వేణు నక్షత్రం అనే తెలుగు రచయిత వాట్స్ అప్ పేర రాసిన కథ అత్యంత ఆసక్తికరంగా ఉంది. వాట్సప్ సాధారణ జన జీవితంలో ఎలా భాగమైందనే విషయంపై ఆయన ఆసక్తికరంగా కథరూపంలో చెప్పారు.
"అరేయ్ సూర్య, హైదరాబాద్ ల రియల్ ఎస్టేట్ బూమ్ మస్తుంది, ఇంకా ధరలు పెరగక ముందే ఒక ప్లాట్ తీసుకో" ఆఫీస్ పనిలో బిజీగా ఉన్న నాకు ఒక రోజు హైదరాబాద్ నుండి చెడ్డీ దోస్త్ సాగర్ వాట్సాప్ కాల్. ఒక పది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా వచ్చి ఇప్పుడు శానోజే అనే నగరంలో స్థిర పడ్డ ఒక సగటు ఐటీ ఉద్యోగిని నేను.
ఇంతకు ముందు నెలకో, రెండు నెలలకో ఒక సారి ఫోన్ చేసే మాట్లాడే వాళ్ళం ఇండియాలో ఉన్నమిత్రులతో, చుట్టాలతో. ఫోన్ చేసిన ప్రతి సారి ఇన్ని రోజులకి గుర్తుకి వచ్చామా అని కొంత సేపు తిట్లు, అలగటాలు. ఇప్పుడు ఆ బాధ తప్పింది, వాళ్ళే ఏకంగా ఫోన్లు చేస్తున్నారు. సాగర్ చాల రోజుల నుండి ఒక ప్లాట్ తీసుకోమని వెంట పడుతుంటే తప్పదన్నట్లు ఒక ప్లాట్ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ అంతా జరిగి పోయింది వెంటవెంటనే.
"నువ్వయితే ఇక్కడ ఉండవ్, ఏ యాడాదికో, రెండేండ్లకో ఒక సారి వస్తావ్! నువ్విక్కడ లేవని తెలిస్తే ఎవడో ఖబ్జా పెడ్తడు, గందుకే ఒక కాంపౌండ్ వాల్, చిన్న గేట్, ఒక చిన్న రూమ్ కట్టిచ్చి పెట్టుకుంటే సేఫ్ గా ఉంటుంది" అని సాగర్ చెపితే, సరే ఎవరన్నా మేస్త్రీని చూడమన్నాను, గేట్ కోసం కూడా డీటెయిల్స్ పంపమన్నాను.
ఒక రెండు రోజుల తర్వాత వీకెండ్ చూసుకొని సాగర్ పంపిన మేస్త్రీ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడాను. కాంపౌండ్ వాల్, చిన్న గేట్, ముందు నడవడానికి స్టెప్స్ అని కొన్ని వివరాలు చెప్పి ఎస్టిమేషన్ పంపమన్నాను.
"సార్ మీకు వాట్స్ ఆప్ ఉందా ?" చాలా డౌటుగా అడిగాడు మేస్త్రీ.
"ఆ ఎందుకు లేదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న నంబర్ అదే వాట్సాప్ నంబర్" వాట్సాప్ ఉండడం అనేది ఇంపోర్టెడ్ కారు కొన్న లెవల్లో ఒక ప్రేస్టీజి లాగా అనిపించింది ఆసమయంలో, వెంటనే జవాబిచ్చాను.
"సరే సార్ అయితే మీకు ఎస్టిమేషన్ వాట్స్ అప్ లో పంపుతా" నేను సరే అని కూడా చెప్పక ముందే ఫోన్ కట్ అయ్యింది.
"అమ్మో, ఇతనెవరో కానీ నా కంటే బిజీ పర్సన్ లాగ ఉన్నాడే!" అనుకొని కట్ అయిన ఆ ఫోన్ నంబర్ చూస్తూ సాగర్ పంపిన ఇంకో నంబర్ కోసం వెదికి డయల్ చేసాను. అది గేట్ కోసం ఐరన్ స్టోర్ వారిది.
"సార్, మీ వాట్సాప్ కి అన్ని డిజైన్స్, ప్రయిస్ లిస్ట్ పంపుతాను, చూసుకొని రిప్లై చేయండి" చుట్టూ చాలా హడావడిగా ఉన్నట్టుంది, గేట్లు చేస్తున్న ఐరన్ రేకుల శబ్దాలు స్పష్టంగా వినవస్తున్నాయి. ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టే సాడు. అబ్బో, ఈయన కంటే ఆ మేస్త్రీయే కొంత నయం, కనీసం మీకు వాట్సాప్ ఉందా అని అడిగాడు, ఇతనయితే ఆ ముక్క కూడా అడగలేదు.
