేకుండ గడిపింది. ఈకష్టాలు నాకెందుకిచ్చావ్ దేవుడా? అనుకుంటూనే ఈ కష్టాలతోనే నాకు బలం, ధైర్యం, ఓర్పు వస్తుందని తనను తానే సముదాయిం చుకుని కమలతో కలిసి తన ఊరిపెద్ద సమస్యను తొలగించుకుంటుంది.
కమల వాళ్ల అమ్మా నాన్న ,తమ్ముడితో కలిసి సంతో షంగా గడిపేది. ఆ దొరకన్ను వాళ్ల చెలకపైన పడనంత వరకు ఆ తర్వాత దొర పన్నిన ఉచ్చులో అమ్మ చనిపోయి నాన్న, తమ్ముడి కోసం పెద్దమ్మ చెప్పిన మాటలు విని ఉద్యోగం కోసం ఊరతనిని నమ్మి మోసపోయి వ్యభిచార గృహాంలో చిక్కుకుని అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత విముక్తి సంస్థలో పనిచేసి దొరగాని పీడ విరగడ వదిలించుకున్న యువతి.
విక్టోరియా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. భారతి చెప్పిన మాటలువిని " మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఎండ్లు గడిచినా కూడ మహిళలపై దాడులు, అత్యాచారాలు, అవమానాలు, వేధింపులు జరుగుతున్నవి అని బాధపడుతుంది. అంతే కాకుండ మహిళలను చైతన్యం చేయాల్సిన అవసరం ఏంతైనా ఉన్నదని ' విముక్తి ' అనే సంస్థలో ఎందరో ఆడవారిని సభ్యులుగా చేర్పించి అక్రమాలు, అన్యాయాలను ,మద్యపాన నిషేదం మొదలైన ఎన్నో కార్యక్రమాల్లోవారిని భాగస్వామ్యులను చేసి చైతన్యం చేసిన మహిళ.
చెన్నమ్మ ధైర్యవంతురాలైన మహిళ. ఆమె శక్తికొలది తమ చెలకను కాపాడుకోవడంకోసం తపించింది.
మన భారతీయ సంప్రదాయాల్లో కొందరు మూఢనమ్మ కాలను, దురాచారాలను నమ్ముతారు. చేతబడి, బాణామతికి ప్రాధాన్యత ఇస్తారు. చెన్నమ్మ విషయంలో అదే జరిగింది. దొర మాటలను నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా కులపోళ్ళు అందరూ కలిసి నానా హింసలు పెట్టి అతిక్రూరంగా మానంలో చీకులు పెట్టి చంపుతారు. పుష్పలత, చంద్రమ్మ, బొందలీల, సత్తెమ్మ ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం.
' బొందలీల ' జీవితంలోలాగ ఎంతోమంది ఆడపిల్లల పరిస్థితి అలాగే ఉంటుంది. మగాడికి మగతనం లేకపోయినా, పిల్లలు పుట్టరని తెలిసినా కూడ ఆమెదే తప్పంటారు. నరకయాతన పెడతారు. మంచితనంతో ఉంటూనే ఆస్తికోసం ఇబ్బందులు పెడతారు.
ఈ సమాజంలో ఆడవారిని దేవత, ఆదిశక్తి, పరాశక్తి అని పొగడ్తలతో ముంచెత్తుతూనే గుడి, బడి, ఆఫీసు,
ఆసుపత్రి, రైలు, బస్సు, ఆరుబయట, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు, అరాచాకాలు చేస్తున్నారు. గృహ హింస రోజు రోజుకు పెరుగుతుంది. ఆడదంటే పిల్లల్ని కనే యంత్రంగా భావించి వంశోద్దారకుడి కోసం " భూమాతను తవ్వి ఎట్ల డొల్ల చేస్తుంటారో అలా ఆమె శరీరాన్ని డొల్ల చేస్తున్నారు ". ప్రేమ పేరుతో మోసం, పెళ్ళి పేరుతో మోసం చేస్తున్నారు. దీనికి కారణం ఆడపిల్లలు సున్నితమైన మనసుగల వాళ్లు. వాళ్ల భావాలను వీళ్లు అడ్డుపెట్టుకుని స్నేహం, ప్రేమ బంధాలను కలుపుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నవాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే ఆడవాళ్ళు చైతన్యవంతులై ఉండాలి. ఆత్మ రక్షణ విద్యలు కూడా నేర్చుకోవాలి.
' విముక్తి ' నవలలో లాగ మహిళల కోసం సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ, మహిళా సంఘాలను ఏర్పరచి ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. చట్టాల్లో, రిజర్వేషన్లలలో మార్పు ఎప్పుడొస్తుందో అప్పుడే కుల, మతరహిత సమాజం, లింగ వివక్షత లేని, అసమానతలు లేని సమాజం ఏర్పడి ఈ మహిళలకు రక్షణ ఉంటుంది.
' విముక్తి ' నవల ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చు తుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. సిస్టర్ అనసూయ గారికి అభినందనలు.
ప్రతులకు :
సిస్టర్ అనసూయ
ఇం.నెం.5-12-409/3
శ్రీనివాస కాలనీ, బి.టి.ఎస్.
నల్లగొండ - 508 001.
సెల్: 8074573716
E - mail : sisteranasuya344@gmail.com