దళిత బహుజన రచయిత, కవి గాదె వెంకటేష్ కవిత్వ సంపుటి "పొలి" పైన రాము రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
" చేసేది ఇంజనీరింగ్. ఇప్పుడు చేస్తున్నది మాత్రం తరాల వారసత్వ కళా ప్రదర్శన 'జంజేజ్జనంక జెజ్జనంకం...' నా లోపట మాత్రం పర్వతం బద్దలు అవుతున్నది. అంగట్ల కాటకలిసినట్లున్నది. ఏంజెప్పాలె ? ఏం జెయ్యాలె ? ఇదేమన్నా దొంగతనమా ? లంగతనమా ? నా కులం నాకిచ్చిన కళ! నా వాళ్లంతా ఎన్నో ఏండ్లుగా ఇట్లా చిర్రా చిటికెనలు ఆడిస్తూ పొట్టపోసుకుంటున్నారో.. నేనెందుకు సిగ్గుపడాలె ఈ కళ పట్ల ఇతరులకు గౌరవం లేకపోవచ్చు కానీ నాకు గుండెల నింకా పాయిరమేనాయే... ఎవ్వడు ఏమన్నా అనుకోనీ..." - గాదె వెంకటేష్ 'బత్తెం' కథలో ఘట్టం.
తన కులం మూలాలు మరిచిపోని, ఆత్మన్యూనత దరిచేరనీయని, దళిత చైతన్యాన్ని ప్రదర్శించే యువకుడి మానసిక స్థితి ఇది. ఇందులో కథారచయితే.. కథానాయకుడు. ఇంకేముంది? జీవితానుభవాల్ని అద్భుతంగా మలిచే కళ, కథనం రెండూ మేళవించిన వెంకటేష్ రచనలకు కొత్తగా పరిచయం అక్కర్లేదేమో. ఈ కవి, కథకుడి రచనల్లో దాదాపుగా బహుజన, శ్రామిక కులవృత్తుల వారందరూ ఎవరికి వారు ఆయా పాత్రలోనో, కవితల్లోనో నిలబడి చూస్తే.. ఆత్మగౌరవ స్ఫూర్తి రగిలి, ఆత్మ న్యూనతాభావం దూరమవడం ఖాయం. అంతటి శక్తివంతమైన అంశాల్ని పాఠకులకి అందిస్తున్నందుకు అందరం అభినందించాల్సిందే.
మూసీ సాహితీ వేదిక వెలువరించిన, గాదె వెంకటేష్ మొదటి కవితా సంకలనం " పొలి - ముల్కి మూలవాసీ కవిత్వం". అంబేద్కర్ స్ఫూర్తి, దళిత చైతన్యం, బహుజన దృక్పథం, స్త్రీ, కులవృత్తుల వెతలు, గ్లోబలైజేషన్, తెలంగాణా ఉద్యమం, వంటి అనేక అంశాలు ఈ సంకలనంలో కవితా వస్తువులు. తొలి కవిత "గుడిసె" లోకి ఆహ్వానిస్తూ... చిన్ననాటి పేదరికపు వర్షాకాల అనుభవాల్ని మనతో కూడా నెమరు వేయించే విధంగా..
వాన పడుతున్న ఆనవాళ్ళ ఆసన
ఆడుకుంటున్న నన్ను
అంగలేయిస్తూ తరుముతూనే ఉంది
అయిన...
ఆగని వాన అందుకోనే అందుకుంది
కోళ్ళ గుడును, పోయిల కట్టెలను
తంగడి చెక్కెను తడుపనే తడిపింది.
దండెం మీద బట్టలు
కాగుల నూకలు
సీకుకు గుచ్చిన కాయితాలు
మూలకున్న ఎర్రమన్ను
ఉత్తిమీద అటిక
ఆరబెట్టిన ఒరుగులు
.... ఇట్ల సగటు పల్లె జీవితాల్లో భాగమయిన వస్తువులు, ఒక రకంగా చెప్పాలంటే ఈ తరానికి దాదాపుగా అపరిచితమైన వస్తువులు, జీవిత క్రమాన్ని గుడిసే కవితలో బంధించాడు. మారుతున్న జీవన పరిణామ క్రమం అంతా నగరీకరణ, ప్రపంచీకరణకు అనుగుణంగానే జరుగుతున్నందున... "నిన్ను నీకు కాకుండా చేయాలంటే... ముందు నీ సంస్కృతి నీది కాకుండా చేయాలి' అనే పెట్టుబడి సూత్రం / globalization formula పనిచేస్తున్న స్పృహ మనకెవరికీ లేకుండా పోతుంది. ఇదే సూత్రం ప్రపంచ వ్యాప్తంగా.. జరిగిన ఉద్యమాలకీ, పోరాటాలకీ వ్యతిరేకంగా పనిచేసింది, చేస్తూ ఉంది. ఆరుదశాబ్దాల తెలంగాణా ఉద్యమంలో కూడా అంతర్లీనంగా పాతుకుపోయిన వలస పెట్టుబడి విధానాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాం. భాష, సంస్కృతి, పండుగలు, వేషధారణ, తిండి , ఇలా ఒక్కొక్కటీ అవహేళనకు గురవటం వెనుక దాగిన అసలు రహస్యం.. ఆధిపత్య అహంభావాన్ని నింపిన పెట్టుబడి విధానమే. ఇలాంటి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న వాడిగా వెంకటేష్ ని ప్రోత్సహిద్దాం.