"ఫోన్ ఉన్న ప్రతీ మనిషికీ తప్పని సరిగా వాట్సాప్ ఉండి తీరాలి" అని డిసైడ్ అయినట్టున్నాడు అనుకుని ఆశ్చర్యపడడం తప్ప ఇంకేమి చేయలేము కదా! ఫోన్ పెట్టేసిన కొన్ని సెకండ్స్ లో ఫోన్లో వాట్సాప్ కి ఫొటోస్ వస్తూనే ఉన్నాయి ఒక దాని తర్వాత ఒకటి. నా ఫోన్ లో అన్ని వాట్సాప్ గ్రూపు సెట్టింగ్స్ సైలెంట్ లోనే ఉంటాయి కాబట్టి పెద్దగా రింగ్ సౌండ్ రాదు, ఎప్పుడో ఎవరన్నా ఇలా ప్రత్యేకంగా నాకోసం పంపితే తప్ప. ఫోటోలు వస్తూనే ఉన్నాయి, ఫోన్ మ్రోగుతూనే ఉంది. మొత్తం ముప్పై ఫోటోలు, ముప్పై సెకండ్లు కూడా పట్టలేదు. ఆ వాట్సాప్ నోటిఫికేషన్ సౌండ్ కి మా ఇంట్లో అందరూ ఏదో వింతగా నా వైపు చూస్తున్నారు.
ఫోన్ రింగ్ సౌండ్ ఆగిన తర్వాత ఒక వింత ఫోజు ఒకటి నా ముఖం పై విసిరి ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు మా ఇంట్లో. ఎదో తప్పు చేసినట్లు అందరూ నన్ను చూస్తుంటే, కొద్ది సేపు నాకేమీ అర్థం కాలేదు. ఈ వాట్సాప్ మెసెజెస్ వల్ల, ఆ రింగ్ సౌండ్ వల్ల నేను ఏదో తప్పు చేసినట్టు కొంత ఇబ్బంది పడ్డ విషయం మాత్రం నిజం. ఆ షాక్ నుండి బయట పడి, మా ఆవిడని పిలిచి ఏదో ఒక గేట్ సెలెక్ట్ చేయమన్నాను. మొత్తానికి ఒక డిజైన్ ఫైనల్ చేసి పంపాము.
మేస్త్రీ నుండి ఎస్టిమేషన్ వచ్చింది తెలుగు లిపిలో. ఎప్పుడో ఫ్రెండ్ చెపితే ఫోన్ లో తెలుగు కీ బోర్డు డౌన్లోడ్ చేసుకున్నాను కానీ పెద్దగా ఉపయోగించింది లేదు. తెలుగులో జవాబు ఇవ్వడానికి ప్రయత్నించాను. రెండు మూడు నిమిషాలలో ఒక చిన్నమెసెజ్ టైప్ చేయగలిగాను. కానీ నేను పంపిన కొన్ని సెకండ్లలోనే మేస్త్రీ నుండి జావాబు వచ్చింది, అదీ రెండు మూడు లైన్ల మెసేజ్. ఏదో ఐటీ లో ఉండి పొడిచేస్తున్నాం అనుకున్న కానీ ఒక మేస్త్రీ కి వెంటనే జవాబు ఇవ్వలేని నా ఐటీ నాలెడ్జి తలచుకుంటే సిగ్గుగా అనిపించింది. నిత్య జీవితాల్లో టెక్నాలజీ ఇంత బాగా ఉపయోగించుకోవడం చూస్తుంటే ముచ్చెటేసింది.
***
థాంక్స్ గివింగ్ ప్రమోషన్ నడుస్తుంది, యాభయ్ శాతం డిస్కౌంట్ అని ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నుండి శానోజే లోని మా ఇంటికి ఒక బ్రోచర్ వస్తే వివరాలు కనుక్కుందాం అని ఆ కంపెనీకి ఫోన్ చేసాను.
"క్రియేటివ్ ఇంటీరియర్స్! దిస్ ఇజ్ డేవిడ్ స్పీకింగ్" అని చాలా హుందాగా జవాబు వచ్చింది అవతలి వైపు నుండి.
"వెబ్సైటులో మా ఈమెయిల్ ఉంటుంది, ముందు మీ ఇంటి ఇంటీరియర్ ఫోటోలు తీసి, మా సైట్ కి అప్లోడ్ చేస్తే మేము చేయబోయే శాంపిల్ డిజైన్స్, ఎస్టిమేషన్ డిజిటల్ గా పంపుతాము" ప్రమోషన్ వివరాలు తెలుమని అడిగిన నాకు డేవిడ్ నుండి వచ్చిన సమాధానం అది. డేవిడ్ లైన్లో ఉండగానే వెబ్సైటు ని ఓపెన్ చేసి అప్లోడ్ వివరాలు చూస్తే , ఫోటోలు తీసి , స్కాన్ చేసి పంపమని ఉంది . ఐఫోన్ వచ్చిన తర్వాత ఇంకా స్కాన్ చేయడమేంటి? ఈ వెబ్సైటు ఇంకా అప్డేట్ చేయలేదని అర్థం అయ్యింది. ఫోటోలు తీయడం, వెబ్సైట్ కి లాగిన్ కావడం, అప్లోడ్ చేయడం, అబ్బా ఎంత పెద్దపని అనిపించింది. వెంటనే వాట్సాప్ గుర్తుకు వచ్చింది, అది అయితే ఈజీ గా ఫోన్ నుండి పిక్స్ తీసి పంపవచ్చు కదానిపించింది.
