నక్కా హరికృష్ణ తెలుగు కవిత: కాళరాత్రి కౌగిలి

By telugu team  |  First Published Oct 1, 2019, 3:20 PM IST

రాతి పొరల కింద/ అసహజ సుప్తావస్థను పరుస్తూ/ పాలిమర్ అడుగులు, రసాయన తాపాన్ని రగిలిస్తున్నది/ నిస్సహాయ/ ప్రాణం రోదిస్తుంది అంటున్నాడు తెలుగు కవి నక్కా హరికృష్ణ తన కవిత కాళరాత్రి కౌగిలిలో...


ఎన్ని రోజులైందో
సూర్యున్ని వీడని గ్రహణం
ఉదయం
విష మేఘాల సుడులలో
తూలిపడుతూ లేస్తుంది

రేడియేషన్ పంజరాన
మెదడు అచేతనమైన
పిచ్చుక హృదయ ధ్వని
మట్టిని ప్రతిస్పందింపచేయ శ్రమిస్తుంది

Latest Videos

రాతి పొరల కింద
అసహజ సుప్తావస్థను పరుస్తూ
పాలిమర్ అడుగులు
రసాయన తాపాన్ని రగిలిస్తున్నది
నిస్సహాయ
ప్రాణం రోదిస్తుంది.

విస్తుపోయిన నక్షత్రాలు
వాటి బింబాలను అవే మర్చిపోయాయి
ఓ విషాద ఛాయా
రాత్రివేళల్లో కాంతి రూపాన్ని ధరించిన మిథ్యా వర్తనం
సున్నితంగా
మిణుగురులపై దండెత్తింది

ఎక్కడి నుండి వస్తుందో
భూమిని దంచుతున్న శబ్దం
చెవి రంధ్రాల్లో
మరణాన్ని నూరిపోస్తుంది

కాలరాత్రి కౌగిలి
ఆత్మ ఘనీభవించిన
అవకాశవాద ఎడారి ...
కూర్చున్న కొమ్మను నరుక్కుంటూ
మనిషి తయారుచేసిన కాలం
ఇది పర్యావరణ హత్యా పర్వం

  - నక్క హరిక్రిష్ణ

ప్రమోద్ ఆవంచ కవిత: జ్ఞాపకాల సందడి

 

click me!