బతుకుతున్న క్రమంలో, జీవితంలో తనకు ఎదురైన great personalities ని మనకు పరిచయం చేస్తున్న తీరుకి మనం కూడా వాళ్ళని గొప్పవాళ్ళని ఒప్పుకుంటాం.
ఎడమ చేతిలో నైనా
ఏసుపోకుండా ఎద్దు
పోగులేసే నా తాతే ఓ సోషలిస్టు.
పర్రెలు పట్టి పగిలిన లందగోలాలే
మా కెమికల్ టెక్నాలజీకి సాక్ష్యాలు
మిగ్గు చేసిన
తోళ్ళు కోసిన వేళ్లగాట్లే
మా లెదర్ టెక్నాలజీకి తార్కాణాలు -
నిత్యజీవితంలో మనం విస్మరిస్తున్న శాస్త్రవేత్తల్ని పరిచయం చేస్తున్నప్పుడు.. సమాజాన్ని నిశితంగా పరిశీలించే లక్షణం కవిగా వెంకటేష్ ని ప్రత్యేకంగా నిలబెడ్తుంది . ఇవ్వాళ్టి మార్కెట్ యుగం, వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత, మారుమూల గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న ఆధునికత ఇవన్నీ చూస్తుంటే. "మనిషికి మనిషీ బంధాలన్నీ... మార్కెట్లోని సరుకులాయెనా?" అన్న కలేకూరి ప్రసాద్ మాటలు గుర్తొస్తుంటాయ్. మనిషి సౌకర్యం కోసం.. మానవ సంబంధాలను పణంగా పెట్టటమే దీని వెనుక నిషాదం !
ఇక 2002 లోనే రాసిన సైద్ధాంతిక అనే కవితలో.... తెలంగాణా స్వప్నం ఫలించిన తరువాత జరిగే పరిణామాల్ని -
"సైద్ధాంతికంగా వస్తే సర్దుకోగలమేమో కానీ
భౌగోళికంగా వస్తే
మా బుడ్డగోషోళ్లకు ఒరిగేదేం లేదు
రోజంతా పని.. చింపనిండ గంజి ..
చెప్పుల గంప.. చేతిన దుస్సన గూటం..
పురుగుల మందొక్కటే నిజాయితీగా వుంది
గుండె బరువెక్కినప్పుడు బండ చేసుకొని పాడె ఎక్కడానికి
తెలంగాణా మట్టిలో కలిసిన
స్థూపాలై మొలకెత్తి.. సూటిగా హెచ్చరిస్తున్నాయ్
తెలంగాణా తెచ్చుకోకుంటె మీ బతుకులు విచ్చుకోవని
బొక్కలపై తొడుక్కున్న తోలును ఉంచుకోలేరని.."
అంటూ భౌగోళిక తెలంగాణా నిష్ప్రయోజనాన్ని, అలాగే సైద్ధాంతిక / సామాజిక / బహుజన తెలంగాణా ఆవశ్యకతని వివరించే ప్రయత్నం చేస్తాడు.
అసలు... దేశభక్తి నిర్వచనాన్ని ఏ కోణం లోంచి చూడాలి? దేశభక్తుడంటే ఎవరు? అనే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాన్ని వెతుక్కుంటూ... సమాజంలో వివక్షకు గురయ్యే వారి తరుపున నిలబడి వారి నిజాయితీని "ఎవరు?" అనే కవితలో
పుడమి తల్లి పొత్తిల్లలో నెత్తుటి విత్తనాలు వేసి
పట్నపోల్లకు పెరుగన్నం పెట్టి
తాను పురుగులమందు తాగే
నా దేశ పెదరైతుకన్నా గొప్ప దేశభక్తుడెవరు?
పెట్టే ప్రతీ Application లో 'Indian' అని రాసే నిరుద్యోగి కన్నా దేశభక్తుడెవరు?