"హే డేవిడ్, కెన్ ఐ హావ్ యువర్ వాట్సాప్ నంబర్, ఐ విల్ సెండ్ అల్ పిక్స్ ఇన్ వన్ మినిట్" హైదరాబాద్ మేస్త్రీ, ఐరన్ గేట్ వాళ్ళు నాతొ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని నేను అవే మాటలని ఇక్కడ ఇంగ్లిష్ లో చెప్పడం జరిగింది. పెన్ను, పేపర్ రెడీగా పెట్టుకొని డేవిడ్ వాట్సాప్ నంబర్ రాసుకోవడానికి ఎదురు చూస్తున్నాను.
"వాట్సాప్ నంబర్.. ? వాట్ ఇస్ వాట్సాప్ బైది వే.." చాలా ఆశ్చర్యంగా డేవిడ్ నుండి రిప్లై వచ్చింది.
"వాట్సాప్ అంటే ఏంటి?" అంటే వాడికి ఎలా చెప్పాలి? వాట్సాప్ తెలియదా? నాకు చుక్కలు కనపడ్డాయి, బుర్ర వేడిక్కింది
ఆ షాక్ కి.
తర్వాత షాక్ నుండి కోలుకుని, మొబైల్ ఫోన్ ఆప్ అని చెపితే..
"సారీ, మేము మొబైల్ ఆప్ లో బిజినెస్ చేయలేము, ఓన్లీ వెబ్సైట్ " అని ఇంగ్లీష్ లో చెప్పడం వింటుంటే, వాడు నన్ను ఒక వెర్రి వాడుగా జమ గడుతూ ఫోన్ పెట్టేస్తున్నట్లు అనిపించింది. నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు. "అడ్వాన్స్ కంట్రీ, అడ్వాన్స్ టెక్నాలజీ, తొక్క, తోలు! ఇదేనా అడ్వాన్స్? అందరి అరచేతుల్లో ఆడి పడుతున్న వాట్సాప్ తెలియదు, మేము ఉపయోగించము అని చెప్పడం వాళ్ళ మూర్ఖత్వమా, అజ్ఞానమా?" ఫోన్ పెట్టేసి చాలా సేపు అలా ఆలోచిస్తూ కూర్చున్నా.
మిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక కంపెనీ ఇంకా వెబ్సైటు అంటూ, ఇమెయిల్ , ప్యాక్స్ అంటూ కాలాన్ని వృధాచేయడం అజ్ఞానమే అనిపించింది. అంతెందుకు, ఈ మధ్య రైతు బజారులో కూరగాయలు అమ్మే రైతులు కూడా రోజు వారి ధరలని వారి గ్రూప్స్ లో పంచుకొని అందరూ ఒకే రేట్ కి అమ్మడం, విని చాలా ఆశ్చర్యం కలిగింది.
నా ఐటీ అనుభవం, పెద్దగా చదువుకోని ఒక మేస్త్రీ కి జవాబు ఇవ్వడంలో వెలవెల పోయింది. బాగా పేరున్న ఒక పెద్ద కంపెనీకి ఫోటోలు పంపడానికి గానీ, వాళ్లని ఒప్పించేందుకు గానీ నా ఐటీ అనుభవం పనికి రాలేదు. నా పరిస్థితి కి నా పై నాకే సిగ్గు వేసినా, వహ్వా ఇండియా! మేరా భరత్ మహాన్ అని అరవాలనిపించింది, కానీ చుట్టూ పక్కల పరిస్థిని చూసి అరవకుండా ఉండి పోయాను. ఇన్నిరోజులు నేను ఒక పెద్ద అభివృద్ధి చెంది, టెక్నాలజీ లో దీన్ని మించిన దేశం లేదు అనే భ్రమలో బతికానేమో అనిపిస్తుంది. వాట్సాప్, ఫేస్బుక్, టిక్ టాక్ లే కాదు, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా వాడడం లో మాత్రం మనకు మనమే గొప్ప అనిపించింది. ఆ "మనం" అనే ఖ్యాతి లో నన్ను నేను కూడా కలుపుకోవడం అప్రయత్నంగా జరిగింది మాత్రమే! ఇతరుల విజయాన్ని మన ఖాతాలో వేసుకోవడం మన రక్తంలోనే ఉంది కదా!
- వేణు నక్షత్రం
మరిన్ని కథలు
వనపర్తి పద్మావతి తెలుగు కథ: స్మృతి వనం