చీకటి తెరల సంక్షోభాలను తొలగించిన మామిడి హరికృష్ణ కవిత "వేకువజాము ప్రశ్న !" ను ఇక్కడ చదవండి:
వేకువజాము ప్రశ్న !
ఒకానొక తొలి వేకువ జామున
ఇంకా వీడిపోని చీకట్ల సందిగ్ధత లోంచి
ఆమె అడిగింది "నువ్వు ఎవరు?" అని.....
"కవివా, గాయకుడివా, చిత్రకారుడివా, పిచ్చివాడివా, మోసగాడివా
ద్రోహివా, భక్తుడివా, విరాగివా , కాముకుడివా, సంస్కర్తవా
జ్ఞానివా, చిన్నారి పిల్లాడివా, లోకోద్ధారకుడివా, వంచితుడివా, బాధితుడివా
నాకు తండ్రివా, నేస్తానివా, సహచరుడివా, దేవుడివా, బిడ్డవా? " అని ....
అతను ప్రశాంతంగా కళ్ళు తెరిచి ఆమె కళ్ళలోకి చూస్తూ
పెదవుల కొసలతో చిరునవ్వి
మళ్ళీ అర్థ నిమీలిత నయనుడయ్యాడు !
ఆమెకు సగమేదో అర్థమైంది
అర్థం కాని సగమేదో కలవరపరిచింది
ఈసారి అయోమయంలో
ఆమె అతడికి దగ్గరగా వచ్చి
అతన్ని పట్టుకుని కుదుపుతూ మళ్ళీ అడిగింది
"ఓయీ సంచారీ! నీ గురించి ఎవరెవరో ఏదో అంటున్నారు
మరి నువ్వు ఎవరు?" అని....
"దేశదిమ్మరివా, యోగివా, సుఖ భోగివా, సన్యాసివా, సంసారివా
కార్మికుడివా, కర్షకుడివా, శ్రామికుడివా, ప్రేరకుడివా, ప్రియుడివా
భూకంపానివా, ఇసుక తుఫానువా, వాయుగుండానివా, సునామీవా, హిమపాతానివా
విధ్వంసానివా, వినాశనానివా, నిర్మాణానివా, సృష్టికర్తవా, యధాతధ వాదివా?" అని....
ఈసారి అతను కళ్ళు పూర్తిగా తెరిచి
పద్మాసనం విడిచి పైకి లేచి
ఆమె ఎదురుగా నిలిచాడు
ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని
ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
నిర్మలంగా అన్నాడు---
"అవి ఏమీ కాదు
నేను........ నువ్వే !"
చీకటి తెరల సంక్షోభాలు తొలగిపోయాయి ....!
వెలుగు రేఖల కిరణాలు ఉదయించాయి.... !!