మైనార్టీలపై మతదాడులు చేస్తున్నా
India is my contry అని పాడే
ముస్లిం, క్రైస్తవుడి కంటే దేశ భక్తుడెవరు?"
అని దేశభక్తులంటే ఎవరో? ఎంత వివక్షకు గురవుతున్నా, ఈ దేశ పాలక వర్గాల వల్ల ఎంత అణిచివేయబడ్డా తమ దేశభక్తిని రుజువు చేసేవారికి మనం కూడా సలాం చేద్దాం !
ప్రపంచీకరణ నేపథ్యంలో రాసిన "గ్లోబల్ గత్తర" కవితలో...
" ఫారెక్సు డబ్బాల fast culture సానైనయ్
ఆధునికీకరణలో అమ్మ రొమ్ము నిప్పల్ అయింది.
సాఫ్ట్ వేర్ రంగుల కలలో ఒకడు
సాగునీరు లేక తల్లడిల్లేది ఇంకొకడు
గొడ్డుకు గడ్డి లేదు
వండిన కూడు తినేదాకా నమ్మిక లేదు
పత్తి బెట్టిన రైతు బొక్కలు పోయి బొందల గడిచినయ్"
గ్లోబలైజేషన్ గురించి ఎవరు ఏం చెప్పినా "ఆధునికీకరణలో అమ్మ నిప్పల్ అయింది" అనే వాక్యానికి చరిత్రలో నిలిచిపోయే అర్హత ఖచ్చితంగా వుంది.
గాదె వెంకటేష్ తాను చదువుకున్న హాస్టల్ అనుభవాల్ని, " హాస్టల్ బతుకు" గా మనతో పంచుకుంటూ
" కచ్చె పెచ్చె బువ్వల గంటెడు కూర
పచ్చిపుల్సు పేర పసుపు నీళ్ళు
ఆఖరకు సల్ల పోసుకుంటే
తేన పురుగులను దేవి పారేసి
జుర్రుకు తాగితే
తెలవకుండా తెన్పులిచ్చిన తెల్లపురుగులు
జీలకరై నలిగిన లెక్క పురుగులు లెక్కకు సిక్కువాయె"
అంటూ ఆర్థిక స్తోమత సరిగాలేక, చదువుకునే అవకాశం సొంతూళ్లో దొరకక ఎన్నో కష్టాలను దిగమింగుకునే సగటు దళిత విద్యార్థి. ఆమాటకొస్తే సగటు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థి దుర్భర జీవితాన్ని కళ్ళకు కడతాడు. నిధులు సరిగా మంజూరవ్వక, వచ్చిన నిధులు అధికారుల చేతివాటానికి బలైపోగా, మిగిలిన డబ్బుల్లోంచి అరకొర సామాగ్రి, అనారోగ్య వంట సామాగ్రి, అపరిశుభ్ర వాతావరణం, వీటన్నిటి మధ్య ఎందరు చిన్నారులు నిద్రలేని రాత్రుల్ని అనుభవిస్తున్నారో ఒక్కసారి కళ్లారా చూస్తేగానీ, ఆ భోజనం తింటే గాని అర్థమవ్వదు. "మిణుగురులు" సినిమాలో కూడా ఇలాంటి జీవితాల్ని ప్రతిబింబించారు.
ఇవే కాకుండా ఇంకా చాలా అంశాలపై సామాజిక స్పృహతో కలాన్ని ఎక్కుపెట్టిన వెంకటేష్ "పోలి" ఉద్యమ చైతన్య శిల్పాన్ని చెక్కే ఉలిగా ఉపయోగపడుతుందనేది వాస్తవం. పద్మశాలీల బతుకులపై, వారి పనిముట్లపై రాసిన "బద్దెవడ్డది" , స్త్రీలపై జరిగే అన్ని అరాచకాలకీ వ్యతిరేకంగా "స్త్రీ" , ట్యాంక్ బండ్ విగ్రహ వినిర్మాణంపై "తెహరీక్ బండ్" , కంకర మిషన్లు నమిలేస్తున్న గుట్టకోసం "గుట్ట" , దళితులపై జరిగిన అమానుష దాడులు చండూరు, లక్ష్మింపేటల నేపథ్యంలో " సామాజిక సంక్షోభం" ఇంకా చాలా కవితలు పాఠకుల్ని సమాజం పట్ల ఆలోచింపజేస్తాయి. ముందుముందు మరిన్ని సామాజికాంశాలతో కథలు, కవితలు రాయాలని వెంకటేష్ ని అందరం ప్రోత్సహిద్దాం.